Sawai Man Singh Hospital
-
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
-
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
జైపూర్ : ఆటోలో సీటు కోసం గొడవ పడి ఒక కశ్మీరీ యువకుడు తన ప్రాణం పోగొట్టుకొన్న విషాద ఘటన జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల బసిత్ జైపూర్ ప్రాంతంలో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బసిత్ ఫిబ్రవరి 5న అర్ధరాత్రి సమయంలో తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకు కోవర్కర్లతో కలిసి బయలుదేరాడు. కొద్దిసేపటికి రూంకు వచ్చిన బసిత్‌ను గాయాలతో చూసిన అతని స్నేహితులు జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బసిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందాడు. బసిత్ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ అతని స్నేహితులు జైపూర్‌లోని హర్మదా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బసిత్ మృతి వెనుక గల కారణాలను 24గంటల్లోనే చేధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 'కశ్మీర్‌కు చెందిన బసిత్ జైపూర్‌లో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఫిబ్రవరి 5వ తేదీన తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకని సిద్ధమయ్యాడు. ఇంతలో అతనితో పాటు పనిచేసే కోవర్కర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక ఆటో రావడంతో బసిత్ ఆటో ఎక్కేందుకు ప్రయత్నించగా అతన్ని నెట్టివేసి మిగతావారు కూర్చున్నారు. ఆటోను నేను ఆపితే మీరు ఎక్కడమేంటని, పైగా నాకు సీటు ఇవ్వకుండా తోసేస్తారా అని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బసిత్‌ను తీవ్రంగా కొట్టి కింద పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికి బసిత్ తన రూంకు వచ్చి తన స్నేహితులకు విషయం చెప్పి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రికి తరలించారని, కానీ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడని' స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు.ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇద్దరు నిందితుల్లో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అతని పేరు ఆదిత్య అని, స్వస్థలం ఢిల్లీ అని పోలీసులు తెలిపారు. కాగా మరొకరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. బసిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతని బంధువులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆ హాస్పటల్లో రోగి తన మతం చెప్పాల్సిందే...
జైపూర్ : సాధారణంగా ఆస్పత్రికి వచ్చిన రోగిని (ఓపీ) పేరు, వయసు, ఏం వ్యాధి అడుగుతుంటారు. కానీ ఈ హాస్పటల్ తీరే వేరు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి మతం ఏంటో పక్కాగా చెప్పాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. స్థానిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రికిలో ఎదురైన ఈ ఘటనతో రోగులు షాక్‌కు గురయ్యారు. తాజాగా ఈ ఆస్పత్రి ప్రవేశపెట్టిన మొబైల్ సేవలలో సంక్షిప్త సందేశం ద్వారా ఓపీ తీసుకోవచ్చు. కానీ ఇందులో తప్పనిసరిగా మతం నమోదు చేయాలని సూచించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదించగా కొంత మందికి వారి మతంను బట్టి రోగాలు సంక్రమిస్తాయని అందుకే ఈ విధంగా అడుగుతున్నామని తెలిపారు. వారి మతం తెలిస్తే వారికి వచ్చిన రోగాలకు సులువుగా వైద్యం చేయచ్చనే ఉద్దేశంతోనే ఇలా అడుగుతున్నామే తప్పా ఎలాంటి దురుద్ధేశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో రాజస్థాన్ ప్రభుత్వమే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!
జైపూర్: గత ఎనిమిది రోజుల్లో జైపూర్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. మూడన్నర ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన మరవకముందే మరో చిన్నారి కీచకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వికలాంగురాలైన తల్లితో పాటు మూడేళ్ల బాలిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి ప్రాంగణంలో నిద్రపోతోంది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఉదయం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ కనిపించడంతో వెంటనే అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జూన్ 11న అదే ప్రాంతంలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో మూడున్నర ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో జూన్ 15న ఆటో రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జగమంత వైద్య కుటుంబం
జైపూర్: ఒక కుటుంబంలో ఇద్దరో, ముగ్గురో డాక్టర్లుంటేనే ‘వాళ్లది డాక్టర్ల కుటుంబం’ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబంలో ఏకంగా 31 మంది డాక్టర్లుంటే? డాక్టర్ల వంశం అనాలా, డాక్టర్ల ప్రపంచం అనాలా.. మీరే తేల్చుకోండి! అలాంటి అరుదైన కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. తాజాగా అందులోని వినమృతా పత్ని అనే విద్యార్థిని(17)కి కూడా ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. రాజస్థాన్ ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఆమెకు 107వ ర్యాంకు లభించింది. ఆమె కోర్సు పూర్తి చేస్తే కుటుంబంలో వైద్యుల సంఖ్య 32కు చేరుతుంది. వినమృత చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుంది. అండర్-19 యువతుల విభాగంలో ఆమె రాష్ట్రంలో ఉత్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. రెండు తరాలుగా: వినమృత కుటుంబంలో రెండు తరాలుగా డాక్టర్లు తయారవుతున్నారు. ఆమె తాత న్యాయవాది అయినప్పటికీ తన వారసులు ప్రజాసేవ చేసే వృత్తిలో చేరాలని ఆశించాడు. ఆయన 8 మంది సంతానంలో ఏడుగురు డాక్టర్లు. వినమృత తండ్రి తరుణ్ వారిలో ఒకరు. ఆమె తల్లి వినీత కూడా వైద్యురాలే. తరుణ్ చిన్నపిల్లల వైద్యుడు కాగా వినీత స్త్రీవ్యాధుల నిపుణురాలు. వినమృత అన్నయ్య తన్మయ్ కూడా ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వినమృత చిన్నాన్నలు, పిన్మమ్మలు, మేనత్తలు, మేనమామల్లో కూడా చాలా మంది స్టెతస్కోప్ పట్టుకున్న వాళ్లే. వీరిలో ఏడుగురు ఫిజీషియన్లు, ఐదుగురు గైనకాలజిస్టులు, ముగ్గురు ఈఎన్టీ వైద్యులు తదితరులు ఉన్నారు. వీరిలో 20 మంది సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ‘వైద్య వృత్తి ఎంచుకోవాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నా తల్లిదండ్రులు పేదలకు అంకితభావంతో చికిత్స చేయడం చూశాను. బాల్యం నుంచి డాక్టర్ కావాలనుకున్నాను. అందుకే వేరే వృత్తి అన్న ఆలోచేనే రాలేదు. నా కుటుంబం నాకు గర్వకారంణం’ అని వినమృత చెప్పింది.