కొత్త శిఖరాలకు సెన్సెక్స్
ఇంధన షేర్లు ఇంధనంగా ఆర్థిక షేర్లు అండగా నిలవడంతో గురువారం స్టాక్ మార్కెట్ చెలరేగిపోయింది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో పాటు ముడిచమురు ధరలు దిగిరావడంతో వరుసగా ఐదో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,000 పాయింట్లను దాటేసింది. ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ జీవిత కాల గరిష్ట స్థాయికి చేరడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు 1–2 శాతం రేంజ్లో లాభపడటం.. స్టాక్ సూచీలు భారీ లాభాలు సాధించడానికి తోడ్పడింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల కారణంగా ఇటీవల పతన బాటలో ఉన్న ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. రూపాయి రికవరీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సానుకూల ప్రభావం చూపించాయి.
అన్ని అంశాలూ కలసిరావడంతో సెన్సెక్స్ 282 పాయింట్లు పెరిగి 36,548 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 36,700 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకింది. ఈ ఏడాది జనవరి 29 నాటి సెన్సెక్స్ ఆల్‌టైమ్‌హై 36,444 పాయింట్లు, ఆల్‌టైమ్ క్లోజింగ్ హై 36,283 పాయింట్ల రికార్డ్‌లు గురువారం బ్రేక్ అయ్యాయి. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 974 పాయింట్లు లాభపడింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే, గురువారం ఇంట్రాడేలో 11,078 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 11,023 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఆల్‌టైమ్ హై (ఇంట్రాడే) 11,172 పాయింట్లుగా, ఆల్‌టైమ్ హై(క్లోజింగ్) 11,130 పాయింట్లుగా ఉన్నాయి. ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరు కొనసాగడంతో 434 పాయింట్ల లాభంతో 36,700 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి. ఈ ఏడాది జనవరి 29నాటి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను సెన్సెక్స్ అధిగమించింది. కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ లాభాలు తగ్గాయి. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 130 పాయింట్ల వరకూ లాభపడింది.
మరిన్ని విశేషాలు...
►ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో చమురు మార్కెటింగ్ సంస్థల, విమానయాన సంస్థల షేర్లు బాగా పెరిగాయి. బీపీసీఎల్ 2.6 శాతం, హెచ్‌పీసీఎల్ 1.5 శాతం, ఐఓసీ 1.1 శాతం చొప్పున లాభపడగా, ఇండిగో 4.7 శాతం, జెట్ ఎయిర్వేస్ 1.8 శాతం చొప్పున పెరిగాయి.
►స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ, పలు షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. టాటా పవర్, వేదాంత, యూపీఎల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంచురీ ప్లే బోర్డ్స్ (ఇండియా), ఎన్బీసీసీ (ఇండియా), రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు కూడా జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంక్, కోటక్ మహాంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్సూమర్, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్ఈజీ, జుబిలంట్ ఫుడ్ వర్క్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మారికో, ఎంఫసిస్, ట్రెంట్, బెర్జర్ పెయింట్స్ షేర్లు ఆల్ టైమ్ హైలను తాకాయి.
68.57కు రూపాయి రికవరీ
ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా కోలుకుంది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో 20 పైసలు బలపడి 68.57కు చేరుకుంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పట్ల సెంటిమెంట్ మెరుగుపడింది. వారం వ్యవధిలో రూపాయికి ఇది గరిష్ట స్థాయి. నాలుగు చమురు ఎగుమతి టర్మినళ్లను తిరిగి తెరుస్తున్నట్టు లిబియా చేసిన ప్రకటన చమురు ధరల పతనానికి దారితీసింది. దీంతో డాలర్ అంతర్జాతీయంగా బలంగా ఉన్నప్పటికీ, రూపాయి రికవరీకి తోడ్పడింది. ఇంట్రాడేలో 68.50 వరకు కోలుకోగా, చివరికి 68.57 వద్ద స్థిరపడింది.
రికార్డ్ లాభాలకు కారణాలివి...
►అంచనాలను మించుతున్న ఫలితాలు..
కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు బాగున్నాయి.
►హెవీ వెయిట్స్ ర్యాలీ... సూచీల్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 1– 2 శాతం మేర లాభపడటం సెన్సెక్స్ భారీ లాభాలకు కారణమైంది. ఒక్క రిలయన్స్ వల్లే సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడిందని అంచనా.
►దిగివచ్చిన చమురు ధరలు...
లిబియా మళ్లీ చమురు ఎగుమతులు ఆరంభించనున్నదని, ఇరాన్‌పై ఆంక్షల విషయంలో అమెరికా పునరాలోచిస్తోందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగివచ్చాయి. బ్యారెల్ బ్రెంట్ ధర బుధవారం ఒక్క రోజులోనే 7 శాతం వరకూ పతనమైంది.
►ప్రపంచమార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ...
వాణిజ్య యుద్ధభయాలు నెలకొన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అమెరికా–చైనాల మధ్య సుంకాల పోరు విషయమై తాజాగా చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు ర్యాలీ జరిపాయి.
►భారత్..ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థ...
గత ఏడాది ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫ్రాన్స్‌ను తోసిరాజని భారత్ అవతరించిందన్న ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ఇన్వెస్టర్లలో జోష్ని నింపింది.
► రూపాయి రికవరీ...
గత వారంలో జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైన రూపాయి ఈ వారంలో రికవరీ కావడం స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది.
►దేశీయ కొనుగోళ్ల జోరు...
ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.5,470 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకోగా, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం రూ.64,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నా, దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు కొనసాగిస్తుండటం కలసివస్తోందని నిపుణులంటున్నారు.
►గణాంకాలపై ఆశావహ అంచనాలు...
మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే మే నెల పారిశ్రామికోత్పత్తి, జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే ఇవి కొంత నిరాశ మిగిల్చాయి.
రిలయన్స్@ వంద బిలియన్ డాలర్ల కంపెనీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ మరోసారి వంద బిలియన్ డాలర్ల మార్క్‌కు చేరింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 1,099ను చేరిన ఈ షేర్ చివరకు 4.42 శాతం లాభంతో రూ.1,083 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అధికంగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభ లాభాల కారణంగా ఈ షేర్ మార్కెట్ క్యాప్ వంద బిలియన్ డాలర్లను దాటేసింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మైలురాయిని ఈ కంపెనీ మళ్లీ సాధించింది. ట్రేడింగ్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,85,737 కోట్లుగా ఉంది. (డాలర్‌తో రూపాయి మారకం 68.57 ప్రకారం)మార్కెట్ క్యాప్‌పరంగా టీసీఎస్ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. ఈ ఏడాది ఈ షేర్ 18 శాతం ఎగసింది. 2007, అక్టోబర్ 18 నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి వంద కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. అప్పుడు రూపాయితో డాలర్ మారకం 39.59గా ఉంది. ఇటీవలి కంపెనీ 41వ ఏజీఎమ్ నుంచి షేర్ ధర మరింత పెరుగుతూ వస్తోంది. జూలై 5 నుంచి వరుస ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 12 శాతం లాభపడింది.