మహానుభావుడితో భానుమతి
‘అమ్మాయిలు కాదు.. అమ్మాయి. భానుమతి.. ఒక్కటే పీస్. రెండు కులాలు, రెండు మతాలు.. హైబ్రిడ్ పిల్ల’ అంటూ ‘ఫిదా’ సినిమాలో సందడి చేసిన సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నానీతో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, నాగశౌర్యతో ‘కణం’తో పాటు మరికొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సాయిపల్లవికి తెలుగులో మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్. వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న శర్వానంద్‌తో సాయిపల్లవి జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా విజయాలతో పాటు ఇటీవల ‘మహానుభావుడు’తో మరో హిట్ అందుకున్న శర్వా ప్రస్తుతం ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లోనూ మరో సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు శర్వానంద్. ఈ సినిమాలో శర్వాకి జోడీగా సాయిపల్లవిని తీసుకున్నారట. ‘ఎస్’ ఫర్ సక్సెస్. శర్వానంద్–సాయిపల్లవి పేర్లు కూడా ‘ఎస్’తోనే స్టార్ట్ అవుతాయి. ఇద్దరూ మంచి సక్సెస్‌లో ఉన్నారు. సో.. ఇద్దరూ కలసి సక్సెస్ఫుల్ మూవీ చేస్తారని ఊహించవచ్చు.