రోజుకో కొత్తకోణం..!
కిడ్నీ రాకెట్‌పై ముమ్మర దర్యాప్తు
కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించిన పోలీసులు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్‌పై పోలీసుల దర్యాప్తులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన వ్యక్తికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడి కోసం ఓ బృందం రావులపాలెం వెళ్లినట్లు సమాచారం. మరో బృందం హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌తో వివరాలు సేకరించేందుకు వెళ్లింది. అసలు కిడ్నీ విక్రయించేందుకు సిద్ధమైన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం అతన్ని ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
కిడ్నీ విక్రయించడం తెలియకే...
క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఎలా విక్రయించాలో తెలియక కొంతమందిని సంప్రదించినట్లు సమాచారం. వారి సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను సంప్రదించినట్లు సమాచారం. రావులపాలేనికి చెందిన వ్యక్తి గతంలోనూ కొందరి కిడ్నీలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని పట్టుకుంటేనే కిడ్నీ రాకెట్ ఎలా సాగుతుందనేది తేలే అవకాశం ఉంది.
విజయవాడలోనే క్రాంతి దుర్గాప్రసాద్!
క్రాంతి దుర్గాప్రసాద్ ప్రస్తుతం ఎయిర్ కూలర్లకు మరమ్మతులు చేసుకుంటూ విజయవాడలోనే ఉంటున్నాడు. పోలీసులకు అతను దొరికాడా.. అతను ఇచ్చిన సమాచారం మేరకే దర్యాప్తును ముమ్మరం చేశారా.. లేక మరెవరైనా సమాచారం ఇచ్చారా.. అనేది వెల్లడికావాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసులు మాత్రం నోరుమెదపడం లేదు.