సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన | Laid the foundation of the temple of the Sikhs and Muslims | Sakshi
Sakshi News home page

సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన

Published Thu, Mar 27 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన

సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన

సర్వమతం
 
అమృత్‌సర్‌లోని సిక్కు మతస్థుల ప్రార్థనాలయం హర్‌మందిర్ సాహిబ్ (స్వర్ణాలయం) నిర్మాణానికి పునాది రాయి వేసింది ఒక ఇస్లాం మతస్థుడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది నిజం. సిక్కుల మత గురువులే స్వయంగా దగ్గరుండి మరీ సూఫీ సాధువు మియామీర్ (బాబా సెయిన్ మీర్ మహ్మద్ సాహెబ్) చేత ఆలయానికి శంకుస్థాపన చేయించారు! మీర్ అమృత్‌సర్ వెళ్లినప్పుడు తప్పనిసరిగా గురు అర్జున్‌దేవ్ దర్శనం చేసుకుని వచ్చేవారు. అర్జున్‌దేవ్ లక్నో వచ్చినప్పుడు విధిగా మీర్‌ను కలుసుకునేవారు. నాటి ముస్లింలు, హిందువులు, సిక్కులు సమైక్యంగా దైవాన్వేషణ చేసేవారు. అందుకే అన్ని మతస్థుల మధ్య గౌరవ మర్యాదలు, ఆదరాభిమానాలు ఉండేవి.
 
మియామీర్ పూర్వీకులు సింధ్ ప్రాంతానికి చెందినవారు. పన్నెండేళ్ల వయసులోనే మీర్ ఐహికబంధనాల విముక్తికోసం అడవులకు వెళ్లారు. ఆ క్రమంలోనే మతగ్రంథాలను అధ్యయనం చేశారు. హేతువాదాన్నీ తర్కించి చూశారు. అంతిమంగా సూఫీ తత్వాన్ని అవలంబించారు. ఆయన మాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసేవి. అనతి కాలంలోనే మీర్ సూఫీ సాధువుగా అవతరించారు. కానీ ఆ పేరు ప్రఖ్యాతుల భారాన్ని మోయలేక మీర్ ఏకాంత జీవితాన్ని ఎంచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్ల తర్వాత లాహోర్ తిరిగి వచ్చి నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు.
 
మీర్‌కు ఐహిక సౌకర్యాలపై వ్యామోహం ఉండేది కాదు. ఆర్థిక సహాయం చేయవచ్చినవారి ప్రయత్నాలను చిరుకోపంతో తిరస్కరించేవారు. కానుకలు ఇవ్వడానికైతే నా దగ్గరికి ఎవరూ రానక్కర్లేదని కరాఖండిగా చెప్పేవారు. ‘‘నన్నొక యాచకునిగా చూడకండి. దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక దేనికీ నాకు లోటు ఉండదు. రేపటి కోసం నేనేదీ దాచుకోను’’ అని విడమరచి చెప్పేవారు.
 
ఓరోజు చక్రవర్తి జహంగీర్‌కు ఈ సూఫీ సాధువు గురించి తెలిసింది. వెంటనే ఆయన్ని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్కడ మీర్ చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు జహంగీర్‌ని ఆకట్టుకున్నాయి. అతడికి అత్యంత విలువైన కానుక ఏదైనా ఇవ్వాలన్న ఆకాంక్ష చక్రవర్తిలో కలిగింది. కానీ మీర్ దేనినీ ఆశించరు. మరెలా? చివరికి ప్రార్థన వస్త్రాన్ని (జానమాజ్) భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నాడు చక్రవర్తి. మరో చక్రవర్తి షాజహాన్ అయితే లాహోర్‌లోని మీర్ నివాసాన్ని రెండుసార్లు దర్శించారు. ఇంకా ఎందరో పాలకులు, ప్రముఖులు, ప్రసిద్ధులు మీర్ దర్శనానికి నిరీక్షించేవారు! మీర్ అంతశ్శక్తి ఆయనలోని నిరాడంబరతే. ఆయన ధరించే దుస్తులు కూడా అతి సాధారణంగా ఉండేవి.  

శిష్యులు వారిస్తున్నా వినకుండా తన బట్టలు తనే శుభ్రపరచుకునేవారు మీర్. 1653 లో చనిపోయే ముందు కూడా ఆయన కడుపునొప్పితో బాధపడ్డారే కానీ, రాజవైద్యుల ఖరీదైన సేవలను అంగీకరించలేదు. ఆయన స్మృతికి చిహ్నంగా చక్రవర్తి షాజహాన్ లాహోర్ సమీపంలో మీర్ దర్గాను కట్టించారు. ముస్లింలతో పాటు సిక్కులు, హిందువులు కూడా నేటికీ ఆ దర్గాను దర్శించి మీర్ ఆశీర్వచనాల కోసం ప్రార్థనలు జరుపుతుంటారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement