మాట్లాడుతున్న సురేష్‌బాబు
కడప అగ్రికల్చర్: ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన కేవలం జిమ్మిక్కులు.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికే తప్ప చిత్తశుద్ధితో చేసిన పనికాదని వైస్సార్‌సీపీ కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి ని«ధులు తెచ్చుకుని వాటిని దిగమిగుతూ, హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ 120 రోజుల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి కొత్త డ్రామాకు, నాటకానికి తెరలేపారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 1700 రోజులు గడిపోయాయని, ఇక మిగిలింది తట్టాబుట్టా సర్దుకునే సమయంలో జిల్లా ప్రజలను, రైతులను, నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఉక్కుదీక్షకు కూర్చొబెట్టి నాడు నాటకం ఆడారన్నారు. ఇప్పుడు శంకుస్థాపనతో ప్రజలను పక్కదోవ పట్టించడానికి డ్రామా లాడుతున్నారన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రైతులకు ఉపాధి కల్పిస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించగానే సీఎం ఆయన మంత్రులు ఉలిక్కిపడి ఇప్పుడు శంకుస్థాపన చేశారని అన్నారు. కేవలం 120 రోజుల్లో ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విభజన సమయంలో కేటాయించిన రూ.1600 కోట్లు కాగా, దాన్ని తామే చేపడతామని రూ.58వేల కోట్లకు పెంచుకుని కమీషన్లు దోచుకుని ప్రాజెక్టు పూర్తికాకుండా చేశారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని మా నాయకుడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వివరిస్తూ జనం మధ్య తిరుగూ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీలపై పోరాటాలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రతి సభలోను ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రతి సభలో నాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పడం దారుణమన్నారు. అక్రమాలను, అవినీతిని అడ్డుకుంటున్నామేగానీ, అభివృద్ధికి ఎనాడు అడ్డుపడలేదని అన్నారు. ఉక్కుఫ్యాక్టరీ సాధన కోసం ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఆర్‌సీపీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎన్నో హామీలు ఇస్తూ పోతున్నా ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. రైతులు, ప్రజలు ఉమ్మివేస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీసీ వర్గాల ప్రజలను, చేతి వృత్తుల వారిని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం రాగానే బీసీ కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైన చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలు, ఇతర వర్గాల పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చి ఉన్నత చదువులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ యుత్‌వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకా సురేష్, పార్టీ నగర అధ్యక్షుడు పులి సునిల్ కుమార్, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కడప పార్లమెంటు అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment