Satyaprabhas
-
అఖిల్.. రానా.. ప్రభాస్... ఓ సినిమా!
ఇంకా ఫోర్ డేస్ టైమ్ ఉంది. ఎందుకు? అంటే... హీరో అఖిల్ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి. రీసెంట్గా జరిగిన ప్రెస్మీట్లో నెక్ట్స్ సినిమాను జనవరి 10లోపు ఎనౌన్స్ చేస్తానని అఖిల్ చెప్పారు. కానీ అఖిల్ కంటే ముందే ఫిల్మ్‌నగర్‌లో ఓ ఎనౌన్స్మెంట్ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. అదేంటంటే.. దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారట. అంతేకాదు హీరో రానా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట. తమిళంలో ‘యాగవరాయినుమ్ నా కాక్క’ సినిమాను డైరెక్ట్ చేశారు సత్యప్రభాస్. తెలుగులో ‘మలుపు’ టైటిల్‌తో ఈ సినిమా రిలీజైంది. ఇందులో సత్య ప్రభాస్ తమ్ముడు అదేనండి.. రవిరాజా పినిశెట్టి చిన్న కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నటించారు. ‘మలుపు’ తర్వాత సత్యప్రభాస్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీ అయ్యారట. ఆ కథతోనే అక్కినేని కాంపౌండ్‌ని అప్రోచ్ అయ్యారని సమాచారం. మరి.. అఖిల్ హీరోగా ప్రభాస్ దర్శకత్వంలో రానా నిర్మాతగా సినిమా ఉంటుందా? వెయిట్ అండ్ సీ. -
ఈ ఫ్యామిలీ నాకు చాలా స్పెషల్ : దాసరి
‘‘ఇప్పటివరకూ చాలా ఆడియో వేడుకల్లో పాల్గొన్నాను. కానీ పినిశెట్టి ఫ్యామిలీ, ఈ ఆడియో వేడుక నాకు చాలా స్పెషల్. అల్లు రామలింగయ్య, చలం వంటి నటులను పరిచయం చేసింది రచయిత పినిశెట్టి శ్రీరామ్మూర్తి (రవిరాజా తండ్రి). ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాల వారితోనూ సినిమాలు చేశాను. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. రవిరాజా పినిశెట్టి నా దగ్గరే కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మొదటి సారిగా నిర్మాతగా మారి, ఈ సినిమా తీశాడు. విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఆదర్శ చిత్రాలయ పతాకంపై రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘మలుపు’. రవిరాజా పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండో కుమారుడు ఆది హీరోగా నటించారు. ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ కథానాయిక. ప్రవీణ్, శ్యామ్, ప్రసన్లు స్వరాలందించిన ఈ చిత్రం పాటల విడుదలవేడుక హైదరాబాద్‌లో జరిగింది. దాసరి బిగ్ సీడీని ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ సీడీని ఆవిష్కరించి, దర్శకుడు కోదండ రామిరెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ‘‘నా ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగుపెడ తారని అనుకోలేదు. ఓ యథార్థ సంఘటన ఆధారంగా సత్య ఈ కథ రాసుకున్నాడు. దర్శకుడిగా తనకిది మొదటి సినిమా కాబట్టి, బయటి నిర్మాతలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అందుకే నేనే నిర్మాతగా మారా’’అని రవిరాజా పినిశెట్టి చెప్పారు. ‘‘అన్నయ్య నాకు మొదట ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. హీరోగా నన్ను తీసుకుంటాడో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ చివరికి నన్నే తీసుకున్నాడు’’ అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకునిగా తాను చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని సత్యప్రభాస్ కోరారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు, దర్శకుడు హరీష్ శంకర్, నటుడు శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు. -
అనుకోని మలుపు
జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఓ యువకుడు ముంబయ్లోకి అడుగుపెట్టాడు. కానీ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ముంబయ్ మాఫియా అతని జీవితంలోకి అడుగుపెట్టింది. అలాంటి సందర్భంలో జీవితంలోని సవాళ్లను అతనెలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే ‘మలుపు’ చూడాల్సిందే అంటున్నారు సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన తనయుడు ఆది పినిశెట్టి, నిఖిత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన మరో తనయుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. ఈ నెల 14న పాటలను, 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘స్నేహం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం. -
ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి
యుముడికి మొగుడు, చంటి, పెదరాయుడు... ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ రవిరాజా పినిశెట్టిది. ఇప్పుడాయన పెద్దకొడుకు సత్యప్రభాస్ తండ్రిలాగా మెగాఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంగా తన తమ్ముడు, ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ ఆది పినిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘మలుపు’, తమిళంలో ‘యాగవరాయనుమ్ నా కాక్క’ పేరుతో రవిరాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత సి. కల్యాణ్, ప్రచార చిత్రాన్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు, డిజిటల్ ప్రచార చిత్రాన్ని గుణ్ణం గంగరాజు ఆవిష్కరించారు. ఈ ‘మలుపు’ సత్యప్రభాస్, ఆదికి గెలుపు కావాలని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు శుభాకాంక్షలు అందించారు. ‘రాశీ మూవీస్’ నరసింహారావు, దర్శక, నిర్మాత సాగర్, నటుడు నారాయణరావు తదితరులు ప్రచార చిత్రాలు బాగున్నాయని పేర్కొన్నారు. రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ-‘‘నటుడిగా ఆది ఇప్పటికే నిరూపించుకున్నాడు. దర్శకునిగా సత్యప్రభాస్ తొలి అడుగు వేశాడు. ఇది నా తొలి చిత్రం అయ్యుంటే నేనింత బాగా తీసి ఉండేవాణ్ణి కాదేమో’’ అన్నారు. అన్నయ్య దర్శకత్వంలో నాన్న నిర్మించిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఆది చెప్పారు. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డామనీ, బాగా తీశాననే నమ్మకం ఉందని సత్యప్రభాస్ అన్నారు.