ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా? | This year, in the farmers' loans to the private sector? | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా?

Published Tue, May 19 2015 1:19 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా? - Sakshi

ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా?

సందర్భం
 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షరతులతో మాఫీ మొత్తాన్ని తగ్గించటంలో చూపిన శ్రద్ధను వాటిని బ్యాంకులకు చెల్లించటంలో చూపలేదు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు అప్పులు
 తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
 
2014 శాసనసభ ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తా మంటూ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చలాయి స్తున్న పాలక పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఆ నినాదంతోనే రైతులను అవి ఆకట్టుకున్నాయి. అధికారం లోకి రాగానే మొదటి సంతకం రుణమాఫీపైనేనని ఇద్దరు అధినేతలూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక వారి చేతలు చెప్పిన దానికి విరు ద్ధంగానే  సాగుతున్నాయి.

అధికారంలోకొచ్చిందే తడవుగా రుణమాఫీ మొత్తా న్ని తగ్గించుకునేందుకు రెండు ప్రభుత్వాలూ అనేక నిబంధనలు, షరతులు విధించాయి. ఏపీ ప్రభుత్వం 2007-2013 వరకు రుణం పొందినవారికి మాత్రమే మాఫీ వర్తింపుచేస్తామన్నది 50 వేలలోపు రుణం తీసు కున్న రైతులకు పూర్తి రుణమాఫీ, అంతకంటే ఎక్కువ రుణం ఉన్నవారికి ఏటా 20 శాతం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 82.66 లక్షల ఖాతాలకుగాను 40.43 లక్షల ఖాతాలకు మాఫీ ప్రకటించి, 26.77 లక్షల మందికి మాఫీ చేసినట్టు ప్రభుత్వ నివేదికల్లో పేర్కొన్నారు. రుణమాఫీకి మొదటి విడతగా 5 వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2015-16 బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,300 కోట్లను నేటికీ బ్యాంకులకు విడుదల చేయలేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.12,274 కోట్లు ఇస్తా మని ప్రకటించి... రూ.2,179 కోట్లు మాత్రమే విదిలిం చారు. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ, రుణ మొత్తాన్ని బట్టి మాఫీ, రూ.1.50 లక్షల లోపు రుణాలకే మాఫీ వంటి నిబంధనలతో రూ.87,612 కోట్ల రుణమాఫీని కేవలం రూ.14,322 కోట్లకు పరిమితం చేశారు. పైగా పంట రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీనీ ప్రభుత్వం తగ్గించింది. విభజన నాటికి ఏపీ రాష్ట్ర వ్యవ సాయ, డ్వాక్రా రుణాలు రెండూ కలిసి రూ.1,01,816 కోట్లు కాగా, రెంటికీ ప్రభుత్వం ప్రకటించిన మాఫీ రూ.18 వేల కోట్లు మాత్రమే.
 ఇక తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ నిబంధనతో రూ. 38 వేల కోట్ల రుణాలను రూ.17 వేల కోట్లకు తగ్గించింది. రెండో విడ త 2015-16 బడ్జెట్ నిధులు రూ.4,250 కోట్లు నేటికీ బ్యాంకులకు చేరలేదు. దీంతో రూ.18,717 కోట్ల పంట రుణాలు, రూ.6,238 కోట్ల దీర్ఘకాలిక రుణాలు మం జూరు చేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపడంలేదు.

ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల రైతులు రూ.15 వేల కోట్ల మేరకు కొత్తగా ప్రైవేటు రుణాలు తీసుకున్నట్టు  అంచనా. ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికందలేదు. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిడికి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 870 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 150 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడినట్టు పత్రికల సమాచారం. బ్యాంకు నిబంధనలు ప్రభుత్వాలకు తెలియనివా? బాకీదారునికి ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. బాకీ తీర్చడమో లేక రీషెడ్యూల్ చేయడమో జరగాలి. లేదా ఆ బాకీని ప్రభుత్వం తన పేరుకు మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు గుర్తించి బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తాయి. ప్రభుత్వం బాండ్లు ఇచ్చి వాటికి వడ్డీ చెల్లిస్తామంటోంది. బ్యాంక్‌లు బాండ్‌లను స్వీకరిం చవు. కాబట్టి బాండ్‌లు ఉన్నా రైతులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సిందే. మాటల గారడీతో చివరికి రైతుల ను బలి పశువులను చేశారు.

ప్రైవేటు వడ్డీ వ్యాపారులిచ్చే రుణాలవల్ల అధిక వడ్డీ భారం మోయడమే కాదు, పంట కాలం పూర్తవ గానే మొత్తం చెల్లించాల్సిందే. అసలే ఆర్థిక భారంతో కుంగిపోతున్న రైతుకు ఇది మరింత భారం. బ్యాంకు రుణాలనైతే వడ్డీ చెల్లించి కొత్త రుణాలుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు రుణాలకు అసలు, వడ్డీ మొత్తం అణా పైసలతో సహా గడువు ముగియగానే చెల్లించాల్సిందే. ఇది ైరె తుకు కష్టసాధ్యమైన పని. కొత్త రుణం ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంకులు రుణ పరిమితిని పెంచి కొంత సొమ్మును రైతుల చేతికి ఇస్తాయి. పాల కుల నిర్వాకంతో ఆ అవకాశమూ రైతుల చేజారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలు రైతుల నోటి దగ్గరి కూడు తీశాయి. గతేడాదిలాగే రైతులు మళ్లీ ప్రైవే టు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి దివాలా తీయ కుండా ఉండాలంటే  రాష్ట్ర ప్రభుత్వాలు 2015 మే నాటికి మొత్తం రుణ మాఫీ చే యాలి. అది జరిగితేనే బ్యాంకులు రానున్న ఖరీఫ్ సీజన్‌కు జూన్‌లో రుణాలు ఇస్తాయి. ఆ దిశగా ప్రభుత్వాలు సత్వర చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే రైతులు గతేడాదిలాగే మళ్లీ ప్రైవేటు రుణాల ఊబిలోకి దిగక తప్పదు.   

రైతాంగ రుణాలు - నగ్న సత్యాలు (రుణాలు, కేటాయింపులు రూ.కోట్లలో)
తెలంగాణ    ఆంధ్రప్రదేశ్
పంట రుణాలు    34,000    87,612(మార్చి 2013)
ఖాతాలు    38 లక్షలు    40 లక్షలు
ప్రకటించిన మాఫీ     17,000    14,322
2014-16 కేటాయింపులు    8,500     9,300
2014-15 పంట రుణ లక్ష్యాలు     18,717     56,019
2014-15లో ఇచ్చిన రుణాలు    6,000     7,263
 
(వ్యాసకర్త రైతాంగ ఉద్యమ నేత)   మొబైల్ నం 94900 98666
 సారంపల్లి మల్లారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement