సాక్షి, తాడేపల్లి : పరిపాలనలో పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఆచరణలో చూపిస్తున్నారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆరు నెలల్లోనే రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని, కులం, మతం, పార్టీ కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను రామోజీరావు తెలుసుకోవాలని, ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దు హితవు పలికారు. కరోనాపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకవిధంగా తెలంగాణలో మరొక విధంగా ఈనాడు పత్రికలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలా డబుల్ స్టాండ్ విధానం ఎందుకని ప్రశ్నించారు. ఈనాడు, ఎల్లో మీడియా ప్రజలను తప్పు తోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం)
సీఎం జగన్ పాలన చూసి టీడీపీ నేతలు ఈర్ష్య పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బెంజ్ సర్కిల్ దగ్గర సన్నివేశం చూసి ప్రజలు పరవసించిపోయారు. 108 వాహనాలు మళ్ళీ అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట.? ఐదేళ్ళు 108 సర్వీస్‌లను గాలికి వదిలేసి.. ఇప్పుడు నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆరోగ్యశ్రీ, 108, 104 లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. 108 వాహనాల్లో 300 కోట్ల అవినీతి అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. వాహనాల కొనుగోలు, నిర్వహణ టెండర్లు అంతా పారదర్శకంగా జరిగింది.
కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ శాతం 1 శాతం మాత్రమే. కరోనా నియంత్రణకు ఏపీలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరెక్కడా తీసుకోవడంలేదు. దేశంలో ఎక్కడ లేనన్ని కరోనా టెస్టులు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు.. సీఎం జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకుపోతుంది. ప్రభుత్వాన్ని తిట్టమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారు. వైస్రాయి హోటల్ మాదిరిగా పార్క్ హయత్ లో ప్రభుత్వంపై కుట్రకు ప్లాన్ చేశారు.’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment