Sarpatta Parampara Movie
-
నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్
కోలివుడ్ దర్శకుడు పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. అయితే, తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు అవార్డు రాకుండా అడ్డకున్నారని ఆయన ఆరోపించారు. పా.రంజిత్ చిత్రాల్లో రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి సామాజిక సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయి. సినిమాల ద్వారా రాజకీయాలను మాట్లాడతానని పా.రంజిత్ ఇటీవల స్ఫష్టంగానే చెప్పారు. ఈయన తాజాగా విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తంగలాన్ చిత్రం విశేష ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా పా.రంజిత్ ఇంతకు ముందు ఆర్య హీరోగా రూపొందించిన చిత్రం సార్పట్ట పరంపర. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ కూడా చేస్తానని దర్శకుడు ప్రకటించారు. కాగా ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులపై స్పందించిన దర్శకుడు పా.రంజిత్ సార్పట్ట పరంపర చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపించారు. దీని గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల కారణంగానే తనను తన పనిచేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సార్పట్ట పరంపర చాలా పెద్ద విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర రెండో భాగం గురించి పలు విమర్శలు వచ్చాయన్నారు. అయితే, అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రం బహిరంగంగానే నిరాకరణకు గురైందన్నారు. పలు క్రిటిక్స్ అవార్డులను ఈ చిత్రం పొందిందన్నారు. అలా క్రిటిక్స్ అవార్డులను పొందిన చిత్రాలకు కచ్చితంగా జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. అయితే సార్పట్ట పరంపర చిత్రాన్ని జాతీయ అవార్డుల దరిదాపుల్లోకే వెళ్లలేకపోయిందని అన్నారు. ఆ అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు. కావాలనే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని అన్నారు. ఈ రాజకీయ ద్వేషాన్ని తాను అర్థం చేసుకోగలనని దర్శకుడు పా.రంజిత్ పేర్కొన్నారు. -
నాడు గ్లామర్ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు
చియాన్ విక్రమ్ అంటేనే వైవిధ్యానికి మారు పేరు. ఈయన తాజాగా నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో విక్రమ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన నటించే 62వ చిత్రం అవుతుంది. ఇటీవల చిత్తా (చిన్నా) వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌యూ అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హెచ్ఆర్.పిక్చర్స్ పతాకంపై రియా శిబూ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయిన్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. కాగా ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరముడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. హీరో యిన్‌గా నటించే లక్కీఛాన్స్‌ను యువ నటి దుషారా విజయన్ దక్కించుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ చిన్నది అందులో మరియమ్మ పాత్రలో జీవించి, అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత నక్షత్రం నగరుదు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ వైపు దృష్టి సారించారు. అలా గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని, సామాజక మాధ్యమాల్లో విడుదల చేశారు. అలా మరింత వార్తల్లోకి ఎక్కిన దుషారా ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ ఈ అమ్మడు నటించడం విశేషం. తాజాగా విక్రమ్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ క్రేజీ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్
తమిళ సినిమా: రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా విజయన్. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్ దృష్టిలో పడ్డారు. అలా ఆయన నిర్వహించిన ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి సార్పట్టా పరంపరై చిత్రంలో కథానాయకగా నటించారు. అందులో నటుడు ఆర్యకు జంటగా మరియమ్మ అనే పాత్రను పోషించారు. ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతగా ఆ పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌నే రూపొందించిన నక్షత్రం నగర్గిరదు చిత్రంలోని నటించారు. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి, నటుడు అర్జున్‌దాస్ సరసన ఒక చిత్రం అంటూ మూడు, నాలుగు చిత్రాలు దుషారా చేతిలో ఉన్నాయి. వీటిలో అరుళ్ నిధికి జంటగా నటించిన కళువేత్తి మూర్కన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఎస్.అంబేత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించారు. (చదవండి: కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు) ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నటి దుషారా విజయన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ కళువేత్తి మూర్కన్ తనకు స్పెషల్ చిత్రమని పేర్కొన్నారు. నటుడు అరుళ్ నిధితో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఆయన సెట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని అన్నారు. తాను ఇందులో కవిత అనే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించినట్లు చెప్పారు. (చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) చిత్రంలో అరుళ్ నిధితో కలిసి నటించిన రొమాన్స్ సన్నివేశాలు డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. దర్శకుడు పా..రంజిత్ సార్పట్టా పరంపరైకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందనీ అదే జరిగితే అందులో తానే నటిస్తానని చెప్పారు. తాను నట జీవితం సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉందనీ అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు. -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్‌కాల్‌ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
Video: ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. మామూలు కష్టం కాదు!
తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ‘చెల్లం’సర్ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్.. డ్యాన్సింగ్ రోజ్. పా రంజిత్ డైరెక్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్ రోజ్’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్. స్లిమ్ ఫిట్ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్ డ్యాన్సింగ్ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్ రోజ్కి ఓ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సమర(కబిలన్)తో ఓడినప్పటికీ, విలన్ బ్యాచ్‌లో ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్ ఆర్టిస్ట్ షబీర్ కళ్ళరక్కల్. మాంచి థియేటర్ ఆర్టిస్ట్ 2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్ కళ్ళరక్కల్. యాభైకి పైగా స్టేజ్ షోలతో థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్ చేశాడు. షబీర్ స్వతహాగా ఫిట్నెస్ ప్రియుడు. దీంతో కాస్టింగ్ డైరెక్టర్ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్ దక్కింది. ఫిట్నెస్ ఉన్నోడు కావడంతో మార్షల్ ఆర్ట్స్ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్ మాస్టర్ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్ రోజ్ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి. Shabeer Kallarakkal aka DANCING ROSE. pic.twitter.com/aCUSdfJwSN — LetsOTT GLOBAL (@LetsOTT) July 22, 2021 అన్నట్లు డ్యాన్సింగ్ రోజ్‌కు ఇన్స్పిరేషన్.. యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమెద్. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్.. 37 ఫైటింగ్ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్.. క్యారెక్టర్ స్ఫూర్తితో జపనీస్ మాంగా సిరీస్ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రయాన్ హక్ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు. -
‘సార్పట్ట’ మూవీ రివ్యూ
టైటిల్ : సార్పట్ట జానర్ : పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నిర్మాణ సంస్థలు : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పా.రంజిత్. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్‌గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బాక్సర్‌గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్‌పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్ కొక్కెయ్ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ అలరించాడు. అనుపమ కుమార్, షబ్బీర్ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్‌బ్యాక్... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్‌కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్. అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్‌గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్ వేసుకొని అత్యుత్తమ బాక్సర్‌ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్ టచ్ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్ నారాయణ్ సక్సెస్ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్.కె ఎడిటింగ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్.. సెకండాఫ్‌లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ ఆర్య, పశుపతి నటన నేపథ్య సంగీతం దర్శకత్వం ఫస్టాప్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్ సినిమా నిడివి ఊహకందే క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్