తెల్లారిన బతుకులు
= నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బీ1 ఏసీ బోగీలో షార్టసర్క్యూట్
= అగ్ని కీలల్లో చిక్కుకుని 26 మంది మృత్యువాత
= ఆర్తనాదాలతో దద్దరిల్లిన కొత్తచెరువు ప్రాంతం
= ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రులు ఖర్గే, కోట్ల
= మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
= ఆప్తుల ఆచూకీ కోసం బంధువుల అగచాట్లు
= రైలు బయలుదేరే ముందు సరిగా పరీక్షించలేదని అనుమానం
= కాలిన బోగీని పరిశీలించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంపై నిప్పులు చెరిగిన వైస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి
‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరాదని జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్లెట్లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో అతను తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయారు. సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది.
బెంగళూరు/కొత్తచెరువు, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు.
ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు. మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సైతం తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని సంఘటన స్థలి వద్దకు వచ్చారు. కాలిపోయిన రైలు బోగీని పరిశీలించిన అనంతరం పుట్టపర్తి రైల్వేస్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరివల్లే తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బెంగళూరుకు తరలించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం వాటని వారి బంధువులకు అప్పగించనున్నారు.