satellite phone service
-
కేంద్రం కీలక నిర్ణయం! కాల్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాల్స్ వివరాలన్నీ..!
న్యూఢిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, మెసేజీల సర్వీసులను అందించే సంస్థలు కూడా ఇకపై ఆ వివరాలను రెండేళ్ల పాటు తప్పనిసరిగా నిల్వ చేయాల్సి రానుంది. టెలికం శాఖ ఈ మేరకు సర్క్యులర్లను జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే వీటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిల్వ చేయాల్సిన కాల్ డేటా రికార్డుల పరిధిని ఇంటర్నెట్ కాల్స్‌కు కూడా పెంచుతూ ఏకీకృత లైసెన్సు(యూఎల్) నిబంధనలకు టెలికం శాఖ డిసెంబర్లో సవరణలు చేసింది. దీనికి కొనసాగింపుగా టెల్కోలతో పాటు వాయిస్ మెయిల్, ఆడియోటెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీస్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా వర్తించేలా తాజా నిబంధనలతో జనవరి 27న టెలికం విభాగం సర్క్యులర్లు జారీ చేసింది. శాటిలైట్ ఫోన్ సేవలు, డేటా సర్వీసులు అందించేందుకు లైసెన్సు పొందిన బీఎస్ఎన్ఎల్కు కూడా ఇదే తరహా సవరణను వర్తింపచేస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ తరహా లైసెన్సులు తీసుకున్న టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఏటీఅండ్‌టీ గ్లోబల్ నెట్వర్క్ మొదలైన వాటికి ఈ సవరణలు వర్తించనున్నాయి. శాటిలైట్ ఫోన్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలను ఏకీకృత లైసెన్స్ హోల్డర్లుగా పరిగణిస్తారు. (చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!) -
బీఎస్ఎన్ఎల్ మరో విప్లవాత్మక సర్వీసులు
న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నెట్ వర్క్స్ లేని రిమోట్ ప్రాంతాల్లో వాయిస్ సర్వీసులు అందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సర్వీసులను లాంచ్ చేసింది. తొలుత వీటిని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆఫర్ చేసి, అనంతరం దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్మార్ శాట్ - ఉపగ్రహ సమాచార సమూహం ద్వారా ఈ సర్వీసులను నెట్ వర్క్స్ లేని ప్రాంతాల్లో అందించనుంది. విపత్తు నిర్వహణ సంస్థలు, రాష్ట్ర పోలీసు, రైల్వే, బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్, ఇతర ఏజెన్సీలకు తొలి దశలో ఈ ఫోన్ సర్వీసులను అందిస్తామని లాంచింగ్ సందర్భంగా టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. టెలికాం డిపార్ట్ మెంట్, బీఎస్ఎన్ఎల్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఓ విప్లవాత్మక అడుగని అభివర్ణించారు.. విమానం, ఓడల్లో ప్రయాణించే వారు కూడా తర్వాత ఈ సర్వీసులను వాడుకోవచ్చన్నారు. వాయిస్, ఎస్ఎంఎస్ తో నేటి(బుధవారం) నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్ మాత్రమే శాటిలైట్ సర్వీసులను అందిస్తోంది. ఇంటర్నేషనల్ మొబైల్ శాటిలైట్ ఆర్గనైజేషన్(ఇన్మార్ శాట్) 1979లో అమెరికాలో ఏర్పాటుచేశారు. దీనిలో భారత్ కూడా ఒకానొక వ్యవస్థాపక సభ్యురాలు. భద్రత విషయాల పరంగా విదేశీ ఆపరేటర్లు సరఫరాల చేసిన కొన్ని శాటిలైట్ ఫోన్లను పారామిలటరీ బలగాలు వాడుతున్నారు. అన్ని కనెక్షన్లను బీఎస్ఎన్ఎల్ కు ట్రాన్సఫర్ చేస్తామని, కాల్ రేట్లను కూడా బీఎస్ఎన్ఎల్ కంపెనీనే నిర్ణయిస్తుందని ఇన్మార్ శాట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ శర్మ తెలిపారు. ఈ కాల్ రేటు రేంజ్ నిమిషానికి 30-35 రూపాయల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.