సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలవనుందని ఆ పార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ చేసిన కుట్రలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కేవలం కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్ జపం చేశారే తప్ప ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తన ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటలెజిన్స్ వ్యవస్థను నాశనం చేసేలా డీజీ వెంకటేశ్వరరావు వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తప్పుదోవ పట్టేలా వైఎస్ కుటుంబంపై నిందలు వేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుయుక్తులు, వైఫల్యాలను ప్రజలు గుర్తించారని.. ఆయనకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో హైప్ క్రియేట్ చేసినట్లుగా..
చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి అన్నారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రైతులకు ఏదో మేలు చేసేలా చంద్రబాబు అన్నదాత సుఖీభవ చెక్కులు ఇచ్చారు.. తెలంగాణలో హైప్ చేసినట్లుగా ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు అన్ని రకాలుగా విఫలమయ్యారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌కు పట్టం కట్టేలా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా పూర్తి మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రానుందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు తన వైఫల్యాలను ఈసీపై నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు అందరినీ మోసం చేశాడు..
ఐదేళ్ల కాలంలో అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ బాషా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోందన్నారు. ప్రజలు పాలనలో మార్పు రావాలని కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో తీర్పు ప్రభంజనంలా ఉండబోతుందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలు సహకరించకపోయినా ప్రజలు ఓర్పుతో ఉన్నారన్నారు. తాను కనుగొన్నాను అని చెప్పుకునే టెక్నాలజీపై ఇప్పుడు బాబు నిందలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment