కడప : చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై పాలక టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. ఆదివారం కడపలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాతోపాటు జిల్లా అధ్యక్షుడు అమర్నాధ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ... ఏపీ శాసనసభ కౌరవ సభను తలపిస్తోందని వారు ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు హిట్లర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాసనసభ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం అహంకారపూరిత చర్యగా వారు అభివర్ణించారు.