- విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు
- ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్‌లు అవసరం
యూనిఫాం ఎప్పుడిస్తారో ?
Published Mon, Aug 29 2016 12:23 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
విద్యారణ్యపురి : విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా యూనిఫాం అందలేదు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2049, యూపీఎస్‌లు 360, హైస్కూళ్లు 510 వరకు ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే తెలంగాణ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఒక్కో జతకు రూ.200 చొప్పున (క్లాత్‌కు రూ.160, స్టిచ్చింగ్ చార్జి కింద రూ.40) కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల కోసం రూ.400 చొప్పున నిధులు మంజూరవుతున్నాయి.
2,03,603 మంది...
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 2 లక్షల 3వేల 603 మంది విద్యార్థులకు యూనిఫాం కావాలని కొన్ని నెలల క్రితమే సర్వశిక్షా అభియన్ జిల్లా ప్రాజెక్టు అధికారులు రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో బాలికలు 1,06,663 మంది, బాలురు 96,940 మంది ఉన్నారు. అయితే, పాఠశాలలు తెరిచి రెండు నెలలు కావస్తున్నా యూనిఫాం విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. గతంలో క్లాత్‌ను ఆప్కో ద్వారా ఇప్పించేవారు. యూనిఫాం కుట్టించేందుకు స్కూల్ మేనేజ్‌మెంట్ల అకౌంట్లకు నిధులు విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం కూడా చేనేత కార్మికుల నుంచే దుస్తులు కొనుగోలుచేసి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వమే చేనేత లేదా ఆప్కో ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తే స్కూల్ మేనేజ్‌మెంట్లు తమ మండల పరిధిలోని దర్జీల వద్ద విద్యార్థులకు కొలతలు ఇప్పించి దుస్తులు కుట్టించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాలేదు, విద్యార్థుల నుంచి కొలతలు కూడా తీసుకోలేదు. యూనిఫాం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు సైతం మంజూరు చేయలేదు. బడిబాట సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం కూడా ఇస్తారని ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠ్యపుస్తకాలు ఇచ్చారు.. కానీ, స్కూల్ యూనిఫాం పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో 476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన విషయం విదితమే. అందులో ఒకటో తరగతిలో కొత్తగా విద్యార్థులు చేరారు. కొందరు గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన స్కూల్ యూనిఫాంలో వస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి స్కూల్ యూనిఫాం లేదు. గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన దుస్తులు చినిగిపోవడంతో కొందరు విద్యార్థులు సాధారణ దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారు. గతంలో ఇచ్చిన దుస్తులు నాణ్యతగా లేవని, ఈ విద్యాసంవత్సరమైన నాణ్యతతో కూడిన దుస్తులను వెంటనే అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement