సామిల్ మూసివేత
-
కొన్ని నెలలుగా అక్రమ నిర్వహణ
-
ఎట్టకేలకు యంత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
జైనథ్ : మండలంలోని నిరాల గ్రామం వద్ద అంతర్రాష్ట్రీయ రహదారిపై గత కొన్ని నెలలుగా అక్రమంగా నిర్వహిస్తున్న సామిల్ను ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ శనివారం మూసి వేయించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి అమర్ సింగ్తో కలిసి ఈ మేరకు దాడి చేశారు. కాగా నిర్వాహకుల వద్ద డీఎఫ్వో ద్వారా జారీ చేయబడి సామిల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు.
అయితే అటవీ శాఖ అధికారుల నుంచి ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా, నిబందనల విరుద్ధంగా సామిల్ను నిర్వహిస్తున్నందుకు యంత్రాలను తీసివేయించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ మాట్లాడుతూ అనుమతులు లేని కారణంగా యంత్రాలను స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరు కూడా అనుమతులు లేనిదే సామిల్స్ను నిర్వహించరాదని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన అన్నారు. దాడుల్లో బీట్ ఆఫీసర్లు రాందాస్, లక్ష్మయ్యలు ఉన్నారు.