పోనీ భారత్ అమ్మీ అంటారా?
న్యూ ఢిల్లీః భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని నిరాకరిస్తున్న మజ్లిస్-ఇ-ఇతెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీపై ప్రముఖ నటి షబానా అజ్మి సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ మాతా కీ జై అన్న నినాదాన్ని పలకడంలో అభ్యంతరం ఉంటే.... పోనీ భారత్ అమ్మీ అంటారా అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.
భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లో నడిచే షబానా.. దేశ రాజధానిలో జరిగిన ఓ సమావేశం సందర్భంలో భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని నిరాకరిస్తున్న ఒవైసీని గురించి ప్రస్తావించారు. ఒవైసీ సాహెబ్ ను నేను ఒక్కటే అడగదల్చుకున్నానని, ఒకవేళ ఆయనకు 'మాతా' అని పలకడంలో అభ్యంతరం ఉంటే 'భారత్ మాతాకీ జై' బదులుగా 'భారత్ అమ్మీకి జై' అంటారా అంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే మంగళవారం ఓ సందర్భంలో రచయిత, షబానా అజ్మీ భర్త జావేద్ అఖ్తర్... ఒవైసీ నామాన్ని ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు. హైదరాబాద్ ఎంపీ అని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ ఎంపీ భారత్ మాతాకీ జై అని పలకనంటున్నాడని, పైగా రాజ్యాంగంలో లేదంటున్నాడని... అయితే రాజ్యాంగంలో ఆయన్ను టోపీ, షార్వానీ ధరించమని కూడ లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనడం మన విధా, కాదా అన్నది ముఖ్యం కాదని అది మన హక్కు అని మరచిపోకూడదని ఆయన సూచించారు.