sarva shikha abiyan
-
సమగ్ర శిక్షాభియాన్
సాక్షి, రాయవరం (మండపేట): సాధారణంగా ఒకటో తేదీన వేతనాలు పొందాలని ఉద్యోగులు ఆశిస్తారు. అయితే ఒకటో తేదీన వేతనాలు రాకపోవడంతో ఏమైందో తెలియక ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఆరా తీస్తే వారి హెడ్ ఆఫ్ అకౌంట్‌ను సీఎఫ్ఎంఎస్ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీంతో తమకు వేతనాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి పైగా మార్చి నెలలో వేతనాలు నిలిచిపోయాయి. సమగ్ర శిక్షాభియాన్‌లో ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులను మిళితం చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్య ఎలా వచ్చిందంటే... ఇప్పటి వరకు సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, రాష్ట్ర విద్యా పరిశోధనామండలి (ఎస్సీఈఆర్టీ) విడివిడిగా వాటి కార్యకలాపాలు నిర్వహించేవి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వస్తూ సమగ్ర శిక్షాభియాన్గా మార్పు చేస్తూ గతేడాది ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ అవసరమైన నిర్ణయాలను తీసుకోనట్టు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏకు నిధులు కేటాయించక పోవడంతో సీఎఫ్ఎంఎస్ నుంచి ఆర్‌ఎంఎస్‌ఏ హెడ్ ఆఫ్ అకౌంట్‌ను ఫైనాన్స్ అధికారులు తొలగించారు. ఈ సమయంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల సమస్య ఉత్పన్నమైందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రతి ఉన్నత పాఠశాలకు రెండు మూడు ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయ పోస్టులు ఉండేలా క్రియేట్ చేశారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికిపైగా ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు నిలిచిపోయాయి. మార్చి నెల వేతనాలు ఏప్రిల్ ఒకటిన పొందాల్సి ఉంది. పాఠశాలల్లో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులకు వేతనాలు వారి ఖాతాల్లో జమ కాగా వీరికి మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాలు ఇప్పించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు రాలేదు... మార్చి నెల వేతనాలు ఖాతాలకు జమ కాలేదు. దీంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. వేతనాలు మంజూరు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశాను. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. – కాళిదాసు గంగాధరరావు, ఆర్‌ఎంఎస్‌ఏ టీచర్, నరేంద్రపురం, రాజానగరం మండలం ఆర్థిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లాం ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల విషయమై ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్‌కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి. – కేఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్, కాకినాడ, తూ.గో.జిల్లా -
యూనిఫాం ఎప్పుడిస్తారో ?
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్‌లు అవసరం విద్యారణ్యపురి : విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా యూనిఫాం అందలేదు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2049, యూపీఎస్‌లు 360, హైస్కూళ్లు 510 వరకు ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే తెలంగాణ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఒక్కో జతకు రూ.200 చొప్పున (క్లాత్‌కు రూ.160, స్టిచ్చింగ్ చార్జి కింద రూ.40) కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల కోసం రూ.400 చొప్పున నిధులు మంజూరవుతున్నాయి. 2,03,603 మంది... ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 2 లక్షల 3వేల 603 మంది విద్యార్థులకు యూనిఫాం కావాలని కొన్ని నెలల క్రితమే సర్వశిక్షా అభియన్ జిల్లా ప్రాజెక్టు అధికారులు రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో బాలికలు 1,06,663 మంది, బాలురు 96,940 మంది ఉన్నారు. అయితే, పాఠశాలలు తెరిచి రెండు నెలలు కావస్తున్నా యూనిఫాం విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. గతంలో క్లాత్‌ను ఆప్కో ద్వారా ఇప్పించేవారు. యూనిఫాం కుట్టించేందుకు స్కూల్ మేనేజ్మెంట్ల అకౌంట్లకు నిధులు విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం కూడా చేనేత కార్మికుల నుంచే దుస్తులు కొనుగోలుచేసి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వమే చేనేత లేదా ఆప్కో ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తే స్కూల్ మేనేజ్మెంట్లు తమ మండల పరిధిలోని దర్జీల వద్ద విద్యార్థులకు కొలతలు ఇప్పించి దుస్తులు కుట్టించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాలేదు, విద్యార్థుల నుంచి కొలతలు కూడా తీసుకోలేదు. యూనిఫాం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు సైతం మంజూరు చేయలేదు. బడిబాట సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం కూడా ఇస్తారని ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠ్యపుస్తకాలు ఇచ్చారు.. కానీ, స్కూల్ యూనిఫాం పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో 476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన విషయం విదితమే. అందులో ఒకటో తరగతిలో కొత్తగా విద్యార్థులు చేరారు. కొందరు గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన స్కూల్ యూనిఫాంలో వస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి స్కూల్ యూనిఫాం లేదు. గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన దుస్తులు చినిగిపోవడంతో కొందరు విద్యార్థులు సాధారణ దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారు. గతంలో ఇచ్చిన దుస్తులు నాణ్యతగా లేవని, ఈ విద్యాసంవత్సరమైన నాణ్యతతో కూడిన దుస్తులను వెంటనే అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.