saxophone
-
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్
-
అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..!
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్ వాయించాడు. ఆయన మ్యూజిక్ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: క్రాకర్ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్ -
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్‌లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్‌కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్‌స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
స్వరానికి సాక్సోఫోన్ తోడైతే!
సాక్సోఫోన్ మ్యూజిక్ ప్రపంచంలో ఈ పరికరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అద్భతంగా పలికించిన స్వరాలెన్నింటికో సాక్సోఫోన్ మరింత అందాన్ని చేకూర్చింది. సాక్సోఫోన్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. -
బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తున్నా...
మాడ్రిడ్: ఆయనకు సంగీతమంటే ప్రాణం. అందుకే మెదడుకు ప్రాణాంతకమైన ఆపరేషన్ జరిగిన 12 గంటలపాటు నిర్విరామంగా సాక్సోఫోన్‌లో తనకిష్టమైన జాజ్ గీతాలను ఆలపిస్తూనే ఉన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న 16 మంది మెడికోలు కూడా ఓ పక్క సంగీత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే మరోపక్క 12 గంటలపాటు ఏకాగ్రత చెక్కు చెదరకుండా విజయవంతంగా ఆపరేషన్ చేశారు. స్థానిక బ్యాండ్‌లో కీలక కళాకారుడిగా రాణిస్తున్న ఆ సంగీత ప్రియుడి పేరు కార్లోస్ ఆగిలెరా. స్పెయిన్‌లోని మలాగా నగరానికి చెందిన 27 ఏళ్ల ఆగిలెరాకు బాల్యం నుంచి సంగీతమంటే పిచ్చి. బ్రెయిన్ స్కానింగ్‌లో ఆయనకు ట్యూమర్ (కణతి) ఉన్నట్టు బయట పడింది. రెండు నెలల క్రితం ఆపరేషన్ కోసం మలాగాలోని కార్లోస్ హయా ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ కారణంగా తన సంగీత సామర్ధ్యం ఏ మాత్రం దెబ్బతినకుండా చూడాలని వైద్యులను కోరారు. సంగీత సామర్థ్యానికి సంబంధించిన బ్రెయిన్ ప్రాంతం దెబ్బతింటుందా, లేదా ? అన్న విషయం డాక్టర్లకు ఎప్పటికప్పుడు తెలియడం కోసం ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు తాను సాక్సోఫోన్‌ను ప్లే చేస్తూనే ఉంటానని చెప్పారు. అలా ఆపరేషన్ చేయడానికి తాము సిద్ధమేనని, సంగీత వాయించడం, వాయించకపోవడం రోగి ఇష్టమని వారు సూచించారు. ఏది ఏమైనా ప్రాణప్రదమైన సంగీత జ్ఞానాన్ని వదులుకోవడానికి ఇష్టపడని ఆగిలెరా, ఆపరేషన్ సందర్భంగా సాక్సోఫోన్ ప్లే చేయడానికి సిద్ధపడ్డారు. అనస్థిషియా ఇస్తే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉండడంతో ఆయనకు డాక్టర్లు కాస్త మత్తునిచ్చే సెడెటివ్స్, నొప్పి తెలియకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఆయన సాక్సోఫోన్‌ను పట్టుకునేందుకు, జాజ్ గీతాల నోట్సును చూసేందుకు ఓ మెడికో సహకరించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు న్యూరోసర్జన్లు, ఇద్దరు న్యూరోసైకాలోజిస్టులు, ముగ్గురు న్యూరోఫిజిషియన్లు, ఓ అనెస్థియాటిస్ట్. ఐదుగురు నర్సులు పాల్గొన్నారు. వైద్య బృందం విజయవంతంగా కణతిని తొలగించి ఆపరేషన్ పూర్తి చేశారు. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి ఆగిలెరాకు రెండు నెలలు పట్టింది. బుధవారం నాడే మొట్టమొదటి సారిగా బయటకొచ్చిన ఆగిలెరా తన అనుభవం గురించి మీడియాకు తెలిపారు. తనకు ప్రాణం కన్నా సంగీతమే ఇష్టమని, అందుకనే రిస్క్ తీసుకున్నానని చెప్పారు. ఈ తరహా ఆపరేషన్ చేయడం మొత్తం యూరప్‌లోనే మొట్టమొదటి సారని ఆయనకు చికిత్స చేసిన ప్రముఖ న్యూరోసర్జన్ గిలెర్మో ఇబానెజ్ తెలిపారు. నాటి వైద్యానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇలాంటి తరహా ఆపరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో నిర్వహించారు. అమెరికాలోని మిన్నెసోట ఆర్కెస్ట్రాకు చెందిన ప్రముఖ వయోలనిస్ట్ రోగర్ ఫ్రిష్, బ్రెయిన్ ఆపరేషన్ సందర్భంగా వయోలిన్ వాయించి రికార్డు సృష్టించారు. ఆయనకు రికార్డు కోసం కాకుండా ఆపరేషన్ వల్ల సంగీత సామర్ధ్యాన్ని కోల్పోకూడదన్నదే లక్ష్యం.