పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి | hicourt order on Hereditary jobs in Singareni leads shake waves | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి

Published Sun, Mar 19 2017 11:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి - Sakshi

పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి

వివాహాలపై వారసత్వ ఉద్యోగాల రద్దు ప్రభావం
కట్నకానుకల కోసం పెరగనున్న డిమాండ్‌
కుటుంబాల్లో కలహాలు సృష్టిస్తున్న వైనం


గోదావరిఖని :
‘గోదావరిఖనిలోని ఓ గనిలో పనిచేసే కార్మికుడి స్వస్థలం బెల్లంపల్లి. సింగరేణిలో తానుచేసే వృత్తికి ఇంకా రెండేళ్ల సర్వీస్‌ ఉంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో పనిచేయడం సాధ్యం కావడంలేదు. ఈలోపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించింది. కొడుకు, అల్లుడు లేక సోదరుడికి అవకాశం కల్పించింది. దీంతో పెళ్లీడుకొచ్చిన కూతురుకు అల్లుడిని చూసి ఆయనకు వారసత్వ ఉద్యోగం పెట్టించాలని అనుకున్నాడు. గోదావరిఖనిలోని ఓ కాలనీకి చెందిన అబ్బాయిని చూసి ఉద్యోగమిచ్చే ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 15న బెల్లంపల్లిలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అయితే 16వ తేదీన గోదావరిఖనిలో అబ్బాయి వారింటి వద్ద రిసెప్షన్‌ ఉండగా....అదే రోజు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అబ్బాయి తరుఫువారు కట్న కానుకలు ఎక్కడ అడిగి అల్లరి చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయి బంధువులు ఈ రిసెప్షన్‌కు ఎక్కువమంది హాజరుకాలేదు. అయితే ఉద్యోగానికి బదులు కట్నకానుకలు ఇవ్వాలని మాత్రం అమ్మాయి తరఫు కుటుంబసభ్యులకు పెళ్లికొడుకు కుటుంబసభ్యులు హుకూం జారీచేశారు. పెళ్లి కూతురు తరఫువారు దానికి అంగీకరించకపోతే ...రెండు కుటుంబాల్లో అలజడి చెలరేగడం మాత్రం ఖాయం.’.. ఇలా సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాలలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారనే నేపథ్యంలో ఇటీవల కాలంలోనే పలు జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు.

వివాహ సమయంలో ఇచ్చే కట్నకానుకలకు బదులు ఉద్యోగం పెట్టించడానికి అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించడంతో అబ్బాయి తరుపువారు ఒప్పుకున్నారు. అయితే నేడు ఆ ఉద్యోగాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా కుటుంబాలు నిరాశనిస్పృహలకు లోనవుతుండగా...ఉద్యోగం పెట్టించనందున అమ్మాయి తరుఫువారు ఏమిస్తారని అబ్బాయివారి నుంచి బేరసారాలు మొదలయ్యాయి. దీంతో చేసేదేమీలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి.

ఉద్యోగంపై ఆశతో... అన్ని వదులుకుని...
సింగరేణిలో ఉద్యోగావకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నత విద్యను చదివి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రైవేటుగా ఉద్యోగాలు చేస్తున్న చాలామంది యువకులు కోల్‌బెల్ట్‌ ప్రాంతాలపై దృష్టిసారించారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇదే అనువైన సమయంగా భావించుకుని ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునే వారు పెళ్లిచూపులకు వచ్చి ఒప్పుకున్నారు. వారసత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందే పెళ్లి జరిగిపోవాలని, ఆ పెళ్లి ఫొటోలు, వీడియో దరఖాస్తుతో జత చేయాలని ఆదేశాలుండడంతో ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ముగిసిన తర్వాత దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారసత్వఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు  వార్త వెలువడడంతో కొత్త అల్లుళ్లకు ఏమిచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది.

కట్నకానుకల కోసం డిమాండ్‌
పెళ్లి సమయంలో కట్నకానుకలకు బదులు సింగరేణిలో ఉద్యోగం ఇస్తున్నందున చాలామంది అల్లుళ్లు అంగీకారం తెలిపారు. నేడు పరిస్థితి మారడంతో ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందున దాని స్థానంలో కట్నకానుకలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు రాజీకి వస్తే ఆ జంటల కాపురాలు సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే రోజు యుద్ధమే జరుగుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కట్నకానుకలు ఇవ్వలేని కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి కూతుళ్లకు అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగే అవకాశాలుంటాయి. మొత్తమ్మీద వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్లి జంటలపై ప్రభావం చూపుతుండగా...వారి కుటుంబాల్లో మాత్రం మానసిక క్షోభకు దారితీస్తున్నదని చెప్పక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement