సాక్షి, రాయవరం (మండపేట): సాధారణంగా ఒకటో తేదీన వేతనాలు పొందాలని ఉద్యోగులు ఆశిస్తారు. అయితే ఒకటో తేదీన వేతనాలు రాకపోవడంతో ఏమైందో తెలియక ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఆరా తీస్తే వారి హెడ్ ఆఫ్ అకౌంట్‌ను సీఎఫ్‌ఎంఎస్ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీంతో తమకు వేతనాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి పైగా మార్చి నెలలో వేతనాలు నిలిచిపోయాయి. సమగ్ర శిక్షాభియాన్‌లో ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులను మిళితం చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమస్య ఎలా వచ్చిందంటే...
ఇప్పటి వరకు సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, రాష్ట్ర విద్యా పరిశోధనామండలి (ఎస్‌సీఈఆర్‌టీ) విడివిడిగా వాటి కార్యకలాపాలు నిర్వహించేవి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వస్తూ సమగ్ర శిక్షాభియాన్‌గా మార్పు చేస్తూ గతేడాది ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ అవసరమైన నిర్ణయాలను తీసుకోనట్టు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏకు నిధులు కేటాయించక పోవడంతో సీఎఫ్‌ఎంఎస్ నుంచి ఆర్‌ఎంఎస్‌ఏ హెడ్ ఆఫ్ అకౌంట్‌ను ఫైనాన్స్ అధికారులు తొలగించారు. ఈ సమయంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కానీ ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల సమస్య ఉత్పన్నమైందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రతి ఉన్నత పాఠశాలకు రెండు మూడు ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయ పోస్టులు ఉండేలా క్రియేట్ చేశారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఆర్‌ఎంఎస్‌ఏ విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికిపైగా ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు నిలిచిపోయాయి. మార్చి నెల వేతనాలు ఏప్రిల్ ఒకటిన పొందాల్సి ఉంది. పాఠశాలల్లో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులకు వేతనాలు వారి ఖాతాల్లో జమ కాగా వీరికి మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాలు ఇప్పించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వేతనాలు రాలేదు...
మార్చి నెల వేతనాలు ఖాతాలకు జమ కాలేదు. దీంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. వేతనాలు మంజూరు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశాను. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.
– కాళిదాసు గంగాధరరావు, ఆర్‌ఎంఎస్‌ఏ టీచర్, నరేంద్రపురం, రాజానగరం మండలం
ఆర్థిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లాం
ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల విషయమై ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్‌కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి.
– కేఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్, కాకినాడ, తూ.గో.జిల్లా
Comments
Please login to add a commentAdd a comment