దేవుడినీ దోచేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సాక్షాత్తూ దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం ఆరోపించారు. అమరావతిలో టీటీడీ టెంపుల్ నిర్మాణం కోసమంటూ రూ.12.50 కోట్లు పెట్టి ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమిని కొనిపెట్టారని చెప్పారు. అక్కడ ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఉందని, మళ్లీ ఇంకో గుడి అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆదివారం విజయనగరం పట్టణంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు జరిగింది. విశ్రాంత ఉద్యోగులు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లం ప్రసంగించారు. రాష్ట్ర్ర ప్రభుత్వ వైఫల్యాలు, పాలకుల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరెవరో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కొందరు తమవిగా చెప్పుకుని, తమను తాము అపర భగీరథులుగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు. అస్మదీయులకు నేరుగా భారీ కాంట్రాక్టులు అప్పగిస్తూ కమీషన్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లం ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో భూమిని కొనడం జరగలేదు. డబ్బులిచ్చి కొనలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేది. తొలిసారిగా అమరావతిలో టీటీడీ టెంపుల్ అవసరమేంటో తెలియదు. రూ.12.50 కోట్లు పెట్టి ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమిని కొనిపెట్టారు. పక్కనే వైకుంఠపురం అనే గ్రామం ఉంది. అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. మళ్లీ అమరావతిలో టీటీడీ టెంపుల్ కోసం భూమి ఎందుకు కొన్నారో అర్థం కాలేదు. టీటీడీ ఎట్లా ఒప్పకుందో అర్థం కాలేదు. ఇది కాకుండా కొత్తగా జీవో ఇచ్చారు. తిరుపతిలో అవిలాల చెరువు అనే పాడైన చెరువు ఉంది. దాన్ని ఎకో టూరిజం కింద రూ.184 కోట్లతో అభివృద్ధి చేయండని టీటీడీకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. టీటీడీకి ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా భూమిచ్చినా, అది టీటీడీ పేరున ఉండాలి. దేవుడిని కూడా వదలకుండా దోపిడీ చేస్తున్నారంటే ఏ విధమైన పరిపాలనో అర్థం చేసుకోవాలి.
రాష్ట్రంలో మళ్లీ రాచరిక వ్యవస్థ
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ, ఇప్పుడు రాచరిక వ్యవస్థ కొనసాగుతోంది. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. హీరోల సినిమాలు చూడొచ్చు. కానీ, వారిని రాజకీయాల్లో హీరోలుగా చూడొద్దు. పార్టీ కార్యకర్తలకు ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందిస్తున్నారు. నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో భారీగా అవినీతి జరిగింది. పొరుగు రాష్ట్రంలో ఎస్ఎఫ్టీ ఇల్లు రూ.1,300కు కోట్ చేస్తే, ఏపీలో ఇంటి నిర్మాణానికి ఎస్ఎఫ్టీ రూ.2,400 కోట్ చేశారు.
ఆదర్శవంతం కాని జీవితాలు గడిపేవారు హీరోలా?
ఇటీవలి కాలంలో కొత్తగా సినిమా పాలిటిక్స్ తమిళనాడు తర్వాత మనకు అంటుకున్నాయి. సినిమా నటుల వ్యక్తిగత జీవితాలు ఎవరికీ ఆదర్శంగా ఉండవు. ఆదర్శవంతం కాని జీవితాలు గడిపేవారు సమాజానికి హీరోలు ఎలా అవుతారు? హీరోలంటే అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, దామోదరం సంజీవయ్య వంటి వారు. విజయనగరం జిల్లాలో శ్రీశ్రీ , తెన్నేటి విశ్వనాథం లాంటివారు హీరోలు. సినిమా హీరోల నటన బాగుంటే ఒకటికి పదిసార్లు సినిమా చూద్దాం. పరిపాలన నడిపించడానికి వారిని ఆదర్శంగా తీసుకోవద్దు.
బహిరంగంగానే దోపిడీ
రాష్ట్రంలో అవినీతి పార్టీ అధికారంలో ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీరు–చెట్టు వంటి స్కీమ్‌లు పెట్టి సగానికి సగం తినేసే విధంగా తయారు చేస్తున్నారు. కార్యకర్తల స్థాయి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే, మంత్రుల స్థాయి దాకా పంచుకుతింటున్నారు. నీరు–చెట్టుకు గత నాలుగైదేళ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చుపెట్టారు. సగానికి పైగా తినేశారు. కార్యకర్తల పేరుతో పార్టీకి అనుబంధంగా ఉండేవారు తినేస్తున్నారు. వారే మళ్లీ ఎన్నికల్లో ఖర్చుపెడతారు. ఇక ఎమ్మెల్యేలు తన పరిధిలో ఉన్న మట్టి, మద్యం దుకాణాల్లో వాటా, ఇసుక, రిజిస్ట్రేషన్ల వద్ద, పర్మిషన్ల కోసం పర్సేంటేజీల పేరుతో రూ.కోట్లు మింగేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఐటీలు, కొనుగోళ్ల దగ్గర నుంచి అంతా ఓపెన్‌గా కమీషన్ల వ్యవహారం సాగుతోంది. పెద్ద ప్రాజెక్టులన్నింటిలో 6 శాతం కమీషన్ ముఖ్యమంత్రికి సీఎంకు వెళ్తోంది.
పట్టిసీమలో విపరీతమైన దోపిడీ
కాగ్ రిపోర్టు చెప్పిన దాని ప్రకారం.. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.600 కోట్ల విలువైన పని జరిగితే రూ.1,600 కోట్లు అని లెక్కల్లో రాసేసుకున్నారు. చదరపు మీటర్ మట్టి తవ్వడానికి రూ.21,350 కోట్ చేశారు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాలెన్స్ వర్కును పెంచుకోవడానికి మరింతగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పని వేగంగా జరిగింది. ఆ తర్వాత పని పూర్తి కాలేదు.
ఆటోల కొనుగోలులోనూ కమీషన్లు
కొన్ని జిల్లాల కలెక్టర్లు నిరుద్యోగులకు ఆటోలిస్తే బాగుంటుందని భావించారు. రెండు జిల్లాల్లో రూ.1.20 లక్షలు, రూ.1.10 లక్షల ధరకు ఆటోలు కొన్నారు. ఆటోల కొనుగోలులోనూ కమీషన్లు మింగేయడానికి రాష్ట్రస్థాయిలో పూల్ చేసి కొంటామని చెప్పి 7,700 ఆటోలను యూనిట్ చేసి, ఒక్కో ఆటోను రూ.2.78 లక్షల ధరకు కైనటిక్ గ్రీన్ సంస్థ (క్వాలిఫైడ్ కానిది)తో నుంచి కొనేలా టెండర్లు ఖరారు చేశారు. లక్ష రూపాయలది రెండు లక్షలకు కొంటున్నారంటే ఇందులో ఎంత కమీషన్ తీసుకుంటున్నారో ఉందో అర్థం చేసుకోవాలి. మెడికల్ అప్లయన్సెస్ స్కామ్ ఒకటి విశాఖ జిల్లాలో జరుగుతోంది. అప్లయన్సెస్‌కు ఓ కాంట్రాక్టు ఇస్తున్నారు. మెడికల్ ట్రాన్స్స్పరేషన్కు 8 శాతం చొప్పున సర్వీస్ చార్జీలు ఇస్తున్నారు. దానికోసం రూ.3,800 ఉన్న మైక్రోస్కోప్‌ను రూ.30 వేలుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. రూ.800 నుంచి రూ.900 ఖరీదు చేసే గ్లూకోమీటర్‌ను గ్లూకోజ్ అనలైజర్ అని చెప్పి రూ.5.80 లక్షల చొప్పున కొంటున్నామంటున్నారు. హోల్‌సేల్‌గా దోచేయాలని చూస్తున్నారు.
మాల్యా, నీరవ్ మోడీ లాంటివారు ఆత్మహత్య చేసుకున్నారా?
విశాఖ బాటిలింగ్ కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు. ఒక పెద్దాయనకు చెందిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కాంప్లెక్స్ సిటీకి కృష్ణా జిల్లాలో 498.33 ఎకరాలను కేవలం రూ.4.95 కోట్లకు కేటాయించారు. నిజానికి ఆ భూమి ఖరీదు రూ.300 కోట్లు. ఇది భూమిలో వచ్చే లాభం. ఇది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితర వారిపై కేసులు పెట్టారు. వీరెవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? కార్పొరేట్ కంపెనీ పెట్టి, దానిపేరిట అప్పులు తీసుకోవచ్చు. జనాలను దోచేయొచ్చు. పర్సనల్‌గా ఉండే ఆస్తిని ఏం చేయలేరు. అదే రైతు తీసుకుంటే మొత్తం కుటుంబం నుంచి రికవరీ చేస్తారు.
కావాల్సిన వారికి రూ.వందల కోట్లు
ఆ దీక్షా, ఈ దీక్ష అంటూ కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేస్తామనుకుని నిర్ణయం తీసుకుని, నన్ను, సాంబశివరావు, శ్యామ్బాబులతో కమిటీ వేశారు. డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడుండాలో చూసిరండన్నారు. డబ్బుల్లేని రాష్ట్రమని, ఎక్కడపడితే అక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదని, అడ్మిషన్స్ లేని ఇంజనీరింగ్ కళాశాలలు నిరుపయోగంగా ఉన్నాయని గ్రహించి, రెండు కళాశాలలు తీసుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్‌కి సరిపోతుందని, మొత్తం కలిపితే ఏడాదికి రూ.10 కోట్లు సరిపోతాయని నివేదిక ఇస్తే, దాన్ని చెత్తబుట్టలో పడేసి, తమకు కావాల్సిన వారిందరికీ మంచి అద్దెలొస్తాయని, కమీషన్లు వస్తాయని, లాభం సమకూర్చాలని చెప్పి ఇప్పుడు రూ.వందల కోట్లు అద్దెలు కట్టడాన్ని చూస్తున్నాం.
రాజధానికి 35,000 ఎకరాలా?
మామూలు వ్యక్తే తన ఆర్థిక పరిస్థితి ఆధారంగా జీవిస్తాడు. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం తప్పుడు పనులు చేయొచ్చా? హైదరాబాద్‌లో సెక్రటేరియట్ 25 ఎకరాల్లో ఉంది. రాయపూర్ లాంటి ఆధునిక నగరాన్ని కేవలం 5 వేల ఎకరాల్లో కట్టారు. మనకు నాగార్జున యూనివర్సిటీని తీసుకుంటే 400 ఎకరాల్లోæ అన్నీ వచ్చేవి. అసెంబ్లీ వచ్చేది, బ్రహ్మాండమైన సెక్రటేరియట్ వచ్చేది. దానికి 35 వేల ఎకరాలు ఎందుకు? ఇంకా ఇన్ని వేల కోట్లు అవసరమేంటి? ఎవరి డబ్బు ఇది? కట్టేది మనమే. మన అప్పు రూ.2,52,020 కోట్లు. రాష్ట్ర జీడీపీలో 27.3 శాతం అప్పు ఇప్పటికే చేశాం. ఫైనాన్సియల్ రూల్ ప్రకారం అప్పు ఎట్టిపరిస్థితుల్లోనూ 25 శాతం దాటరాదు. కానీ, 27 శాతానికి చేరింది. వీటితోపాటు నాన్బడ్జెట్లో మరింత దోచేస్తున్నారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ రోజు దేశంలో 16.5 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. కానీ, ఏడాదికి 2 లక్షల ఇంజనీర్లకు కూడా ఉద్యోగాలివ్వలేని ఎకానమీ మనది. మన కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ జీడీపీ ఉన్న అమెరికా వంటి దేశంలో ఏడాదికి కేవలం రెండు లక్షల మంది ఇంజనీర్లను తయారుచేస్తున్నారు. అమరావతి వద్ద కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఉన్నవాటికే దిక్కులేదు. మనుషుల్లేరు. ఉన్న కళాశాలలు మూసివేతకు గురవుతున్నాయి. పోనీ ఫీజులో తగ్గింపునిస్తున్నారా అంటే ఏదీ లేదు.
ప్రజారోగ్యం ప్రైవేట్‌పరం
రెయిన్ గన్స్, ఆయిల్ పేరుతో అనంతపురం జిల్లాలో రూ.111.98 కోట్లు ఖర్చు పెట్టారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో 13,334 రెయిన్‌గన్స్ కొన్నారు. వీటి కొనుగోళ్లలో షేర్లు, పర్సెంటేజీలు తప్పితే ఇంకేమీ లేదు. ఇక మెకనైజేషన్ పేరుతో దాదాపు రూ.11,000 కోట్లు అంటున్నారు. రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు పరం చేస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. రైతులు తమ పిల్లలను పెద్ద చదువులు చదివించుకోలేకపోతున్నారని గ్రహించి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వారికి భరోసా కల్పించారు.
రైతుల ఉసురు పోసుకున్నారు: గోపాలరావు
రాజధాని నిర్మాణం కోసం విజయవాడ వైపు వెళ్లొద్దని చెప్పిన శివరామకృష్ట కమిటీ నివేదికను పక్కన పెట్టడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసమంటూ 32 వేల ఎకరాల సాగు భూమిని తీసుకొని రైతుల ఉసురు పోసున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకుల నిర్వాకం వల్ల కౌలు రైతులు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి సీఎం చంద్రబాబు ముందుకు రాకపోవడంవల్ల రాష్ట్రంలో 12,850 సర్పంచులు, 1.38 లక్షల వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఎన్నికలకు వెళ్లడానికి పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా పెంచి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కిర్ల విజయ్‌కుమార్, ప్రొఫెసర్ పీవీజీవీ ప్రసాద్‌రెడ్డి, రాజకీయ విశ్లేషకులు కె.రవికుమార్, ప్రొఫెసర్లు రాఘవరెడ్డి, రామకృష్ణారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ శివరామ్మూరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోలేమా?
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఆంధ్రాలో 1995లో 1,250 ఆత్మహత్యలు, 1996లో 1,700, 1997లో 1,100, 1998లో 1,750, 1999లో 1,900 ఆత్మహత్యలు జరగ్గా, అంతా బోగస్ 300 మందే చనిపోయారని చెబుతున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్ ఆసుపత్రులు కట్టిస్తున్నారు. ఒక్కో జిల్లాకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న ఆసుపత్రులను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసుకోలేమా?’’ అని అజేయ కల్లం ప్రశ్నించారు.