మళ్లీ ప్రశ్నలడిగితే సూసైడ్ చేసుకుంటా: టాపర్
తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. ప్యానెల్ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిన అతడు తనను ఏమైనా ప్రశ్నించినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ప్యానెల్‌ను హెచ్చరించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతడి హెచ్చరికతో రీ-ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్యానెల్ కాసేపు నిలిపివేసి.. ఆ తర్వాత అతడిని కొన్ని ప్రశ్నలు అడిగిందని, వాటికి సమాధానాలు చెప్పడంలో తడబడటంతో ప్యానెల్ సౌరభ్‌ను బయటకు పంపించిందని ఆ వర్గాలు తెలిపాయి.
రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందంటూ' ఇంటర్ టాపర్ రుబీ రాయ్ పేర్కొనడంతో.. బిహార్‌లో ఇంటర్ టాపర్ల బాగోతం వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బిహార్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి.