
తిన్నదంతా కక్కిస్తాం
⇔ టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నిటినీ పేదలకు తిరిగి ఇచ్చేస్తాం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇔ టీడీపీ కబ్జా బారిన పడ్డ బాధితులకు అండగా ఉంటాం
⇔ ముఖ్యమంత్రి మాఫియాగా మారి దోచుకుతింటున్నారు
⇔ గంటాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత అంటూ వాటాలు పంచుకుంటున్నారు
⇔ ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: ‘‘మీకందరికీ ఒక మాట చెబుతున్నా. ఒక భరోసా ఇస్తున్నా. పేదలకు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పరాధీనం కాకుండా, వారికి నష్టం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. వీళ్ల(టీడీపీ) పాలన మరో సంవత్సరమో, ఒకటిన్నర సంవత్సరమో అంతకంటే ఎక్కువ ఉండదని గట్టిగా చెబుతున్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన. వీళ్లు తిన్నదంతా కక్కిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి అంగుళం భూమినీ మళ్లీ పేదవాడికే ఇస్తామని చెబుతు న్నాం. వైఎస్సార్‌సీపీ మీకందరికీ తోడుగా, నీడగా నిలుస్తుంది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ప్రజలకు భరోసా ఇచ్చారు. మన భూములను కాజేస్తున్న తెలుగుదేశం పార్టీ దొంగలను బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు.
విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ గురువారం జీవీఎంసీ ఎదుట గాంధీబొమ్మ వద్ద ‘సేవ్ విశాఖ’ పేరిట అఖిలపక్ష నేతలతో కలసి మహాధర్నా నిర్వహించింది. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన భూ బాధితులతో విశాఖ హోరెత్తింది. మహాధర్నాలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి మాఫియాగా తయారయ్యారని నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లాను పూర్తిగా దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
హుద్‌హుద్‌లో రికార్డులు పోయాయట!
‘‘కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇటీవలే ఓ ప్రకటన చేశారు. జిల్లాలో 43 మండలాలు ఉన్నాయి. 2,45,896 ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్ ఉన్నాయి. వాటిలో 16,375 ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్ అంటే సర్వే నంబర్లు కనిపించడం లేదట! 1,06,239 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇవీ. 375 రీసెటిల్‌మెంట్ రిజిస్టర్స్ కూడా కనిపించడం లేదట. కలెక్టర్ ఏమన్నారో తెలుసా? హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అవన్నీ పోయాయట. హుద్‌హుద్ వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ విషయం కలెక్టర్‌కు గుర్తుకురావడం ఆశ్చర్యమే స్తోంది. హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సునామీ మాదిరిగా నీళ్లేమీ రాలేదు. గాలి వచ్చింది.
గాలితోపాటు కొద్దోగొప్పో వర్షం వచ్చి వెళ్లిపోయింది. అంతేగానీ కలెక్టరేట్ వంటి పెద్దపెద్ద భవనాలు గాలికి ఎగిరిపోయినట్టు మనమెక్కడా చూడలేదు. ఆ సమయంలో నేనొచ్చి 11 రోజులపాటు ఇక్కడే ఉన్నా. ప్రతి ప్రాంతాన్నీ సందర్శించా. వీళ్లు చేసే అన్యాయమైన పని ఏమిటంటే.. రెవెన్యూ రికార్డులన్నీ మాయం చేయడం, రికార్డులను ఎలా కావాలంటే అలా మార్చేసుకోవడం. హుద్‌హుద్ వచ్చింది రికార్డులన్నీ పోయాయని చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. అక్షరాలా 1.6 లక్షల ఎకరాల పరిస్థితి ఇది. ప్రభుత్వ భూములే దాదాపు 23,876 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇంత దారుణంగా భూ కుంభకోణాలు జరుగుతుంటేæ ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. హుద్‌హుద్ వల్ల 1.6 లక్షల ఎకరాలకు చెందిన రికార్డులు పోయాయంటే ఎవరు నమ్ముతారు. ఆ సమయంలో ఈయనే జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసింది ఈయనే. ఇప్పుడు కలెక్టర్‌గా ఈయనే వచ్చారు. అధికారులు దగ్గర ఉండి మరీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కై కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌తో కుమ్మక్కై ల్యాండ్ పూలింగ్ కోసం జీవోలు ఇప్పిస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను, చివరకు వేరేవారి పేరు మీద ఉన్న భూములను సైతం కాజేస్తున్నారు.
గంటాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత
మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి భాస్కరరావు వేరేవారి భూములకు తన పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. సర్వే నంబర్ 122/11లో పేదల కాలనీలోని ఇళ్లు కూడా తమవిగా పేర్కొంటూ బ్యాంకులో తాకట్టు పెట్టారు. సర్వే నంబర్ 121/9,10,11,12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతరుల పేరు మీద ఉన్న భూములకు కూడా డాక్యుమెంట్లు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు. ఇదే విశాఖ జిల్లా అధికారులు దగ్గర ఉండి మరీ ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పనులు చేయిస్తూ ఉన్నాడంటే కేవలం ఆయన ఒక్కడికే దీంతో సంబంధం ఉందనుకోవద్దు.
గంటాకు ఇంత, నారా లోకేశ్ ఇంత అని వాటాలు పంచుకునే కార్యక్రమాలు జరుగుతు న్నాయి. గంటా శ్రీనివాసరావు సాక్షాత్తూ ఒక మంత్రి. రెవెన్యూ రికార్డులను మార్చేసి, ఇతరుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న కంపెనీలో ఆయన ఇంతకుముందు డైరెక్టర్‌గా ఉన్నారు. గంటా వ్యవహారాన్ని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. విశాఖలో భూముల దోపిడీ, భూ దందా జరుగుతోందని చెప్పారు. దీన్ని ఎందుకు అరికట్టలేక పోతున్నామో ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఈ దందా సాగదన్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చి భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణాలపై మంత్రి ఏకంగా పత్రికలకెక్కారు.
జగన్ వస్తున్నాడంటే బటన్ నొక్కేస్తారు
ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ గున్నూరు వెంకట సత్యనారాయణ(పెదబాబు) కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, ఆయన భార్య పేరిట 25 ఎకరాలు రాయిం చేసుకున్నారు. ఈ విషయం ఈనాడు పత్రికలో వచ్చింది. సాక్షిలో కాదు. జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వస్తున్నాడని తెలుసుకొని కంప్యూటర్లలో ఈ భూముల పేర్లను సరిచేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. జగన్ వస్తున్నాడంటే కంప్యూటర్‌లో ఒక బటన్ నొక్కుతారు. జగన్ రావడం లేదంటే ఇంకొక బటన్ నొక్కుతారు. ఇంత దారుణంగా ఇక్కడ భూములను స్వాహా చేసేస్తున్నారు.
రూ.1,100 కోట్ల భూములు ‘గీతం’కు ధారాదత్తం
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీని నడుపుతున్నారు. ఆయన ఎవరో కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు. రుషికొండలో ఈయన 55 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. అవి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం, ప్రభుత్వ భవనాల కోసం వివిధ శాఖలకు కేటాయించినవి. వాటిని కబ్జా చేయడమే కాదు.. ఆ భూములను తనకే ఇచ్చేయండంటూ ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వానికి లేఖ రాస్తే చంద్రబాబు ఆ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేశారు. రూ.1,000 కోట్ల విలువైన ఈ భూములను చంద్రబాబు దగ్గరుండి మరీ తన బంధువుకు ధారా దత్తం చేశారు. అలాగే పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 7.52 ఎకరాలు కేటాయించి, జీవో కూడా ఇచ్చారు. ఆ భూములను కూడా ఎంవీవీఎస్ మూర్తి కబ్జా చేశారు. వాటిని కూడా తనకే ఇవ్వాలని అడగడం, చంద్ర బాబు వెంటనే ఆమోదం తెలపడం జరిగిపోయాయి.
ఈ భూముల విలువ రూ.100 కోట్లు. ఇవి ఆక్రమ ణకు గురయ్యాయని ఇంతకు ముందు పనిచేసిన విశాఖ కలెక్టర్ రాజీవ్ స్వగృహ సంస్థకు లేఖ రాశారు. ‘ఒక అన్యాయస్తుడు మీ భూములను ఆక్రమించాడు, కాపాడుకోండి’ అని సూచించారు. అధికారులు సర్వే చేసి, పూర్తి వివరాలు ఇచ్చినా పట్టించుకోకుండా చంద్రబాబు తన సొంత బంధువులకు ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారు. ఇక వివాదంలో ఉన్న దసపల్లా భూముల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టించారు. ప్రైవేట్ భూమిని కబ్జా చేసి కట్టించారా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టించారా? చంద్రబాబే సమాధానం చెప్పాలి.
పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి..
చంద్రబాబు హయాంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదలు, అసైన్డ్ భూములున్న వాళ్లు వణికిపోతున్నారు. ఎక్కడ మా భూములు లాక్కుంటారో అని భయపడి పోతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ ఎమిటో తెలుసా? ‘రాబ్ దా పూర్ అండ్ డీల్ విత్ రిచ్’ అంటే పేదవాడిని దోచేసుకో, పెద్దవాడితో కుమ్మక్కుకా.. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం.
ఇవాళ విశాఖ జిల్లాలో పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దల కళ్లు ఎక్కడ మా భూములపై పడతాయో? ఎక్కడ కబ్జా చేస్తారో? అని భయపడుతూ జీవిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ముందెన్నడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతా ఉంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. మొట్టమొదట బహిరంగ విచారణ చేయిస్తామన్నారు. అలాగైతే వేలాది మంది వచ్చి తమకు అన్యాయం జరిగింది అని ఫిర్యాదు చేస్తారన్న భయంతో బహిరంగ విచారణ ఆపేశారు.
చంద్రబాబు ఇచ్చింది కుంభకోణాలు, అవినీతి
విశాఖ జిల్లా చంద్రబాబుకు, ఆయన పార్టీకి చాలా చేసింది. ఎంతో ఇచ్చింది. కానీ, మీరు విశాఖ జిల్లాకు ఏం చేశారని చంద్రబాబును అడుగుతున్నా. ఈ జిల్లాకు చంద్రబాబు ఏమిచ్చారో తెలుసా? కుంభకోణాలు ఇచ్చారు, అవినీతిని ఇచ్చారు. దోచుకోవడానికి విశాఖ జిల్లా ప్రజలు తనకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే విచ్చలవిడిగా దోపిడీ సాగిస్తున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ముఖ్యమంత్రి అంటే కొంత భయం ఉంటుంది. ఏమైనా అవకతవకలు జరిగి ముఖ్యమంత్రికి తెలిస్తే తాట తీస్తాడని భయపడతారు.
అన్యాయం చేస్తే జైల్లో పెట్టిస్తారని అనుకుంటారు. ఇవాళ చంద్రబాబు హయాంలో మన పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఒక మాఫియాగా తయారై దోచుకొని తింటూ ఉంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పొరుగు దేశం నుంచి ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. మన భూములను కాపాడుకునేందుకు పోరాడతాం. కానీ, మన ప్రభుత్వ పెద్దలే మన భూములను లాక్కుంటూ ఉంటే మనమేం చేయాలి? కబ్జాదారులను బంగాళాఖాతంలో కలిపేయాలి’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సీబీఐకి ఇస్తే జైలుకు పంపిస్తారని భయమా?
విశాఖ భూముల కబ్జాలపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) వేశారు. ఈ సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసే వాళ్లే. వారితో విచారణ చేయిస్తారట! ఇక్కడ జరిగిన స్కామ్‌లన్నీ చేసింది చంద్రబాబు.. ఆయన కొడుకు.. ఆయన మంత్రులు.. ఆయన రెవెన్యూ అధికారులు. అలాంటప్పుడు ఆయన కింద ఉన్న అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా? ఇదెలా ఉందంటే ‘సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం కరెక్టేనా అనేదానిపై రావణాసురుడు కుంభకర్ణుడితో విచారణ వేయించినట్టుగా ఉంది. అదే విచారణ హనుమంతుడితో చేయిస్తే దోషులను తన్ని లోపల వేస్తాడు. రావణాసురుడిని తంతాడు. రాక్షసులను తంతాడు.
అలాగే ఇక్కడ కూడా విచారణను సీబీఐకు అప్పగిస్తే చంద్రబాబును, ఆయన కొడుకును, మంత్రులను తంతారు. తన్ని లోపల వేస్తారు. సీబీఐ విచారణ చేయిస్తే అది పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుంది, అందుకే చేయించడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. సీబీఐకి అప్పగిస్తే విచారణ 20 ఏళ్లు పడుతుందనా? లేక 20 ఏళ్లు మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయమా? విశాఖ భూముల కబ్జాపై ‘సిట్’ విచారణ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి.
వీళ్లు నిజంగా మనుషులేనా?
పెందుర్తి, మదుపాకలో 955 ఎకరాల అసైన్డ్ భూములపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కన్నేశారు. మేము రూ.10 లక్షలకు కొనుగోలు చేస్తాం, అదే ప్రభుత్వమైతే లక్షా, రెండు లక్షలు కూడా ఇవ్వబోదని చెప్పి, రైతులను భయపెట్టి కొనుగోలు చేసి, చివరకు ల్యాండ్ పూలింగ్‌లో రూ.2 కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకునే కార్య క్రమం చేస్తున్నారు. బండారు కూడా ‘నాకు ఇంత.. లోకేశ్‌కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుని దోచేస్తున్న తీరు చూస్తుంటే వీళ్లు నిజంగా మనుషులేనా? అనిపిస్తోంది.
గద్దలు తన్నుకుపోతున్నాయ్
భీమిలి నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్ భూములను గంటా శ్రీనివాసరావు తన బినామీలతో కొనుగోలు చేయిస్తాడు. అసైన్డ్ భూములను ఎవరూ కొనుగోలు చేయకూడదు. అయినా ల్యాండ్ పూలింగ్ అని భయపెట్టి తన బినామీల ద్వారా గంటా కొనుగోలు చేయిస్తాడు. కొనుగోలు చేయించిన తర్వాత అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వొచ్చు, అగ్రిమెంట్ హోల్డర్లకు కూడా ఆ హక్కు ఉంటుందని చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ ద్వారా జీవోలు కూడా ఇప్పించేస్తారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల భూములను గద్దలొచ్చి తన్నుకుపోతున్నాయి. ఇవొక్కటే కాదు.. విశాఖ జిల్లాలో జరిగే అన్ని భూ దందాల్లో వాటాలు పంచుకుంటున్నారు. ‘గంటాకు ఇంత.. నారా లోకేశ్‌కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుం టున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ జిల్లాను దోచేస్తున్నారు.