రఘువరన్ మళ్లీ వస్తున్నాడు!
మాస్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్ ‘రఘువరన్ బీటెక్’తో తెలుగువారిని కూడా ఆకట్టుకోగలిగారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ (వీఐపి)కి అనువాద చిత్రం ఇది. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ మొదలైంది. విశేషం ఏంటంటే... రజనీకాంత్ రెండో కుమార్తె, ధనుష్ మరదలు సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ‘విఐపి 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రఘువరన్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్‌లైన్. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్ ధనుష్ రాయడం ఓ విశేషం. ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.