SCCL jobs
-
జూనియర్ అసిస్టెంట్ నియామకాల్లో సింగరేణికి ‘పరీక్ష’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉద్యోగ నియామకాల విషయంలో తరచుగా విమర్శల పాలయ్యే సింగరేణికి మరో విషమ ‘పరీక్ష’ఎదురైంది. ఇటీవల సంస్థ.. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ తేదీ విషయమై డోలాయమానంలో పడినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సింగరేణి సంస్థ 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 (క్లరికల్) పోస్టుల భర్తీకి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ముగిసే సరికి రికార్డు స్థాయిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్లోనే సెప్టెంబర్ 4న రాత పరీక్ష నిర్వహిస్తామని సింగరేణి ప్రకటించినా, తేదీ సమీపిస్తున్నప్పటికీ సంస్థ తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. థర్డ్ పార్టీకి బాధ్యతలు నియామకాల్లో పారదర్శకత పాటించేందుకు సింగరేణి సంస్థ థర్డ్‌పార్టీకి పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోంది. అందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షల బాధ్యతను జేఎన్టీయూకి అప్పగించాలని నిర్ణయించింది. హాల్‌టికెట్ల జారీ మొదలు, జవాబుపత్రాల మూల్యాంకనం, మెరిట్ జాబితా రూపకల్పన అంశాలన్నీ థర్డ్ పార్టీగా జేఎన్టీయూనే నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందస్తు అంచనాల ప్రకారం పరీక్షల నిర్వహణకు రూ.కోటి వరకు చెల్లించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే, జేఎన్టీయూ రూ.3 కోట్లు చెల్లించాలని అంటోంది. దీంతో ఫీజు విషయమై ఎటూ తేల్చుకోలేక సింగరేణి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆరోపణలు సింగరేణి ఆధ్వర్యంలో 2015లో చేపట్టిన నియామకాలు సంస్థకు చెడ్డపేరు తెచ్చాయి. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, కొందరు ఉద్యోగార్థులు ముందుగానే ప్రశ్నపత్రాలు సంపాదించి హోటల్ గదుల్లో సిద్ధమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సింగరేణి సంస్థ కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూకే అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఏ పరీక్ష జరిగినా బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించొద్దంటూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడం ఆనవాయితీగా మారింది. రంగంలోకి దళారులు తాజాగా సింగరేణి నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం.. దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారులకు ఫోన్లుచేసి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో బేరం మాట్లాడటం మొదలెట్టారు. ఇది బయటపడటంతో సింగరేణి సంస్థ అంతర్గతంగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను నియమించి విచారణ చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే అభ్యర్థుల ఫోన్ నంబర్లు బయటకు రావడం, దళారుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలియడంతో సింగరేణి అ«ధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణ ఫీజు విషయంలో సింగరేణి, జేఎన్టీయూ మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంపై సింగరేణి సంస్థ దృష్టి సారించినట్టు సమాచారం. ఇదీ చదవండి: SCCL Recruitment 2022 Notification: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ -
పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి
♦ వివాహాలపై వారసత్వ ఉద్యోగాల రద్దు ప్రభావం ♦ కట్నకానుకల కోసం పెరగనున్న డిమాండ్ ♦ కుటుంబాల్లో కలహాలు సృష్టిస్తున్న వైనం గోదావరిఖని : ‘గోదావరిఖనిలోని ఓ గనిలో పనిచేసే కార్మికుడి స్వస్థలం బెల్లంపల్లి. సింగరేణిలో తానుచేసే వృత్తికి ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో పనిచేయడం సాధ్యం కావడంలేదు. ఈలోపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించింది. కొడుకు, అల్లుడు లేక సోదరుడికి అవకాశం కల్పించింది. దీంతో పెళ్లీడుకొచ్చిన కూతురుకు అల్లుడిని చూసి ఆయనకు వారసత్వ ఉద్యోగం పెట్టించాలని అనుకున్నాడు. గోదావరిఖనిలోని ఓ కాలనీకి చెందిన అబ్బాయిని చూసి ఉద్యోగమిచ్చే ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 15న బెల్లంపల్లిలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అయితే 16వ తేదీన గోదావరిఖనిలో అబ్బాయి వారింటి వద్ద రిసెప్షన్ ఉండగా....అదే రోజు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అబ్బాయి తరుఫువారు కట్న కానుకలు ఎక్కడ అడిగి అల్లరి చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయి బంధువులు ఈ రిసెప్షన్‌కు ఎక్కువమంది హాజరుకాలేదు. అయితే ఉద్యోగానికి బదులు కట్నకానుకలు ఇవ్వాలని మాత్రం అమ్మాయి తరఫు కుటుంబసభ్యులకు పెళ్లికొడుకు కుటుంబసభ్యులు హుకూం జారీచేశారు. పెళ్లి కూతురు తరఫువారు దానికి అంగీకరించకపోతే ...రెండు కుటుంబాల్లో అలజడి చెలరేగడం మాత్రం ఖాయం.’.. ఇలా సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారనే నేపథ్యంలో ఇటీవల కాలంలోనే పలు జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. వివాహ సమయంలో ఇచ్చే కట్నకానుకలకు బదులు ఉద్యోగం పెట్టించడానికి అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించడంతో అబ్బాయి తరుపువారు ఒప్పుకున్నారు. అయితే నేడు ఆ ఉద్యోగాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా కుటుంబాలు నిరాశనిస్పృహలకు లోనవుతుండగా...ఉద్యోగం పెట్టించనందున అమ్మాయి తరుఫువారు ఏమిస్తారని అబ్బాయివారి నుంచి బేరసారాలు మొదలయ్యాయి. దీంతో చేసేదేమీలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగంపై ఆశతో... అన్ని వదులుకుని... సింగరేణిలో ఉద్యోగావకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నత విద్యను చదివి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రైవేటుగా ఉద్యోగాలు చేస్తున్న చాలామంది యువకులు కోల్‌బెల్ట్ ప్రాంతాలపై దృష్టిసారించారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇదే అనువైన సమయంగా భావించుకుని ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునే వారు పెళ్లిచూపులకు వచ్చి ఒప్పుకున్నారు. వారసత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందే పెళ్లి జరిగిపోవాలని, ఆ పెళ్లి ఫొటోలు, వీడియో దరఖాస్తుతో జత చేయాలని ఆదేశాలుండడంతో ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ముగిసిన తర్వాత దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారసత్వఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు వార్త వెలువడడంతో కొత్త అల్లుళ్లకు ఏమిచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. కట్నకానుకల కోసం డిమాండ్ పెళ్లి సమయంలో కట్నకానుకలకు బదులు సింగరేణిలో ఉద్యోగం ఇస్తున్నందున చాలామంది అల్లుళ్లు అంగీకారం తెలిపారు. నేడు పరిస్థితి మారడంతో ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందున దాని స్థానంలో కట్నకానుకలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు రాజీకి వస్తే ఆ జంటల కాపురాలు సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే రోజు యుద్ధమే జరుగుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కట్నకానుకలు ఇవ్వలేని కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి కూతుళ్లకు అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగే అవకాశాలుంటాయి. మొత్తమ్మీద వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్లి జంటలపై ప్రభావం చూపుతుండగా...వారి కుటుంబాల్లో మాత్రం మానసిక క్షోభకు దారితీస్తున్నదని చెప్పక తప్పదు.