వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన చంద్రబాబు, శ్రీనివాసరావుకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం లేకపోతే తనకు తిరుగులేదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజారెడ్డిని హత్య చేయించింది నువ్వు కాదా..దోషులకు ఆశ్రయం కల్పించింది నువ్వు కాదా? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంత వరకు ఆ కేసు గురించి నిజాలు బయటకు రాలేదని తెలిపారు. చిచ్చరపిడుగులా ఎదుగుతున్న వైఎస్ జగన్‌పై కచ్చితంగా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు.
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తప్ప అన్ని పార్టీలు దాడిని ఖండించాయని తెలిపారు.ఇతర పార్టీలు ఖండించినా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం నేతల స్పందన ఎంత జుగుప్సాకరంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ ఎంత హుందాగా వ్యహరించారో గమనించాలని కోరారు. చంద్రబాబు దర్శకత్వంలో..సినీ నటుడు శివాజీ నటనతో గరుడపురాణం నడుస్తున్నదని అన్నారు. శివాజీని అరెస్ట్ చేస్తే ఆపరేషన్ గరుడ సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..మూడు నెలల నుంచి ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతోందని వ్యాక్యానించారు. శివాజీ గరుడ లీక్ దీనికి నాంది అని వివరించారు. దీని వెనక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒక మీడియా అధిపతి ఉన్నారని వెల్లడించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. శివాజీ ఇప్పుడే అమెరికా వెళ్లడంపై కూడా అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఇది అంతా ఒక పథకంలో భాగంగానే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మీలా తాము దిగజారదలచుకోలేదని చెప్పారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అప్పుడు పెరుగువడ అన్నాను కానీ..ఇప్పుడు అసలు కథ అర్ధం అవుతోందని పరోక్షంగా టీడీపీ కుట్రల గురించి ప్రస్తావించారు. ఇలానే వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతాయని పేర్కొన్నారు. తాము అడ్డదారిలో గద్దెనెక్కే వాళ్లం కాదని, భయపడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కోరారు. టీడీపీ నేతలు తమ భాషను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment