saroornagar women police station
-
రమాదేవి కథ సుఖాంతం....
హైదరాబాద్ : వారసుడు లేడనే నెపంతో అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. దిల్సుఖ్నగర్ వికాస్ నగర్లో అత్తింటి ముందు ఆమె ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళ సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. మహిళ సంఘాలు బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా... పోలీసులు రమాదేవి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మాలదేవిలను రప్పించారు. మహిళ సీఐ మధులత ఇరువురి అంగీకారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మగ సంతానం లేదనే నెపంతో వేధిస్తున్నట్లు రమాదేవి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపటం విశేషం. -
పీఎస్‌లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు
వారసుడు లేడనే నెపంతో ఇల్లాలు రమాదేవిని వేధించడమే కాకుండా పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటివేసిన కేసులో ఆమె భర్త సంతోష్ కుమార్‌తోపాటు ఆమె అత్తామామలు గురువారం ఉదయం సరూర్‌నగర్ మహిళ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుత్రుడిని కనివ్వలేదని రమాదేవిని భర్తతోపాటు, అత్తమామలు తరుచుగా వేధించేవారు. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉన్న రమాదేవి బుధవారం దిల్సుఖ్నగర్ పరిధిలోని వికాస్‌నగర్‌లోని మెట్టినింటికి వచ్చింది. ఆమె రాకను ముందుగా గమనించిన ఆమె భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమాదేవికి మెట్టినింటి ముందు బైఠాయించింది. రమాదేవి ఘటనకు సంబంధించిన కథనం సాక్షి టీవీలో ప్రసారం కావడంతో సరూర్‌నగర్ మహిళ పోలీసులు స్పందించారు. వెంటనే రమాదేవి వద్దకు వచ్చి మహిళా పోలీసులు విషయం తెలుసుకున్నారు. అనంతరం భర్త సంతోష్‌కుమార్, ఆమె అత్తామామలపై సరూర్ నగర్ మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాంతో రమాదేవి అత్తామామలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.