sarampalli mallareddy
-
ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా?
సందర్భం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షరతులతో మాఫీ మొత్తాన్ని తగ్గించటంలో చూపిన శ్రద్ధను వాటిని బ్యాంకులకు చెల్లించటంలో చూపలేదు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తా మంటూ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చలాయి స్తున్న పాలక పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఆ నినాదంతోనే రైతులను అవి ఆకట్టుకున్నాయి. అధికారం లోకి రాగానే మొదటి సంతకం రుణమాఫీపైనేనని ఇద్దరు అధినేతలూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక వారి చేతలు చెప్పిన దానికి విరు ద్ధంగానే సాగుతున్నాయి. అధికారంలోకొచ్చిందే తడవుగా రుణమాఫీ మొత్తా న్ని తగ్గించుకునేందుకు రెండు ప్రభుత్వాలూ అనేక నిబంధనలు, షరతులు విధించాయి. ఏపీ ప్రభుత్వం 2007-2013 వరకు రుణం పొందినవారికి మాత్రమే మాఫీ వర్తింపుచేస్తామన్నది 50 వేలలోపు రుణం తీసు కున్న రైతులకు పూర్తి రుణమాఫీ, అంతకంటే ఎక్కువ రుణం ఉన్నవారికి ఏటా 20 శాతం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 82.66 లక్షల ఖాతాలకుగాను 40.43 లక్షల ఖాతాలకు మాఫీ ప్రకటించి, 26.77 లక్షల మందికి మాఫీ చేసినట్టు ప్రభుత్వ నివేదికల్లో పేర్కొన్నారు. రుణమాఫీకి మొదటి విడతగా 5 వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2015-16 బడ్జెట్లో కేటాయించిన రూ.4,300 కోట్లను నేటికీ బ్యాంకులకు విడుదల చేయలేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.12,274 కోట్లు ఇస్తా మని ప్రకటించి... రూ.2,179 కోట్లు మాత్రమే విదిలిం చారు. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ, రుణ మొత్తాన్ని బట్టి మాఫీ, రూ.1.50 లక్షల లోపు రుణాలకే మాఫీ వంటి నిబంధనలతో రూ.87,612 కోట్ల రుణమాఫీని కేవలం రూ.14,322 కోట్లకు పరిమితం చేశారు. పైగా పంట రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీనీ ప్రభుత్వం తగ్గించింది. విభజన నాటికి ఏపీ రాష్ట్ర వ్యవ సాయ, డ్వాక్రా రుణాలు రెండూ కలిసి రూ.1,01,816 కోట్లు కాగా, రెంటికీ ప్రభుత్వం ప్రకటించిన మాఫీ రూ.18 వేల కోట్లు మాత్రమే. ఇక తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ నిబంధనతో రూ. 38 వేల కోట్ల రుణాలను రూ.17 వేల కోట్లకు తగ్గించింది. రెండో విడ త 2015-16 బడ్జెట్ నిధులు రూ.4,250 కోట్లు నేటికీ బ్యాంకులకు చేరలేదు. దీంతో రూ.18,717 కోట్ల పంట రుణాలు, రూ.6,238 కోట్ల దీర్ఘకాలిక రుణాలు మం జూరు చేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల రైతులు రూ.15 వేల కోట్ల మేరకు కొత్తగా ప్రైవేటు రుణాలు తీసుకున్నట్టు అంచనా. ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికందలేదు. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిడికి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 870 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 150 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడినట్టు పత్రికల సమాచారం. బ్యాంకు నిబంధనలు ప్రభుత్వాలకు తెలియనివా? బాకీదారునికి ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. బాకీ తీర్చడమో లేక రీషెడ్యూల్ చేయడమో జరగాలి. లేదా ఆ బాకీని ప్రభుత్వం తన పేరుకు మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు గుర్తించి బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తాయి. ప్రభుత్వం బాండ్లు ఇచ్చి వాటికి వడ్డీ చెల్లిస్తామంటోంది. బ్యాంక్‌లు బాండ్లను స్వీకరిం చవు. కాబట్టి బాండ్లు ఉన్నా రైతులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సిందే. మాటల గారడీతో చివరికి రైతుల ను బలి పశువులను చేశారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులిచ్చే రుణాలవల్ల అధిక వడ్డీ భారం మోయడమే కాదు, పంట కాలం పూర్తవ గానే మొత్తం చెల్లించాల్సిందే. అసలే ఆర్థిక భారంతో కుంగిపోతున్న రైతుకు ఇది మరింత భారం. బ్యాంకు రుణాలనైతే వడ్డీ చెల్లించి కొత్త రుణాలుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు రుణాలకు అసలు, వడ్డీ మొత్తం అణా పైసలతో సహా గడువు ముగియగానే చెల్లించాల్సిందే. ఇది ైరె తుకు కష్టసాధ్యమైన పని. కొత్త రుణం ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంకులు రుణ పరిమితిని పెంచి కొంత సొమ్మును రైతుల చేతికి ఇస్తాయి. పాల కుల నిర్వాకంతో ఆ అవకాశమూ రైతుల చేజారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలు రైతుల నోటి దగ్గరి కూడు తీశాయి. గతేడాదిలాగే రైతులు మళ్లీ ప్రైవే టు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి దివాలా తీయ కుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు 2015 మే నాటికి మొత్తం రుణ మాఫీ చే యాలి. అది జరిగితేనే బ్యాంకులు రానున్న ఖరీఫ్ సీజన్‌కు జూన్‌లో రుణాలు ఇస్తాయి. ఆ దిశగా ప్రభుత్వాలు సత్వర చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే రైతులు గతేడాదిలాగే మళ్లీ ప్రైవేటు రుణాల ఊబిలోకి దిగక తప్పదు. రైతాంగ రుణాలు - నగ్న సత్యాలు (రుణాలు, కేటాయింపులు రూ.కోట్లలో) తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంట రుణాలు 34,000 87,612(మార్చి 2013) ఖాతాలు 38 లక్షలు 40 లక్షలు ప్రకటించిన మాఫీ 17,000 14,322 2014-16 కేటాయింపులు 8,500 9,300 2014-15 పంట రుణ లక్ష్యాలు 18,717 56,019 2014-15లో ఇచ్చిన రుణాలు 6,000 7,263 (వ్యాసకర్త రైతాంగ ఉద్యమ నేత) మొబైల్ నం 94900 98666 సారంపల్లి మల్లారెడ్డి -
రైతు ఆత్మహత్యలపై 11 తరువాత ప్రత్యక్ష కార్యాచరణ
వామపక్షాల బస్సు యాత్రలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఎం.వెంకటాయపాలెం (ఖమ్మం రూరల్): రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు చర్యలు తీసుకోకపోతే ఆ తరువాత నుంచి పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రైతు సంఘం(సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హెచ్చరించారు. పంట నష్టం, అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఐదులక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో పది వామపక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం ఎం.వెంకటాయపాలెం చేరుకుంది. అక్కడ ఇటీవల తోకల బాబు అనే రైతు పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని నాయకులు పరామర్శించి, ఆత్మహత్య కారణాలను తెలుసుకున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే పరామర్శ అనంతరం, గ్రామ సెంటర్లో జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1997లోనే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, వీటికి ఆయా ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు. ‘‘పంటలు పండక.. కొద్దోగొప్పో పండినా గిట్టుబాటు ధర రాక, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం.. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు. దీనినిబట్టి, రైతులపై ప్రభుత్వానికి ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతోంది’’ అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 550మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ సంఖ్య 60 మాత్రమేనని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఆ 60మంది రైతుల కుటుంబాలకైనా ఈ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించా రు. రైతుల ఆత్మహత్యలకు గత పాలకుల విధానాలే కారణమని, తన బాధ్యత లేదని ప్రభుత్వం తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు. ‘‘గత ప్రభుత్వాలు సరే.. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటి?’’ అని ప్రశ్నించారు. పం టలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నారు. ‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని పాలకులు సాకులు చూపుతున్నారు. ఇది సరి కాదు. రైతులే సంక్షోభంలో కూరుకుపోయా రు’’ అని అన్నారు. ప్రైవేట్ రుణాల చెల్లింపుపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని, ఆ తరువాత వాటిని బ్యాంక్ రుణాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభకు ముందుగా గ్రామంలో ర్యాలీ జరిగింది. రైతు సంఘం(సీపీఐ) నాయకుడు విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ... రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈ ఏడాది వడ్డీ మాఫీ పోయిందని అన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చకపోరుునా, రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకపోరుునా భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ సభలో వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు భాగం హేమంతరావు(సీపీఐ), భూతం నరసయ్య(సీపీఐ-ఎంఎల్), బాబు(ఎంసీపీఐ-యూ), కొండపల్లి అచ్యుతరావు(ఎంఎల్-న్యూడెమోక్రసీ), చెరుపల్లి సిద్ధులు(సీపీఐ-ఎంఎల్ లిబరేషన్), పి.జగ్గారెడ్డి(తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), నాగన్న(అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య), బత్తుల లెనిన్(సీపీఎం), మహ్మద్ మౌలానా(సీపీఐ) తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
పెదమిడిసిలేరు (చర్ల): సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆయన శుక్రవారం కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి(రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్)తో కలిసి చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్, కుడి ఎడమ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. అనంతరం, విలేకరులతో ఆయన మాట్లాతడుతూ... వీటి నిర్వహణకు వందలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అయినప్పటికీ మరమతులు పనులు సక్రమంగా సాగడం లేదని, ఫలితంగా సాగు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్యహత్యను ఆశ్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాలిపేరు ఆధునికీకరణ పనుల కోసం జపాన్ బ్యాంక్ ఐదేళ్ల క్రితం 42కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మూడేళ్లలో పూర్తికావాల్సిన ఆ పనులను కాంట్రాక్టర్ ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లేనందునే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తాలిపేరు ప్రాజెక్టులో పూడికను తొలగించి, ప్రాజెక్ట్ ఎత్తును పెంచడం ద్వారా ప్రస్తుతం సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 24,700 నుంచి దాదాపు 50వేల ఎకరాలకు పెంచవచ్చని, సునాయాసంగా రెండు పంటలు వేసుకోవచ్చని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్ట్ వద్ద విద్యుదీకరణకు 25లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ప్రస్తుతం అక్కడ ఒక్క లైటు కూడా వెలగడం లేదని అన్నారు. కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగంపై కేసీఆర్ ప్రభుత్వ తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం 2004 నుంచి వందల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు ఖర్చు చేసినప్పటికీ రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఈ క్యాక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి సంజీవరెడ్డి, భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు యలమంచి రవికుమార్ కార్యదర్శి బీబీజీ తిలక్, తాలిపేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కమిటీ మాజీ అధ్యక్షుడు సాగె శ్రీనివాసరాజు, దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యుడు సత్యాలు తదితరులు పాల్గొన్నారు.