సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగులో 42 వేల ఇల్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందని వైఎస్సార్ సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సురేష్ బాబు, రవీంద్రనాథ్ రెడ్డి, పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్దిలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మంత్రి సొంత గ్రామంలో ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారని, దాన్ని ఓర్చుకోలేక బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ వారిని మళ్లీ టీడీపీలో చేర్చుకున్న ఘనత ఆదినారాయణరెడ్డిదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లాకు కృష్టా జలాలు రావటానికి వైఎస్సార్ కారణమని, దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆ ఘనత కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పోటీచేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆదికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్ చలువ వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావన్నది మర్చిపోవద్దు. మార్కుఫెడ్ ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డ మంత్రి ఆదినారాయణరెడ్డి.. నీ స్థాయి ఏమిటో గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిది. లేదంటే ప్రజలు నీకు తప్పనిసరిగా బుద్ది చెబుతార’ని అన్నారు. అనంతరం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి స్థాయిలో ఉన్న ఆదికి తగదు. కారంచేడు సంఘటన నుంచి ఇప్పటివరకు దళితులపై దాడులకు టీడీపీ కారణం. రాబోయే రోజుల్లో దళిత వర్గాలు మీకు బుద్ది చెప్పడం ఖాయం. ఓట్ల కోసం దళితుడు కావాలి కానీ పక్కన కూర్చోవడానికి టీడీపీకి దళితుడు అవసరం లేదా’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment