sarma
-
సినీ గీతాల కన్నా సనాతన ధర్మమే ఆకట్టుకుంది
ఆర్ష సాహిత్యంపై దాడులు పెరుగుతున్నాయి మన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టొద్దు ‘సాక్షి’తో సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సినీ పరిశ్రమలో పాటలు రాస్తున్న సమయంలోనే వైదిక వాజ్ఞ్మయంపై కొన్ని చానళ్లలో ప్రసంగించే అవకాశం వచ్చింది. దీంతో ప్రవచనాలతో బిజీ అయిపోయాను. సినిమాలకు పాటలు రాయడం కన్నా... సనాతన ధర్మప్రచారమే నన్ను ఆకట్టుకుంది. నా మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నా’నని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కొంతమూరులో ఆయన నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టారు నేను రాసిన సినీగీతంలో ఒక పదం అర్థం కావడంలేదు కనుక, ఆ పదాన్ని మార్చమని ఓ నిర్మాత నన్ను అడిగారు. దాన్ని మార్చి మరో పదం రాశాను. పాడటానికి వచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పదాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందని నన్ను అడిగారు. నిర్మాత కోరిక మేరకు మార్చానని చెప్పాను. బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టి, పాత పదాన్నే ఉంచారు. బాపు, రమణలు ఎంతో ప్రోత్సహించారు భాగవతం సీరియల్కు పాటలు రాయడానికి బాపు, రమణలు నన్ను ఆహ్వానించారు. వారితో సంభాషణల్లో ఎక్కువగా భారత, భాగవత, రామాయణాల నుంచి కోట్ చేస్తుండేవాడిని. నా చేత వాళ్లు మళ్లీ మళ్లీ మాట్లాడించుకునేవారు. మంచిని తీసుకుందాం మన ప్రాచీన కావ్యాలు, ఆర్ష సాహిత్యంపై దాడులు ఎక్కువవుతున్నాయి. నేటి కాలానికి అన్వయించని విషయాలుంటే వాటిని పరిహరించి, మంచిని తీసుకుందాం. మన ధర్మాన్ని దెబ్బతీయడానికి కొందరు కుహనా మేధావులను పురిగొల్పుతున్నారు. ఈ కుహనా మేధావులు ఆర్షసాహిత్యాన్ని చూస్తున్న కోణంలో గతంలో ఎవరూ చూడలేదు. హృదయం నిర్మలంగా లేకుంటే అద్భుతాలు కూడా అసహ్యంగానే కనిపిస్తాయి. ఇవి ఉపాసనకు సంబంధించిన అంశాలు గణపతి కల్యాణం, హనుమంతుని కల్యాణం ఇత్యాదులు కథాపరమైన అంశాలు కావు. ఉపాసనకు సంబంధించిన అంశాలు. హనుమ జ్ఞానమూర్తి. జ్ఞానం ఉన్నచోట వర్చస్సు ఉంటుంది. కనుక హనుమంతునికి, సువర్చలకు వివాహం జరిపిస్తున్నాం. గణపతి బుద్ధిప్రదాత కనుకనే సిద్ధిబుద్ధిలతో గణపతి కల్యాణం జరిపిస్తున్నాం. చాగంటిని కులాల ఉచ్చులోకి లాగొద్దు సరస్వతీపుత్రుడు చాగంటి కోటేశ్వరరావు మీద కువిమర్శలు సనాతనధర్మంపై జరుగుతున్న దాడులుగానే భావించాలి. చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టడం మంచి పద్ధతి కాదు. -
మంచి అణువంతైనా పుణ్యం అనంతం
-ఇదే ‘పాండురంగ మాహాత్మ్యం’ సారాంశం –భువన విజయ ప్రసంగాల్లో కార్తికేయశర్మ రాజమహేంద్రవరం కల్చరల్ : మంచి అన్నది స్వల్పంగా చేసినా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందన్నదే తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యం’ సందేశమని ప్రముఖ సాహితీవేత్త కర్రా కార్తికేయశర్మ అన్నారు. ఆయన గడసరి పోకడల కవి అని కొనియాడా.నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరుగుతున్న భువన విజయ సాహితీప్రసంగ పరంపరలో భాగంగా గురువారం శర్మ ‘పాండురంగ మాహాత్మ్యం– రంగానుగ్రహం' అనే అంశంపై ప్రసంగించారు. శైవమతస్తుడయిన రామలింగడు రాయల కొలువులోకి వచ్చాక, వైష్ణవుడై 'రామకృష్ణుడు’ అయ్యాడని వివరించారు. తెనాలి అగ్రహారం స్వీకరించాక, తెనాలి ఇంటి పేరుగా వాడుకలోకి వచ్చిందన్నారు. పార్వతీదేవి తన పెంపుడు చిలుకకు విష్ణుసహస్ర నామాలు నేర్పినట్టు రామకృష్ణుడు తన ప్రబంధంలోని ఆరంభపద్యాలలో పేర్కొన్నాడన్నారు. ఇందులో అసమంజసం ఏమీ లేదని, స్త్రీకి పుట్టింటిమీద మమకారం సహజమని, పార్వతి 'పద్మనాభ సహోదరి', విష్ణువుకు చెల్లెలని చెప్పారు. ‘పాండురంగ మాహాత్మ్యం’లో అపమార్గం పట్టిన నిగమ శర్మను సంస్కరించడానికి ప్రయత్నించే అతడి సోదరిని అక్కగానే రామకృష్ణుడు వ్యవహరించారని, అగస్త్యుని సోదరుని అగస్త్యభ్రాతగానే ప్రాచీనకావ్యాలలో చెప్పారని అన్నారు. నిగమశర్మ ఎలా విష్ణు సాయుజ్యం పొందాడో కవి తనప్రబంధంలో వివరించారన్నారు. జోరాశర్మ (జోస్యుల రామచంద్ర శర్మ) అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ముత్యా వెంకటేశ్వరరావు ప్రసంగించారు.రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతలపాటి శర్మ స్వాగతం పలకగా, దేవీసుదర్శన్ వందన సమర్పణ చేశారు. నేడు మనుచరిత్రపై సందీప్ ప్రసంగం భువన విజయసాహితీప్రసంగాలలో భాగంగా శుక్రవారం ‘మనుచరిత్ర–జీవన విధులు’ అనే అంశంపై తాతా రమా సత్యసందీప శర్మ ప్రసంగిస్తారు. -
డాక్టరేట్ గ్రహీత శర్మకు సన్మానం
తుని రూరల్ : తుని మండలం వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 ఏళ్లు అధ్యాపకుడిగా పని చేసి, రసాయన శాస్త్ర విభాగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఈరంకి సీతారామ సుబ్రహ్మణ్య శర్మను గురువారం ఘనంగా సన్మానించారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి.రవిచంద్రకుమార్ అధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు సుబ్రహ్మణ్యశర్మను అభినందించారు. అంతకు ముందు పీజీ విద్యార్థులకు రసాయనశాస్త్రాన్ని బోధించే గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియను కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకులు వి.మల్లికార్జున శర్మ, సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశారు. గెస్ట్ లెక్చరర్లు పీజీలో క్రొమటోగ్రఫీ, సైక్లో అలే్కన్లు అంశాలను బోధిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు వి.సత్యనారాయణ, గోవిందు, మురళి, సంతోషి పాల్గొన్నారు.