నిలువెల్లా నిస్తేజం
పదేళ్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకులు లేరు. కనీస పోటీ ఇవ్వగలిగే అభ్యర్థులూ లేక ఆ పార్టీ ఎన్నికలకు ముందే కాడి వదిలేసింది. సిట్టింగ్ అభ్యర్థులు కృపారాణి, కోండ్రు మురళీమోహన్, నిమ్మక సుగ్రీవులే ఆ పార్టీలో మిగిలారు. వారు కూడా తమ నియోజకవర్గాల్లో తీవ్ర గడ్డు పరి స్థితి ఎదుర్కొంటున్నారు. ద్వితీయ స్థానం దక్కించుకోవడం కూడా దాదాపు అసాధ్యమని ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇక మిగిలిన అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా తయారైంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారైన చౌదరి సతీష్(శ్రీకాకుళం), డోల జగన్(నరసన్నపేట), పాలవలస కరుణాకర్(పాతపట్నం), కిల్లి రామ్మోహన్రావు( టెక్క లి), వంకా నాగేశ్వరరావు(పలాస), నరేష్కుమార్ అగర్వాల్( ఇచ్ఛాపురం), రవికిరణ్( ఎచ్చెర్ల) తమ తమ నియోజకవర్గాల్లో కనీసం ప్రభావం చూపించే అవకాశాలు లేవు. ఇంత బలహీనమైన జట్టుతో కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులు ముందే ఆశలు వదిలేసుకున్నాయి. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడం మినహా కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు లేనే లేవన్నది సుస్పష్టం. కాంగ్రెస్ పరిస్థితే ఇలా ఉంటే... జిల్లాలో పోటీ చేయనున్న సమైక్యాంధ్ర పార్టీ, ఇతర పార్టీల గురించి చెప్పుకోవడానికేమీ లేదు.