నేను ఆఖరిసారి చూసిందదే!
మొన్న గురువారం పొద్దున్నే శశి ఫోన్ చేసింది. శశి అంటే ఎమ్మెస్ నారాయణ కూతురు. ‘‘నాన్నగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంకుల్’’ అని చెప్పింది. అప్పుడు ఎమ్మెస్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. పదకొండున్నర ప్రాంతంలో నేను వెళ్లా. నన్ను చూడగానే గుర్తుపట్టాడని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. అప్పటివరకూ అచేతనంగా ఉన్నవాడు కాస్తా, నన్ను చూడగానే కదిలాడని డాక్టర్లు ఆశ్చర్యపోతూ చెప్పారు. నా చేయి దగ్గరకు తీసుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు. తర్వాత వాళ్లబ్బాయి విక్రమ్ చేతిని నా చేతిలో పెట్టాడు. ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు.
కానీ మాటలు రావడం లేదు. నేను బయటికి వచ్చేస్తుంటే రెండు చేతులెత్తి నాకు నమస్కారం పెట్టాడు. అదే నేను తనని ఆఖరిసారి చూడటం. నాకు మళ్లీ మళ్లీ అదే సీను గుర్తొస్తోంది. అందుకే, ఎమ్మెస్ పార్థివ దేహం చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. పదిహేను, 20 రోజుల క్రితమే... నేను, ఎమ్మెస్, బ్రహ్మాజీ, రఘుబాబు, వెన్నెల కిశోర్ ‘పండగ చేస్కో’ షూటింగ్లో కలిశాం. అందరం కలిసి లంచ్ చేశాం. మా ఇంటి నుంచే భోజనం వచ్చింది. ‘‘అన్నయ్యా... మీ ఇంటి భోజనం తింటే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లతో పని ఉండదు’’ అన్నారు ఎమ్మెస్.
నేనంటే ఎమ్మెస్కు చాలా ఇష్టం. ‘‘అన్నయ్య గారూ... అంటూ నాతో కష్టాసుఖాలన్నీ పంచుకునేవాడు. అన్నీ నాతో షేర్ చేసుకునేవాడు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ‘అదుర్స్, కృష్ణ, దూకుడు’... అన్నీ మాకు మంచి పేరు తెచ్చాయి. అతని కామెడీ కొంచెం డిఫరెంట్. ఫన్తో పాటు ఆలోచింపజేసేలా అతని జోక్స్ ఉంటాయి. అతనిలో మంచి రైటర్ ఉన్నాడు. దర్శకునిగా కూడా సమర్థుడు. సరైన ఛాన్సులొచ్చి ఉంటే, దర్శకుడిగానూ పేరు తెచ్చుకునేవాడు.