మహిళా సర్పంచ్ కుమారుడి నిర్వాకం..
టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.. ముత్యాలంపాడు పంచాయతీ కొత్తతండాకు చెందిన గ్రామ సర్పంచ్ బూక్య శాంతి కుమారుడు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పరీక్షల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించింది. ఆమె ఆవేదనను ఎవరు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.