సురేశ్‌బాబు, రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి (ఫైల్)
సాక్షి, కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రతి పనుల్లో లక్షల కోట్ల రూపాయలలో అవినీతి చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. రూ. 240 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని జీఓ నెంబర్.523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు కారుచౌకగా, అప్పనంగా అప్పజెప్పారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్‌బాబు సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మూడేళ్లు సంసారం చేసి ఇప్పుడు మూడు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని టీడీపీ, బీజేపీ, జనసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ఈరోజు కేంద్రం ఇవ్వలేదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ప్రత్యేక హోదాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారే తప్ప బీజేపీకి మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు.
జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందీ ఏమీ లేదన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి కేవలం వసూళ్ల కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment