రైతు ఆత్మహత్యలపై 11 తరువాత ప్రత్యక్ష కార్యాచరణ
వామపక్షాల బస్సు యాత్రలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
ఎం.వెంకటాయపాలెం (ఖమ్మం రూరల్): రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు చర్యలు తీసుకోకపోతే ఆ తరువాత నుంచి పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రైతు సంఘం(సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హెచ్చరించారు. పంట నష్టం, అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఐదులక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో పది వామపక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం ఎం.వెంకటాయపాలెం చేరుకుంది. అక్కడ ఇటీవల తోకల బాబు అనే రైతు పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని నాయకులు పరామర్శించి, ఆత్మహత్య కారణాలను తెలుసుకున్నారు.
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
పరామర్శ అనంతరం, గ్రామ సెంటర్‌లో జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1997లోనే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, వీటికి ఆయా ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు. ‘‘పంటలు పండక.. కొద్దోగొప్పో పండినా గిట్టుబాటు ధర రాక, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం.. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు. దీనినిబట్టి, రైతులపై ప్రభుత్వానికి ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతోంది’’ అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 550మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ సంఖ్య 60 మాత్రమేనని ప్రభుత్వం చెబుతోందని అన్నారు.
ఆ 60మంది రైతుల కుటుంబాలకైనా ఈ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించా రు. రైతుల ఆత్మహత్యలకు గత పాలకుల విధానాలే కారణమని, తన బాధ్యత లేదని ప్రభుత్వం తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు. ‘‘గత ప్రభుత్వాలు సరే.. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటి?’’ అని ప్రశ్నించారు. పం టలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నారు. ‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని పాలకులు సాకులు చూపుతున్నారు. ఇది సరి కాదు. రైతులే సంక్షోభంలో కూరుకుపోయా రు’’ అని అన్నారు. ప్రైవేట్ రుణాల చెల్లింపుపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని, ఆ తరువాత వాటిని బ్యాంక్ రుణాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభకు ముందుగా గ్రామంలో ర్యాలీ జరిగింది.
రైతు సంఘం(సీపీఐ) నాయకుడు విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ... రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈ ఏడాది వడ్డీ మాఫీ పోయిందని అన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చకపోరుునా, రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకపోరుునా భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
ఈ సభలో వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు భాగం హేమంతరావు(సీపీఐ), భూతం నరసయ్య(సీపీఐ-ఎంఎల్), బాబు(ఎంసీపీఐ-యూ), కొండపల్లి అచ్యుతరావు(ఎంఎల్-న్యూడెమోక్రసీ), చెరుపల్లి సిద్ధులు(సీపీఐ-ఎంఎల్ లిబరేషన్), పి.జగ్గారెడ్డి(తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), నాగన్న(అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య), బత్తుల లెనిన్(సీపీఎం), మహ్మద్ మౌలానా(సీపీఐ) తదితరులు పాల్గొన్నారు.