save visakha
-
తిన్నదంతా కక్కిస్తాం
⇔ టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నిటినీ పేదలకు తిరిగి ఇచ్చేస్తాం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇔ టీడీపీ కబ్జా బారిన పడ్డ బాధితులకు అండగా ఉంటాం ⇔ ముఖ్యమంత్రి మాఫియాగా మారి దోచుకుతింటున్నారు ⇔ గంటాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత అంటూ వాటాలు పంచుకుంటున్నారు ⇔ ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో వైఎస్ జగన్ ధ్వజం సాక్షి, విశాఖపట్నం: ‘‘మీకందరికీ ఒక మాట చెబుతున్నా. ఒక భరోసా ఇస్తున్నా. పేదలకు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పరాధీనం కాకుండా, వారికి నష్టం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. వీళ్ల(టీడీపీ) పాలన మరో సంవత్సరమో, ఒకటిన్నర సంవత్సరమో అంతకంటే ఎక్కువ ఉండదని గట్టిగా చెబుతున్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన. వీళ్లు తిన్నదంతా కక్కిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి అంగుళం భూమినీ మళ్లీ పేదవాడికే ఇస్తామని చెబుతు న్నాం. వైఎస్సార్సీపీ మీకందరికీ తోడుగా, నీడగా నిలుస్తుంది’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ప్రజలకు భరోసా ఇచ్చారు. మన భూములను కాజేస్తున్న తెలుగుదేశం పార్టీ దొంగలను బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ గురువారం జీవీఎంసీ ఎదుట గాంధీబొమ్మ వద్ద ‘సేవ్ విశాఖ’ పేరిట అఖిలపక్ష నేతలతో కలసి మహాధర్నా నిర్వహించింది. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన భూ బాధితులతో విశాఖ హోరెత్తింది. మహాధర్నాలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి మాఫియాగా తయారయ్యారని నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లాను పూర్తిగా దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే... హుద్‌హుద్‌లో రికార్డులు పోయాయట! ‘‘కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇటీవలే ఓ ప్రకటన చేశారు. జిల్లాలో 43 మండలాలు ఉన్నాయి. 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ ఉన్నాయి. వాటిలో 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ అంటే సర్వే నంబర్లు కనిపించడం లేదట! 1,06,239 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇవీ. 375 రీసెటిల్మెంట్ రిజిస్టర్స్ కూడా కనిపించడం లేదట. కలెక్టర్ ఏమన్నారో తెలుసా? హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అవన్నీ పోయాయట. హుద్‌హుద్ వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ విషయం కలెక్టర్‌కు గుర్తుకురావడం ఆశ్చర్యమే స్తోంది. హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సునామీ మాదిరిగా నీళ్లేమీ రాలేదు. గాలి వచ్చింది. గాలితోపాటు కొద్దోగొప్పో వర్షం వచ్చి వెళ్లిపోయింది. అంతేగానీ కలెక్టరేట్ వంటి పెద్దపెద్ద భవనాలు గాలికి ఎగిరిపోయినట్టు మనమెక్కడా చూడలేదు. ఆ సమయంలో నేనొచ్చి 11 రోజులపాటు ఇక్కడే ఉన్నా. ప్రతి ప్రాంతాన్నీ సందర్శించా. వీళ్లు చేసే అన్యాయమైన పని ఏమిటంటే.. రెవెన్యూ రికార్డులన్నీ మాయం చేయడం, రికార్డులను ఎలా కావాలంటే అలా మార్చేసుకోవడం. హుద్‌హుద్ వచ్చింది రికార్డులన్నీ పోయాయని చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. అక్షరాలా 1.6 లక్షల ఎకరాల పరిస్థితి ఇది. ప్రభుత్వ భూములే దాదాపు 23,876 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంత దారుణంగా భూ కుంభకోణాలు జరుగుతుంటేæ ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. హుద్‌హుద్ వల్ల 1.6 లక్షల ఎకరాలకు చెందిన రికార్డులు పోయాయంటే ఎవరు నమ్ముతారు. ఆ సమయంలో ఈయనే జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసింది ఈయనే. ఇప్పుడు కలెక్టర్‌గా ఈయనే వచ్చారు. అధికారులు దగ్గర ఉండి మరీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కై కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌తో కుమ్మక్కై ల్యాండ్ పూలింగ్ కోసం జీవోలు ఇప్పిస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను, చివరకు వేరేవారి పేరు మీద ఉన్న భూములను సైతం కాజేస్తున్నారు. గంటాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి భాస్కరరావు వేరేవారి భూములకు తన పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. సర్వే నంబర్ 122/11లో పేదల కాలనీలోని ఇళ్లు కూడా తమవిగా పేర్కొంటూ బ్యాంకులో తాకట్టు పెట్టారు. సర్వే నంబర్ 121/9,10,11,12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతరుల పేరు మీద ఉన్న భూములకు కూడా డాక్యుమెంట్లు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు. ఇదే విశాఖ జిల్లా అధికారులు దగ్గర ఉండి మరీ ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పనులు చేయిస్తూ ఉన్నాడంటే కేవలం ఆయన ఒక్కడికే దీంతో సంబంధం ఉందనుకోవద్దు. గంటాకు ఇంత, నారా లోకేశ్ ఇంత అని వాటాలు పంచుకునే కార్యక్రమాలు జరుగుతు న్నాయి. గంటా శ్రీనివాసరావు సాక్షాత్తూ ఒక మంత్రి. రెవెన్యూ రికార్డులను మార్చేసి, ఇతరుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న కంపెనీలో ఆయన ఇంతకుముందు డైరెక్టర్‌గా ఉన్నారు. గంటా వ్యవహారాన్ని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. విశాఖలో భూముల దోపిడీ, భూ దందా జరుగుతోందని చెప్పారు. దీన్ని ఎందుకు అరికట్టలేక పోతున్నామో ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఈ దందా సాగదన్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చి భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణాలపై మంత్రి ఏకంగా పత్రికలకెక్కారు. జగన్ వస్తున్నాడంటే బటన్ నొక్కేస్తారు ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ గున్నూరు వెంకట సత్యనారాయణ(పెదబాబు) కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, ఆయన భార్య పేరిట 25 ఎకరాలు రాయిం చేసుకున్నారు. ఈ విషయం ఈనాడు పత్రికలో వచ్చింది. సాక్షిలో కాదు. జగన్మోహన్రెడ్డి ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వస్తున్నాడని తెలుసుకొని కంప్యూటర్లలో ఈ భూముల పేర్లను సరిచేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. జగన్ వస్తున్నాడంటే కంప్యూటర్లో ఒక బటన్ నొక్కుతారు. జగన్ రావడం లేదంటే ఇంకొక బటన్ నొక్కుతారు. ఇంత దారుణంగా ఇక్కడ భూములను స్వాహా చేసేస్తున్నారు. రూ.1,100 కోట్ల భూములు ‘గీతం’కు ధారాదత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీని నడుపుతున్నారు. ఆయన ఎవరో కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు. రుషికొండలో ఈయన 55 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. అవి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం, ప్రభుత్వ భవనాల కోసం వివిధ శాఖలకు కేటాయించినవి. వాటిని కబ్జా చేయడమే కాదు.. ఆ భూములను తనకే ఇచ్చేయండంటూ ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వానికి లేఖ రాస్తే చంద్రబాబు ఆ మేరకు కేబినెట్లో తీర్మానం చేశారు. రూ.1,000 కోట్ల విలువైన ఈ భూములను చంద్రబాబు దగ్గరుండి మరీ తన బంధువుకు ధారా దత్తం చేశారు. అలాగే పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 7.52 ఎకరాలు కేటాయించి, జీవో కూడా ఇచ్చారు. ఆ భూములను కూడా ఎంవీవీఎస్ మూర్తి కబ్జా చేశారు. వాటిని కూడా తనకే ఇవ్వాలని అడగడం, చంద్ర బాబు వెంటనే ఆమోదం తెలపడం జరిగిపోయాయి. ఈ భూముల విలువ రూ.100 కోట్లు. ఇవి ఆక్రమ ణకు గురయ్యాయని ఇంతకు ముందు పనిచేసిన విశాఖ కలెక్టర్ రాజీవ్ స్వగృహ సంస్థకు లేఖ రాశారు. ‘ఒక అన్యాయస్తుడు మీ భూములను ఆక్రమించాడు, కాపాడుకోండి’ అని సూచించారు. అధికారులు సర్వే చేసి, పూర్తి వివరాలు ఇచ్చినా పట్టించుకోకుండా చంద్రబాబు తన సొంత బంధువులకు ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారు. ఇక వివాదంలో ఉన్న దసపల్లా భూముల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టించారు. ప్రైవేట్ భూమిని కబ్జా చేసి కట్టించారా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టించారా? చంద్రబాబే సమాధానం చెప్పాలి. పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి.. చంద్రబాబు హయాంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదలు, అసైన్డ్ భూములున్న వాళ్లు వణికిపోతున్నారు. ఎక్కడ మా భూములు లాక్కుంటారో అని భయపడి పోతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ ఎమిటో తెలుసా? ‘రాబ్ దా పూర్ అండ్ డీల్ విత్ రిచ్’ అంటే పేదవాడిని దోచేసుకో, పెద్దవాడితో కుమ్మక్కుకా.. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం. ఇవాళ విశాఖ జిల్లాలో పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దల కళ్లు ఎక్కడ మా భూములపై పడతాయో? ఎక్కడ కబ్జా చేస్తారో? అని భయపడుతూ జీవిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ముందెన్నడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతా ఉంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. మొట్టమొదట బహిరంగ విచారణ చేయిస్తామన్నారు. అలాగైతే వేలాది మంది వచ్చి తమకు అన్యాయం జరిగింది అని ఫిర్యాదు చేస్తారన్న భయంతో బహిరంగ విచారణ ఆపేశారు. చంద్రబాబు ఇచ్చింది కుంభకోణాలు, అవినీతి విశాఖ జిల్లా చంద్రబాబుకు, ఆయన పార్టీకి చాలా చేసింది. ఎంతో ఇచ్చింది. కానీ, మీరు విశాఖ జిల్లాకు ఏం చేశారని చంద్రబాబును అడుగుతున్నా. ఈ జిల్లాకు చంద్రబాబు ఏమిచ్చారో తెలుసా? కుంభకోణాలు ఇచ్చారు, అవినీతిని ఇచ్చారు. దోచుకోవడానికి విశాఖ జిల్లా ప్రజలు తనకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే విచ్చలవిడిగా దోపిడీ సాగిస్తున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ముఖ్యమంత్రి అంటే కొంత భయం ఉంటుంది. ఏమైనా అవకతవకలు జరిగి ముఖ్యమంత్రికి తెలిస్తే తాట తీస్తాడని భయపడతారు. అన్యాయం చేస్తే జైల్లో పెట్టిస్తారని అనుకుంటారు. ఇవాళ చంద్రబాబు హయాంలో మన పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఒక మాఫియాగా తయారై దోచుకొని తింటూ ఉంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పొరుగు దేశం నుంచి ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. మన భూములను కాపాడుకునేందుకు పోరాడతాం. కానీ, మన ప్రభుత్వ పెద్దలే మన భూములను లాక్కుంటూ ఉంటే మనమేం చేయాలి? కబ్జాదారులను బంగాళాఖాతంలో కలిపేయాలి’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సీబీఐకి ఇస్తే జైలుకు పంపిస్తారని భయమా? విశాఖ భూముల కబ్జాలపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) వేశారు. ఈ సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసే వాళ్లే. వారితో విచారణ చేయిస్తారట! ఇక్కడ జరిగిన స్కామ్‌లన్నీ చేసింది చంద్రబాబు.. ఆయన కొడుకు.. ఆయన మంత్రులు.. ఆయన రెవెన్యూ అధికారులు. అలాంటప్పుడు ఆయన కింద ఉన్న అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా? ఇదెలా ఉందంటే ‘సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం కరెక్టేనా అనేదానిపై రావణాసురుడు కుంభకర్ణుడితో విచారణ వేయించినట్టుగా ఉంది. అదే విచారణ హనుమంతుడితో చేయిస్తే దోషులను తన్ని లోపల వేస్తాడు. రావణాసురుడిని తంతాడు. రాక్షసులను తంతాడు. అలాగే ఇక్కడ కూడా విచారణను సీబీఐకు అప్పగిస్తే చంద్రబాబును, ఆయన కొడుకును, మంత్రులను తంతారు. తన్ని లోపల వేస్తారు. సీబీఐ విచారణ చేయిస్తే అది పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుంది, అందుకే చేయించడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. సీబీఐకి అప్పగిస్తే విచారణ 20 ఏళ్లు పడుతుందనా? లేక 20 ఏళ్లు మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయమా? విశాఖ భూముల కబ్జాపై ‘సిట్’ విచారణ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి. వీళ్లు నిజంగా మనుషులేనా? పెందుర్తి, మదుపాకలో 955 ఎకరాల అసైన్డ్ భూములపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కన్నేశారు. మేము రూ.10 లక్షలకు కొనుగోలు చేస్తాం, అదే ప్రభుత్వమైతే లక్షా, రెండు లక్షలు కూడా ఇవ్వబోదని చెప్పి, రైతులను భయపెట్టి కొనుగోలు చేసి, చివరకు ల్యాండ్ పూలింగ్‌లో రూ.2 కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకునే కార్య క్రమం చేస్తున్నారు. బండారు కూడా ‘నాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుని దోచేస్తున్న తీరు చూస్తుంటే వీళ్లు నిజంగా మనుషులేనా? అనిపిస్తోంది. గద్దలు తన్నుకుపోతున్నాయ్ భీమిలి నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్ భూములను గంటా శ్రీనివాసరావు తన బినామీలతో కొనుగోలు చేయిస్తాడు. అసైన్డ్ భూములను ఎవరూ కొనుగోలు చేయకూడదు. అయినా ల్యాండ్ పూలింగ్ అని భయపెట్టి తన బినామీల ద్వారా గంటా కొనుగోలు చేయిస్తాడు. కొనుగోలు చేయించిన తర్వాత అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వొచ్చు, అగ్రిమెంట్ హోల్డర్లకు కూడా ఆ హక్కు ఉంటుందని చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ ద్వారా జీవోలు కూడా ఇప్పించేస్తారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల భూములను గద్దలొచ్చి తన్నుకుపోతున్నాయి. ఇవొక్కటే కాదు.. విశాఖ జిల్లాలో జరిగే అన్ని భూ దందాల్లో వాటాలు పంచుకుంటున్నారు. ‘గంటాకు ఇంత.. నారా లోకేశ్‌కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుం టున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ జిల్లాను దోచేస్తున్నారు. -
ఆక్రమణలపై అఖిల పక్షం కన్నెర్ర
విశాఖపట్నం : భూ నేరగాళ్ల అసలు మజిలీలా మారిన విశాఖపట్నాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో అఖిల పక్షం నినదించింది. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు గురువారం మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కబ్జాకోరుల బారి నుంచి భూబాధితులను కాపాడేందుకు వైఎస్ జగన్‌తో కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పగా.. అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబు సహా.. టీడీపీ నేతలంతా జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా కబ్జాదారుల పరం కాకుండా పోరాటం సాగిస్తామని సేవ్ విశాఖ వేదిక సాక్షిగా స్పష్టం చేశారు. చంద్రబాబే ప్రథమ ముద్దాయి : గుడివాడ అమర్నాథ్ (వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు) టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో ఉన్న పేద రైతుల భూములతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, దేవుడి భూములు ఇలా కన్ను పడిన ప్రతి భూమిని కూడా ఆక్రమించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మూడేళ్లుగా టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పేద రైతాంగానికి చెందిన భూములు, దేవుడు మాన్యాల్ని, చెట్టుని, పుట్టని గట్టుని మాయం చేసేస్తున్నారు. లక్ష ఎకరాల భూ కుంభకోణంలో సీఎం చంద్రబాబు ప్రథమ ముద్దాయిగా మారారు. సీఎంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వారంతా కుమ్మక్కై భూ దోపిడీకి పాల్పడ్డారు. ప్రజలకు అండగా వైఎస్సార్ సీపీ నిలబడి పోరాడుతుంది. మహాధర్నాకు పోటీగా మహాసంకల్పం చేస్తామని టీడీపీ ప్రకటించింది. అది మహా సంకల్పం కాదు.. మహా సంకల్ప దీక్ష. చంద్రబాబు నుంచి టిడీపీ కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. భూ కబ్జాదారుల్ని బేడీలేసి నడిపించాలి : సీహెచ్ నరసింగరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు) రాష్ట్రంలో ఇదో ప్రధాన సమస్యగా మారింది. హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్‌గా విశాఖను మారుస్తానని ప్రతిసారీ చెప్పిన చంద్రబాబు.. చివరికి భూకబ్జాల హబ్‌గా మార్చేశారు. కాపాడాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలే భూ కబ్జాలకు పాల్పడుతుంటే.. ప్రజలకు అండగా నిలబడాల్సిన సీఎం సిట్ వేసి చేతులు దులిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిర్చి రైతులు ధర అడిగితే బేడీలు వేసుకొని తీసుకెళ్లారు. మరి ప్రభుత్వ, పేదల భూమలు దోచుకుంటున్న వారిని ఏం చెయ్యాలి. ఈ భూకబ్జాదారులందర్నీ బేడీలేసి నడిపించుకుంటూ తీసుకెళ్లాలి. ప్రజలు ఇంతలా ఉద్యమిస్తుంటే.. స్థానిక ఎంపీ నోరుమెదపకపోవడం గర్హనీయం. దీనిపై జగన్ నేతృత్వంలో ప్రజా ఉద్యమం నిర్మించాలి. అఖిలపక్షమంతా కలిసి పోరాడితేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేనట్లుంది : స్టాలిన్ (సీపీఐ జిల్లా కార్యదర్శి) వందల ఎకరాల భూముల్ని అధికారం అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాజేశారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో ధర్నా నిర్వహించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. మూడేళ్ల నుంచి విశాఖలో ఏరకమైన రక్షణ భూములకు లేదు. కొమ్మాది, భీమిలి, మధురవాడలో ఎక్కడా ప్రభుత్వ భూమిని వదల్లేదు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన టీడీపీ రాష్ట్ర మాజీ సైనికోద్యోగ సంఘ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ జైలుకి వెళ్లాడు. వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదు. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన జరుగుతుందా లేదా అన్నది అర్థం కావడం లేదు. కబ్జా కాండలో దోషులు సిట్ ద్వారా వెలుగులోకిరారు కాబట్టి సీబీఐ విచారణ చేపట్టాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భూములు ఆక్రమించిన వారికి పుట్టగతులుండవ్ : కరణం ధర్మశ్రీ, (చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే) విశాఖలో జరుగుతున్న భూ దందాలో సీఎంకు చందాలు వెళ్తున్నాయి. చాపకింద నీరులా.. రికార్డులు ట్యాంపరింగ్ చేస్తూ.. భూములు దోచుకుంటున్నారు. ఒక మంత్రికి హామీ.. మరో మంత్రికి లేమి. వారిద్దరి మధ్య వచ్చింది సునామీ. ఈ సునామీలో పేదల భూములు గల్లంతయ్యాయి. కానీ ఈ పనంతా చేసింది టీడీపీ మంత్రులే. ముదపాక, అచ్యుతాపురం, కొమ్మాది, మధురవాడ.. భూములు ఎక్కడ ఉంటే అక్కడ స్కాములు జరుగుతున్నాయి. టీడీపీ నేతల అక్రమాల వెన్ను విరిచే కార్యక్రమానికి మహ«ధర్నా శ్రీకారం చుట్టాం. పేదల భూముల్ని ఆక్రమించిన వారికి పుట్టగతులుండవు. టీడీపీ నేతలు ఊచలు లెక్కపెడతారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి : బంగారి (బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు) చంద్రబాబుకి ఏ జిల్లా ప్రజలు ఇవ్వని మెజారిటీని విశాఖ పట్నం కట్టబెడితే.. చంద్రబాబు మాత్రం తన అవినీతి మార్కుని చూపిస్తున్నారు. విశాఖను టీడీపీ విలాసాలకు వాడుకుంటోంది. రైతులు, ప్రభుత్వం, మాజీ సైనికులు తేడా లేకుండా.. భూమలు దోచుకుంటున్నారు. ఇలాంటి నీతిమాలిన కార్యక్రమాలు ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ జగన్‌తో పోరాడతాం. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబుకి ప్రజల ఉసురు తగులుతుంది. అలుసిస్తే ఇంటిని కూడా లాక్కుంటారు : అన్నంరెడ్డి అదీప్‌రాజు (పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీ జాగా కనిపిస్తే చాలు దాన్ని ఎలా కబ్జా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ భూ కబ్జాల నుంచి విశాఖను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుంది. పెందుర్తి నియోజకవర్గంలో ముదపాక భూముల్ని ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారో.. రాష్ట్రమంతటా తెలుసు. కానీ.. సదరు టీడీపీ నేతలు మాత్రం కర్జా కాండ కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగితే.. మన ఇంటిని కూడా లాక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే.. లక్షల ఎకరాలను దోచుకున్న టీడీపీకి బుద్ధి చెబుదాం. భూ దందాలకు అడ్డు చెప్పేందుకు ఏకతాటిపై ఉద్యమిద్దాం.ప్రభుత్వం బారినుంచి భూముల్ని కాపాడుదాం బాబు హయాంలో భూదందాలు : బొడ్డేటి ప్రసాదరావు (యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త) వైఎస్సార్ పాలనలో విశాఖపట్నం ఎలా ఉంది.. చంద్రబాబు పాలనలో జిల్లా ఎలా భ్రష్టుపట్టిందో ప్రజలంతా గమనిస్తున్నారు. భూదందాలు సాగిస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ మూకుమ్మడిగా భూబకాసురుల అవతారమెత్తి దోచుకుతింటున్నారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారు. అందుకే.. విశాఖ జిల్లాను కాపాడేందుకు నడుంబిగిద్దాం. దోచుకోడానికే అధికారం : గొల్ల బాబూరావు (మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి) విశాఖలో గజం స్థలం కూడా పేదల పేరున ఉండకుండా చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల ఈ దోపిడికి పాల్పడుతున్నారు. నారా లోకేష్ నాయకత్వంలోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. అందరూ దోచుకుతినండంటూ అధికారాలు జారీ చేసినట్లు సాగుతోంది ఈ భూదందా. ఎవ్వర్నీ ఉపేక్షించం. అధికారం లోకి వచ్చిన వెంటనే.. తిన్నదంతా కక్కిస్తాం.. జైలు ఊచలు లెక్కెట్టిస్తాం. వైఎస్సార్‌లా జగన్ పోరాడాలి : బీశెట్టి బాబ్జి (లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు) విశాఖ పట్నంలో జరిగిన అవినీతిపై ఇంత పెద్ద రంకె వేస్తుంటే.. చంద్రబాబుకి వినిపించడం లేదా.? మహానాడులో ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటూ చంద్రబాబు ఏ సబ్జెక్టుపైనైనా అనర్గళంగా మాట్లాడతారని అంటే.. మరో ఆటో డ్రైవర్ మా ఆవిడ సబ్జెక్ట్ లేకపోయినా.. ఏకధాటిగా మాట్లాడగలదు అని అన్నారు. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంది. నిజంగా మనస్సాక్షి ఉంటే.. జరుగుతున్న అక్రమాల్లో చంద్రబాబు, మంత్రుల హస్తం లేదని కనకమహాలక్ష్మి సాక్షిగా ప్రమాణం చెయ్యాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు పూర్తిగా నష్టపోయాడు. ఆముదాలవలస, తుమ్మపాల చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. మార్కెట్లో పరిస్థితి సైతం బాలేదు. రాష్ట్రం కబ్జాదారులు, కుంభకోణాలతో అట్టుడికిపోతోంది. దీనికి ప్రధాన కారణమైన టీడీపీ ప్రభుత్వంపై అఖిలపక్షం పోరాడుతుంది. మడమతిప్పని నాయకుడు వైఎస్సార్. ఆయనలా మడం తిప్పకుండా జగన్ పోరాటం సాగించాలి. జైలుకెళ్లక తప్పదు : మళ్ల విజయప్రసాద్ (వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త) లక్షల ఎకరాల భూముల్ని దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై.. మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా.. నిరుపేద భూముల్ని సైతం లాక్కుంటూ రోడ్డున పడేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నిరుపేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దొంగలు, దోపిడీదారులంతా జైలుకి వెళ్లి ఊచలు లెక్కపెట్టుకునే రోజులు మరెంతో దూరంలో లేవు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి : కోలా గురువులు (వైజాగ్ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త) విశాఖలో జరుగుతున్న భూదందాలో ప్రతి ఎమ్మెల్యే, మంత్రులతో పాటు పసుపు చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరి హస్తం ఉంది. 21వ వార్డులో పార్కు పేరుతో ఉన్న భూమిని తన బినామీకి కట్టబెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన ఘనకార్యాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సైకోలా ప్రవర్తిస్తున్న వాసుపల్లి వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదే తరహాలో ప్రతి ఒక్క టీడీపీ నేత దందాలు సాగిస్తున్నాను. త్వరలోనే వీరందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. రానున్నది జగనన్న పాలన. సిట్ తో సాక్ష్యాలకు చెల్లు చీటీ : తైనాల విజయ్‌కుమార్ (వైస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్) ప్రభుత్వాన్ని కదిలించేలా ధర్నా జరిగింది. హామీలు నెరవేర్చకుండా, ఓటుకు నోటు కేసుకోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే సాధ్యం. లక్ష ఎకరాల భూమి కబ్జా అయ్యిందంటూ స్వయానా కలెక్టర్ వెల్లడించినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటి. మళ్లీ.. కొద్ది రోజులు పోయాక అదే కలెక్టర్ 270 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురయ్యాయని చెప్పడం చూస్తుంటే.. సిట్ వేసినా ఫలితం లేదని స్పష్టమవుతోంది. గోదావరి పుష్కరాల్లో 29 మంది ఎందుకు చనిపోయారో ఇంతవరకు చెప్పలేకపోయిన సిట్.. ఈలక్షల ఎకరాల్లో దోషులుగా ఉన్న టీడీపీ నేతల గురించి ఇంకే బయటపెడుతుంది. చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు : తిప్పల నాగిరెడ్డి (గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త) భూముల్ని కాపాడుకోకపోతే.. మనం తలదాచుకుంటున్న ఇంటిని కూడా ఆక్రమించేసి రోడ్డున పడేసే ఘనులు టీడీపీలో ఉన్నారు. మూడేళ్లుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పాలన విషయంలో మాత్రం అడుగు కూడా వెయ్యిలేకపోయారు. దోచుకోవడం దాచుకోవడమే పని అయ్యింది. కోట్లాది రూపాయలు దోచుకొని ఓటుకి 5 వేలు ఇచ్చి నోరూ వాయిలేని లోకేష్‌ని సీఎంగా చెయ్యాలని చూస్తున్నారు. నేను తింటున్నాను.. మీరు కూడా తినండంటూ చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం : వంశీకృష్ణ శ్రీనివాస్ (తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల ముందు రాబందుల రాజ్యమా.. ప్రశాంత వాతావరణమా అంటూ టిడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారే భూరాంబదుల్లా మారి విశాఖను ప్రశాంతవాతావరణానికి దూరం చేసేశారు. మూడేళ్ల నుంచీ అదే పనిలో సిద్ధహస్తులుగా మారిపోయారు. చంద్రబాబు, లోకేష్ సహా.. అందరూ ఇందులో పాత్రధారులే. లోకేష్‌ని సీఎం ను చేసేందుకు విశాఖను దోచుకుతింటున్నారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్న వారంతా జైలుకు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అందరం నడుం బిగించి.. కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం. -
‘సేవ్ విశాఖ’ ధర్నాకు పోలీసుల అడ్డంకులు
విశాఖపట్నం: కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు గురువారం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ‘సేవ్ విశాఖ’ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కాగా.. సేవ్ విశాఖ మహాధర్నా సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యర్తలను పోలీసులు వేధింపులకు గురిచేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన కార్యకర్తలనూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. కార్యకర్తల వాహనాల నెంబర్లు, పేర్లు, వివరాలు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు అనుమతించారు. పలు చోట్ల కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారు. మరోవైపు టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశాఖ వాసులు మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.