జగమంత వైద్య కుటుంబం
జైపూర్: ఒక కుటుంబంలో ఇద్దరో, ముగ్గురో డాక్టర్లుంటేనే ‘వాళ్లది డాక్టర్ల కుటుంబం’ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబంలో ఏకంగా 31 మంది డాక్టర్లుంటే? డాక్టర్ల వంశం అనాలా, డాక్టర్ల ప్రపంచం అనాలా.. మీరే తేల్చుకోండి! అలాంటి అరుదైన కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. తాజాగా అందులోని వినమృతా పత్ని అనే విద్యార్థిని(17)కి కూడా ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. రాజస్థాన్ ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఆమెకు 107వ ర్యాంకు లభించింది. ఆమె కోర్సు పూర్తి చేస్తే కుటుంబంలో వైద్యుల సంఖ్య 32కు చేరుతుంది. వినమృత చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుంది. అండర్-19 యువతుల విభాగంలో ఆమె రాష్ట్రంలో ఉత్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి.
రెండు తరాలుగా: వినమృత కుటుంబంలో రెండు తరాలుగా డాక్టర్లు తయారవుతున్నారు. ఆమె తాత న్యాయవాది అయినప్పటికీ తన వారసులు ప్రజాసేవ చేసే వృత్తిలో చేరాలని ఆశించాడు. ఆయన 8 మంది సంతానంలో ఏడుగురు డాక్టర్లు. వినమృత తండ్రి తరుణ్ వారిలో ఒకరు. ఆమె తల్లి వినీత కూడా వైద్యురాలే. తరుణ్ చిన్నపిల్లల వైద్యుడు కాగా వినీత స్త్రీవ్యాధుల నిపుణురాలు. వినమృత అన్నయ్య తన్మయ్ కూడా ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వినమృత చిన్నాన్నలు, పిన్మమ్మలు, మేనత్తలు, మేనమామల్లో కూడా చాలా మంది స్టెతస్కోప్ పట్టుకున్న వాళ్లే. వీరిలో ఏడుగురు ఫిజీషియన్లు, ఐదుగురు గైనకాలజిస్టులు, ముగ్గురు ఈఎన్‌టీ వైద్యులు తదితరులు ఉన్నారు. వీరిలో 20 మంది సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ‘వైద్య వృత్తి ఎంచుకోవాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నా తల్లిదండ్రులు పేదలకు అంకితభావంతో చికిత్స చేయడం చూశాను. బాల్యం నుంచి డాక్టర్ కావాలనుకున్నాను. అందుకే వేరే వృత్తి అన్న ఆలోచేనే రాలేదు. నా కుటుంబం నాకు గర్వకారంణం’ అని వినమృత చెప్పింది.