Sarvamatam
-
పార్లమెంటు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ముందుగా హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలతో ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధాన కార్యక్రమంలో 18 ఎన్డీఏ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు 25 పక్షాలు పాలుపంచుకోనున్నాయి. బిజూ జనతాదళ్, జేడీ(ఎస్), అకాలీదళ్, బీఎస్పీ, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్), టీడీపీ వీటిలో ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో దాదాపు 21 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన వేళ లోక్‌సభలో 50 మంది ఎంపీల బలమున్న ఈ ఏడు పార్టీల సంఘీభావం పాలక బీజేపీకి నైతిక స్థైర్యమిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. పాల్గొంటున్న బీఎస్పీ, టీడీపీ పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించనుండటాన్ని స్వాగతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. విపక్షాల బహిష్కరణ నిర్ణయం సరికాదన్నారు. ఆదివాసీ గౌరవం గురించి మాట్లాడుతున్న విపక్షాలకు రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపదీ ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. చరిత్రాత్మక సందర్భాన్ని రాజకీయం చేయకుండా హాజరై పెద్ద మనసు చూపాలని విపక్షాలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని కూడా పార్లమెంటులో భాగమేనని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతి అంటే మనందరికీ గౌరవమే. ద్రౌపదీ ముర్ము గురించి కాంగ్రెస్ నేతలు ఎలా మాట్లాడారో గుర్తు చేసి ఆ పదవిని వివాదాల్లోకి లాగదలచుకోలేదు’’ అన్నారు. కార్యక్రమం ఇలా... ► పార్లమెంటు నూతన భవన ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. తర్వాత సర్వమత ప్రార్థనలుంటాయి. ► అనంతరం హోమ వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తారు. ► అనంతరం లోక్‌సభ చాంబర్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ► మధ్యాహ్నం ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు పాల్గొంటారు. ► మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష పార్టీల నేతలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. -
సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన
సర్వమతం అమృత్‌సర్‌లోని సిక్కు మతస్థుల ప్రార్థనాలయం హర్మందిర్ సాహిబ్ (స్వర్ణాలయం) నిర్మాణానికి పునాది రాయి వేసింది ఒక ఇస్లాం మతస్థుడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది నిజం. సిక్కుల మత గురువులే స్వయంగా దగ్గరుండి మరీ సూఫీ సాధువు మియామీర్ (బాబా సెయిన్ మీర్ మహ్మద్ సాహెబ్) చేత ఆలయానికి శంకుస్థాపన చేయించారు! మీర్ అమృత్సర్ వెళ్లినప్పుడు తప్పనిసరిగా గురు అర్జున్దేవ్ దర్శనం చేసుకుని వచ్చేవారు. అర్జున్దేవ్ లక్నో వచ్చినప్పుడు విధిగా మీర్‌ను కలుసుకునేవారు. నాటి ముస్లింలు, హిందువులు, సిక్కులు సమైక్యంగా దైవాన్వేషణ చేసేవారు. అందుకే అన్ని మతస్థుల మధ్య గౌరవ మర్యాదలు, ఆదరాభిమానాలు ఉండేవి. మియామీర్ పూర్వీకులు సింధ్ ప్రాంతానికి చెందినవారు. పన్నెండేళ్ల వయసులోనే మీర్ ఐహికబంధనాల విముక్తికోసం అడవులకు వెళ్లారు. ఆ క్రమంలోనే మతగ్రంథాలను అధ్యయనం చేశారు. హేతువాదాన్నీ తర్కించి చూశారు. అంతిమంగా సూఫీ తత్వాన్ని అవలంబించారు. ఆయన మాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసేవి. అనతి కాలంలోనే మీర్ సూఫీ సాధువుగా అవతరించారు. కానీ ఆ పేరు ప్రఖ్యాతుల భారాన్ని మోయలేక మీర్ ఏకాంత జీవితాన్ని ఎంచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్ల తర్వాత లాహోర్ తిరిగి వచ్చి నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. మీర్‌కు ఐహిక సౌకర్యాలపై వ్యామోహం ఉండేది కాదు. ఆర్థిక సహాయం చేయవచ్చినవారి ప్రయత్నాలను చిరుకోపంతో తిరస్కరించేవారు. కానుకలు ఇవ్వడానికైతే నా దగ్గరికి ఎవరూ రానక్కర్లేదని కరాఖండిగా చెప్పేవారు. ‘‘నన్నొక యాచకునిగా చూడకండి. దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక దేనికీ నాకు లోటు ఉండదు. రేపటి కోసం నేనేదీ దాచుకోను’’ అని విడమరచి చెప్పేవారు. ఓరోజు చక్రవర్తి జహంగీర్‌కు ఈ సూఫీ సాధువు గురించి తెలిసింది. వెంటనే ఆయన్ని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్కడ మీర్ చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు జహంగీర్‌ని ఆకట్టుకున్నాయి. అతడికి అత్యంత విలువైన కానుక ఏదైనా ఇవ్వాలన్న ఆకాంక్ష చక్రవర్తిలో కలిగింది. కానీ మీర్ దేనినీ ఆశించరు. మరెలా? చివరికి ప్రార్థన వస్త్రాన్ని (జానమాజ్) భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నాడు చక్రవర్తి. మరో చక్రవర్తి షాజహాన్ అయితే లాహోర్‌లోని మీర్ నివాసాన్ని రెండుసార్లు దర్శించారు. ఇంకా ఎందరో పాలకులు, ప్రముఖులు, ప్రసిద్ధులు మీర్ దర్శనానికి నిరీక్షించేవారు! మీర్ అంతశ్శక్తి ఆయనలోని నిరాడంబరతే. ఆయన ధరించే దుస్తులు కూడా అతి సాధారణంగా ఉండేవి. శిష్యులు వారిస్తున్నా వినకుండా తన బట్టలు తనే శుభ్రపరచుకునేవారు మీర్. 1653 లో చనిపోయే ముందు కూడా ఆయన కడుపునొప్పితో బాధపడ్డారే కానీ, రాజవైద్యుల ఖరీదైన సేవలను అంగీకరించలేదు. ఆయన స్మృతికి చిహ్నంగా చక్రవర్తి షాజహాన్ లాహోర్ సమీపంలో మీర్ దర్గాను కట్టించారు. ముస్లింలతో పాటు సిక్కులు, హిందువులు కూడా నేటికీ ఆ దర్గాను దర్శించి మీర్ ఆశీర్వచనాల కోసం ప్రార్థనలు జరుపుతుంటారు.