saw mill
-
తాళాలేసి పని కానిస్తున్నారు...
సాక్షి, కాగజ్నగర్ : పట్టణంలోని కొంత మంది సా మిల్లు (కలప కటింగ్ కేంద్రం) యజమానులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ ప్రక్రియ పూర్తి కాకపోయినా దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. ప్రతి సంవత్సరం సా మిల్లు నిర్వాహకులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ (అధికారిక అనుమతి) పొందాలి. ఈ సంవత్సరం 2020 మార్చి 31న సా మిల్లుల కాలపరిమితి ముగిసింది. ఉన్నతాధికారులు రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసి 13 రోజులు గడుస్తున్నప్పటికీ కొంత మంది సా మిల్లు నిర్వాహకులు రెన్యూవల్ ప్రక్రియను ఇప్పటి వరకూ పూర్తి చేయించలేదు. సరికదా నిబంధనలకు నీళ్లొదిలి దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. సా మిల్లు ముందు ఉన్న ప్రధాన గేట్లకు తాళాలు వేసి, లోపల కూలీల ద్వారా పనులు చేయిస్తున్నారు. వీరు కొందరు ఫారెస్ట్ అధికారుల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గత 15 రోజుల నుంచి కొంత మంది యజమానులు సా మిల్లులను నడిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటన్నారని ఫిర్యాదులున్నాయి. సా మిల్లుల్లో పని చేసే కూలీలకు కనీసం మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వకుండా కూలీ పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్ను వివరణ కోరగా కొన్ని సా మిల్లులకు అనుమతి లభించలేదని, రెన్యూవల్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. -
సామిల్ మూసివేత
కొన్ని నెలలుగా అక్రమ నిర్వహణ ఎట్టకేలకు యంత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు జైనథ్ : మండలంలోని నిరాల గ్రామం వద్ద అంతర్రాష్ట్రీయ రహదారిపై గత కొన్ని నెలలుగా అక్రమంగా నిర్వహిస్తున్న సామిల్ను ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ శనివారం మూసి వేయించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి అమర్ సింగ్తో కలిసి ఈ మేరకు దాడి చేశారు. కాగా నిర్వాహకుల వద్ద డీఎఫ్వో ద్వారా జారీ చేయబడి సామిల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అయితే అటవీ శాఖ అధికారుల నుంచి ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా, నిబందనల విరుద్ధంగా సామిల్ను నిర్వహిస్తున్నందుకు యంత్రాలను తీసివేయించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ మాట్లాడుతూ అనుమతులు లేని కారణంగా యంత్రాలను స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరు కూడా అనుమతులు లేనిదే సామిల్స్ను నిర్వహించరాదని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన అన్నారు. దాడుల్లో బీట్ ఆఫీసర్లు రాందాస్, లక్ష్మయ్యలు ఉన్నారు.