Heritage Jobs
-
కేసీఆర్‌తోనే ‘వారసత్వం’ సాధ్యం
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గోదావరిఖని : సింగరేణిలో కొత్త ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతాయని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. జీడీకే–5వ గని, 11వ గనిపై మంగళవారం ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లలో మాట్లాడారు. సింగరేణి సంస్థ 60 ఏళ్లుగా దోపిడీకి గురవుతోందని, సీమాంధ్రుల బారి నుంచి సింగరేణి సంస్థను కాపాడేందుకు కేసీఆర్ చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఇన్‌కంట్యాక్స్ రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనసభలో ఇన్‌కంట్యాక్స్ రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ పీఎంఈ మస్టర్, యూనిఫాం, తండ్రి, మామ చనిపోతే ఉద్యోగాలు ఇప్పించామని, రెండో బిడ్డకు ప్రసవం, గనిలో చనిపోతే మ్యాచింగ్గ్రాంట్ రూ.20 లక్షలు అమలు చేయించామన్నారు. మేనిఫెస్టోలో 72 హామీలు పొందుపరిచామని, అందులో 60 హామీలు సాధించామని తెలిపారు. ట్రాన్స్ఫర్ క్వార్టర్స్ పారదర్శకంగా జరిగాయని, క్యాంటీన్లలో సౌకర్యాలు, కార్మికులకు టోపీ, లైట్లు, బూట్లు, అనేక హామీలు నెరవేర్చామన్నారు. జాతీయ సంఘాల మాటలు నమ్మకుండా టీబీజీకేఎస్‌ను ఆదరించి గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లో చేరిన శంకరయ్య, తేజ, తాయార్, టి.సురేష్, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, రాజ్‌కుమార్, వీరేశంతోపాటు 30 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఫిట్ సెక్రటరీ మోదుల సంపత్ ఆధ్వర్యంలో ఆర్జీ–1 ఉపాధ్యక్షుడు ఆరెళ్లి పోచం అధ్యక్షతన జరిగిన గేట్‌మీటింగ్‌లో కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, మాదాసు రామ్మూర్తి, గండ్ర దామోదర్‌రావు, వడ్డేపెల్లి శంకర్, మలికార్జున్, పెంచాల తిరుపతి, పుట్ట రమేశ్, రావుల అనిల్, గద్ద కుమారస్వామి, దాసరి శంకర్, మండ రమేశ్, నాయిని శంకర్, దుర్గం తిరుపతి, కెనాడి, చంద్రమౌళి, ఉప్పలయ్య, ఈదునూరి రామస్వామి, మల్లారెడ్డి, కుమార్, రమేశ్, చెల్పూరి సతీశ్, చెలుకలపెల్లి శ్రీనివాస్, రామస్వామి, పిల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వారసత్వం కేసీఆర్ దృఢ సంకల్పం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. వకీల్‌పల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్ని కోల్‌బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులతో హుటాహుటిన సమావేశమై చర్చించారన్నారు. సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్‌కు కూడా ప్రత్యేక ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈమేరకు గత స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో సీఅండ్ఎండీ ఈప్రస్తావన తీసుకవచ్చారన్నారు. జాతీయ సంఘాల నాయకులు జేబీసీసీఐ ఒప్పందాలపై సంతకాలు చేయకుండా మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు. సింగరేణిలో ఎన్నికలు ఉన్నాయనే కారణం చూపి సంతకాలు చేయకుండా ఆపుతున్నారని, ఎన్నికల తర్వాత సంతకాలను చేసి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తునారన్నారు. దీన్ని కార్మిక వర్గం గమనించి రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటువేసి టీబీజీకేఎస్‌కు గెలిపించాలని కోరారు. గేట్‌మీటింగ్‌లో ఐలి శ్రీనివాస్, బదావత్ శంకర్‌నాయక్, కొంగర రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాల్లో కుట్ర
సింగరేణి కార్మికులకు సర్కారు మోసం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికు లను కూడా మోసగించారని, సింగరేణి వార సత్వ ఉద్యోగాల విషయంలో ఆయన చేసిన మోసం అందరికీ అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫి కేషన్ రానున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీ భవన్లో టీపీసీసీ సింగరేణి సబ్‌కమిటీ సమా వేశం జరిగింది. సబ్‌కమిటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ కుట్ర చేసిందని విమర్శించారు. గుర్తింపు ఎన్నికలు వస్తున్న సమయంలో వారసత్వ ఉద్యోగాల జీవో ఇచ్చారని, అయితే దానిపై తెలంగాణ జాగృతి వాళ్లతోనే కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని మోసం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై 55 వేల మంది కార్మికులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించడం ద్వారా కేసీఆర్ కు బుద్ధిచెప్పాలన్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి, మరో నేత జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సింగరేణిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర చేపడతామన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు. -
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్
-
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్
కరీంనగర్/మంచిర్యాల: వారసత్వ ఉద్యోగ అవకాశాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె వల్ల భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనులపై ప్రభావం పడనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. సమ్మెను జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ తలపెట్టగా విప్లవ కార్మిక సంఘాలు, కులసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. బలవంతంగా పనిచేయించేందుకు యాజమాన్యం యత్నిస్తోంది. బొగ్గు గనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సింగరేణిలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ సమ్మెను వ్యతిరేకిస్తోంది. మరోవైపు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు 9 డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ కార్మికులు విధులకు హాజరుకాలేదు. సింగరేణి వ్యాప్తంగా 57,302మంది కార్మికులుండగా ఇందులో కొందరు అనుకూలంగా, మరికొందరు సమ్మెకు వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం సింగరేణిలో 30 భూగర్భ గనులు, 16 ఉపరితల గనులున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో 4 ఓపెన్ కాస్టులు, 13 భూగర్బ బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. రాత్రి షిప్టు డ్యూటికి హాజరైన కార్మికులతో యాజమాన్యం బలవంతంగా పని చేయించేందుకు యత్నిస్తోంది. అధికారుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గోదావరిఖని వన్ ఇన్ క్లైన్ బొగ్గు వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేస్తున్నారు. సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) దూరంగా ఉన్నప్పటికీ కార్మికులు విధులకు హాజరుకాలేదు. -
సమ్మెతో ‘వారసత్వం’ సాధించలేరు
టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు శ్రీరాంపూర్: జాతీయం సంఘాలు సమ్మె చేయడం వల్ల వారసత్వ ఉద్యోగాలు సాధించలేవని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆర్కే–5బీ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సమ్మె ద్వారా నే ఉద్యోగాలు వస్తాయంటే 18 ఏళ్ల నుంచి ఎందుకు చేయలేదని జాతీయ సంఘాలను ప్రశ్నించారు. సమ్మె పేరుతో కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. వారసత్వంపై హైకోర్టులో ఇంప్లీడ్ అయిన ఈ సంఘాలు వారి న్యాయవాదులతో వాదనలు ఎందుకు వినిపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా ఉండి సమ్మె చేస్తామని చెప్తూనే ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌లు గనులపై ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సంఘాలు కార్మికుల ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వారసత్వ ఉద్యోగాలను ఎలా ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని వివరించా రు. కార్మికుల చిరకాల వాంఛ సొంతింటి పథకం కూడా అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు బంటు సారయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, జి.మహిపాల్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, సీహెచ్ అశోక్, వీరభద్ర య్య, రాఘవరెడ్డి, నాయకులు అద్దు శ్రీనివాస్, గంగయ్య, నెల్కి మల్లేశ్, నీలం సదయ్య, లక్ష్మ ణ్, మిట్ట సుధాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు -
పెళ్లింట్లో ‘వారసత్వ’ లొల్లి
♦ వివాహాలపై వారసత్వ ఉద్యోగాల రద్దు ప్రభావం ♦ కట్నకానుకల కోసం పెరగనున్న డిమాండ్ ♦ కుటుంబాల్లో కలహాలు సృష్టిస్తున్న వైనం గోదావరిఖని : ‘గోదావరిఖనిలోని ఓ గనిలో పనిచేసే కార్మికుడి స్వస్థలం బెల్లంపల్లి. సింగరేణిలో తానుచేసే వృత్తికి ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో పనిచేయడం సాధ్యం కావడంలేదు. ఈలోపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించింది. కొడుకు, అల్లుడు లేక సోదరుడికి అవకాశం కల్పించింది. దీంతో పెళ్లీడుకొచ్చిన కూతురుకు అల్లుడిని చూసి ఆయనకు వారసత్వ ఉద్యోగం పెట్టించాలని అనుకున్నాడు. గోదావరిఖనిలోని ఓ కాలనీకి చెందిన అబ్బాయిని చూసి ఉద్యోగమిచ్చే ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 15న బెల్లంపల్లిలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అయితే 16వ తేదీన గోదావరిఖనిలో అబ్బాయి వారింటి వద్ద రిసెప్షన్ ఉండగా....అదే రోజు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అబ్బాయి తరుఫువారు కట్న కానుకలు ఎక్కడ అడిగి అల్లరి చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయి బంధువులు ఈ రిసెప్షన్‌కు ఎక్కువమంది హాజరుకాలేదు. అయితే ఉద్యోగానికి బదులు కట్నకానుకలు ఇవ్వాలని మాత్రం అమ్మాయి తరఫు కుటుంబసభ్యులకు పెళ్లికొడుకు కుటుంబసభ్యులు హుకూం జారీచేశారు. పెళ్లి కూతురు తరఫువారు దానికి అంగీకరించకపోతే ...రెండు కుటుంబాల్లో అలజడి చెలరేగడం మాత్రం ఖాయం.’.. ఇలా సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారనే నేపథ్యంలో ఇటీవల కాలంలోనే పలు జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. వివాహ సమయంలో ఇచ్చే కట్నకానుకలకు బదులు ఉద్యోగం పెట్టించడానికి అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించడంతో అబ్బాయి తరుపువారు ఒప్పుకున్నారు. అయితే నేడు ఆ ఉద్యోగాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా కుటుంబాలు నిరాశనిస్పృహలకు లోనవుతుండగా...ఉద్యోగం పెట్టించనందున అమ్మాయి తరుఫువారు ఏమిస్తారని అబ్బాయివారి నుంచి బేరసారాలు మొదలయ్యాయి. దీంతో చేసేదేమీలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగంపై ఆశతో... అన్ని వదులుకుని... సింగరేణిలో ఉద్యోగావకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నత విద్యను చదివి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ప్రైవేటుగా ఉద్యోగాలు చేస్తున్న చాలామంది యువకులు కోల్‌బెల్ట్ ప్రాంతాలపై దృష్టిసారించారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇదే అనువైన సమయంగా భావించుకుని ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునే వారు పెళ్లిచూపులకు వచ్చి ఒప్పుకున్నారు. వారసత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందే పెళ్లి జరిగిపోవాలని, ఆ పెళ్లి ఫొటోలు, వీడియో దరఖాస్తుతో జత చేయాలని ఆదేశాలుండడంతో ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ముగిసిన తర్వాత దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారసత్వఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు వార్త వెలువడడంతో కొత్త అల్లుళ్లకు ఏమిచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. కట్నకానుకల కోసం డిమాండ్ పెళ్లి సమయంలో కట్నకానుకలకు బదులు సింగరేణిలో ఉద్యోగం ఇస్తున్నందున చాలామంది అల్లుళ్లు అంగీకారం తెలిపారు. నేడు పరిస్థితి మారడంతో ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందున దాని స్థానంలో కట్నకానుకలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు రాజీకి వస్తే ఆ జంటల కాపురాలు సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే రోజు యుద్ధమే జరుగుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కట్నకానుకలు ఇవ్వలేని కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి కూతుళ్లకు అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగే అవకాశాలుంటాయి. మొత్తమ్మీద వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్లి జంటలపై ప్రభావం చూపుతుండగా...వారి కుటుంబాల్లో మాత్రం మానసిక క్షోభకు దారితీస్తున్నదని చెప్పక తప్పదు. -
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా
హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిందో తెలపాలని కోరింది. వారు చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. -
20 ఓపెన్ కాస్ట్‌లు.. 11 భూగర్భ గనులు
సింగరేణిలో కొత్త గనులపై ముఖ్యమంత్రి ప్రకటన శాసనసభలో గురువారం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే సర్వే పూర్తయిన గనులతోపాటు కొత్త ప్రతిపాదనలు తెరపైకి.. ఈ ఏడాది కొన్ని ఓపెన్ కాస్ట్లకు మోక్షం ఐదేళ్లలో మిగతా గనులు వారసత్వ ఉద్యోగాలతోపాటు కొత్త తరానికి పెరగనున్న అవకాశాలు మంచిర్యాల : సిరుల వెలుగుల సింగరేణి రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులతో కొత్త పుంతలు తొక్కబోతోంది. దశాబ్దాలుగా కార్మికులు కోరుతున్న కొత్త గనుల కల సాకారం కాబోతోంది. బొగ్గు ఉత్పత్తితో ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు కల్పతరువుగా నిలిచిన ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో తన పరిధిని మరింత విస్తృతం చేయనుంది. సింగరేణి పరిధిలోని ఐదు జిల్లాల్లో కొత్తగా 31 గనులు ప్రారంభించనున్నట్లు గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించడమే అందుకు నిదర్శనం. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టుల్లో 20 ఓపెన్ కాస్ట్‌లు కాగా, 11 భూగర్భ గనులు. ఈ గనులతో కొత్తగా 11,621 ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, బొగ్గు గనులపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందనడంలో సందేహం లేదు. అన్నీ సకాలంలో జరిగితే ఇప్పటికే సర్వే పూర్తయిన కొన్ని కొత్త ఓపెన్‌కాస్ట్‌ల పనులు ఈ సంవత్సరంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐదేళ్ల కాలపరిమితిలో అన్ని ప్రాజెక్టులు ప్రారంభించడం సింగరేణికి కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే సిద్ధంగా ప్రాజెక్టుల ప్రణాళికలు దాదాపు 128 ఏళ్ల క్రితం భూగర్భ బొగ్గు తవ్వకాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని ప్రభుత్వ రంగంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా సింగరేణి నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన బొగ్గు తవ్వకాలను దేశ, విదేశాలకు విస్తరించాలని సింగరేణి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాకులో పని ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా తదితర దేశాల్లో బొగ్గు ఉత్పత్తి అంశాలను పరిశీలిస్తే, 13 అంతర్జాతీయ కంపెనీలు సింగరేణితో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు క్షీణించిన నేపథ్యంలో కొంతకాలం వేచి చూసే ధోరణితో యాజమాన్యం ఉంది. అయితే.. దేశంలో మాత్రం బొగ్గు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త బ్లాక్‌లను తెరిచేందుకు ప్రణాళికలను రూపొందించింది. 27 కొత్త గనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కాగా, 17 గనులను తొలిదశలో సిద్ధం చేయాలని యాజమాన్యం భావించింది. అందులో భాగంగా బెల్లంపల్లి, కొత్తగూడెం, గోదావరిఖని, భూపాలపల్లి రీజియన్లలో 10 ఓపెన్‌కాస్ట్ గనులు, 7 భూగర్భ గనులను తవ్వే కార్యక్రమానికి దాదాపుగా ఆమోదం లభించింది. కాగా.. కొత్త గనులు, ఓపెన్కాస్ట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో సింగరేణి యాజమాన్యం మరిన్ని కొత్త ప్రాజెక్టులను రూపకల్పన జరిగినట్లు సీఎం ప్రకటనను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో 20 ఓపెన్‌కాస్ట్‌లు, 11 భూగర్భ బొగ్గు గనులు తవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సింగరేణిలో ప్రస్తుతం 30 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ గనులు ఉండగా, మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఓసీతో లాభాలు.. యూజీతో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసనసభలో చెప్పిన లెక్కల ప్రకారం భూగర్భ గనుల్లో ఉత్పతిŠ?త్తకి అయ్యే ఖర్చు టన్నుకు రూ.4,118, అమ్మకం ధర రూ.2,360. అదే ఓపెన్‌కాస్ట్ గనుల విషయానికి వస్తే బొగ్గు ఉత్పత్తి వ్యయం కేవలం రూ.1204 కాగా, అమ్మకం ధర రూ. 2,008. భూగర్భ గనుల ద్వారా ఒక్కో టన్నుకు రూ.1758 నష్టం వస్తుంటే , ఓపెన్ కాస్ట్‌ల వల్ల రూ.804 లాభంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్‌ల వైపే సింగరేణి మొగ్గు చూపినప్పటికీ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని నష్టమున్నా కొత్తగా భూగర్భ గనులు తవ్వేందుకు సర్కారు ముందుకు రావడం గమనార్హం. కొత్తగా రాబోయే గనుల్లో ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం ఉండగా, లక్ష్యాలను పెంచితే నష్టాలు తగ్గుతాయని సర్కార్ ఆలోచన. కాగా కొత్త గనుల వల్ల సింగరేణి యువరక్తంతో ఉరకలేస్తుందని సర్కార్ భావిస్తోంది. పెరిగిన బొగ్గు విక్రయాలు విదేశీ బొగ్గుతో పాటు కోల్ ఇండియా సరఫరా చేసే బొగ్గు సింగరేణి కన్నా తక్కువకు లభిస్తుండడంతో గతంలో ఆంధ్రప్రదేశ్ మినహా తమిళనాడు, కర్ణాటకలకు చెందిన ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం బొగ్గు కొనలేదు. అయితే సింగరేణి యాజమాన్యం చేసిన కృషి ఫలితంగా ఈ రెండు రాష్ట్రాలు సింగరేణి నుంచే ప్రస్తుతం బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. అలాగే స్పాంజ్ ఐరన్, సిమెంట్, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు సైతం సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుండడంతో కొత్త గనులు ఏర్పాటు చేసినా డిమాండ్ తగ్గదని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సర్వేలు పూర్తయిన మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాజెక్టుల పనులు ఈ సంవత్సరమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టీయూసీ ఆర్జీ-1 ఉపాధ్యక్షులు నాయిని మల్లేశ్ డిమాండ్ చేశారు. జీడీకే-2వ గని కార్మికులను శుక్రవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, సకలజనుల సమ్మె వేతనాలు, సొంత ఇంటి కల తదితర డిమాండ్లపై ఈనెల 7న ఐదు జాతీయ సంఘాలు సమావేశమయ్యాయని తెలిపారు. మరొకసారి ఈనెల 13న కలిసివచ్చే సంఘాలతో సమావేశమై సమస్యలపై యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు 15వ తేదీన సింగరేణి సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రానికి వస్తున్న బొగ్గుశాఖ మంత్రిని కలిసి పదో వేజ్బోర్డుపై, ఇతర విషయాలపై వినతిపత్రం అందజేస్తారని పేర్కొన్నారు. జీడీకే-2వ గనిలో 190/240 మస్టర్లు నిండిన బదిలీవర్కర్లను పైక్యేటగిరీలో పనిచేయించుకుంటూ తదనుగుణంగా వేతనం ఇవ్వకుండా యాజమాన్యం వేధిసోందని తెలిపారు. వెంటనే వారికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.సదానందం, మున్నూరు రాజన్న, జి.శ్రీనివాస్, దుర్గయ్య, నర్సయ్య, ఓదెలు, సాంబయ్య, గడ్డం కృష్ణ, ఆకుల రవీందర్, ఎన్.సాగర్, ఎల్.ఆంజనేయులు, రమేశ్, ముడుసు రమేశ్, వేటు కనకయ్య, అడివి మల్లయ్య, కొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వం’ ప్రకటించకుంటే సమ్మె తప్పదు
► ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ► వి.సీతారామయ్య శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటన జూన్ 2న వెలువడకుంటే సింగరేణిలో సమ్మె తప్పదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై బుధవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని గనులపై యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిం చే మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏరియూలోని ఆర్కే-6 గనిపై జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు నేడు ప్రజాప్రతినిధులుగా పదువులు అనుభవిస్తుం డగా సకల జనుల సమ్మెతో జీతాలు పోగొట్టుకున్న కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చే స్తోందన్నారు. కార్మికులు సొంతింటి పథకంపై తాము యాజమాన్యంతో ఒప్పందం చేసుకుం టే నేడు టీబీజీకే ఎస్ నాయకులు గొడవ వల్ల అమలుకు నోచుకోలేదన్నారు. భూగర్భగను ల్లో ఉత్పత్తిని ప్రైవేటు పరం చేస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ల్యేగల శ్రీనివాస్, ఎస్కే.బాజీసైదా, సదానందం, ముస్కె సమ్మ య్య, వేణుమాధవ్, బోయిన ఓదెలు, రాజేశ్వర్‌రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలి
జైపూర్ : సింగరేణి యామాజన్యం, తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలని హెచ్ఎంఎస్ యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కె.పులయ్య తెలిపారు. మండలంలోని ఇందారం1ఏ గనిపై బుధవారం గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని హామీ ఇచ్చిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం మళ్లీ ఎన్నికల ముందు కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్మిక హక్కులను సాధించాల్సిన సంఘాలు ఉన్న హక్కులను సైతం కాపాడడంతో విఫలమైందన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం 26వ తేదీన అన్ని జీఎం కార్యాలయాల వద్ద దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు పి.రమేశ్, కొమురయ్య, నర్సయ్య, మల్లేశ్, శ్రీనివాస్, పోషం, బానయ్య, కార్మికులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీకి రాసిన బహిరంగ లేఖను జీడీకే-1,3 గ్రూప్ గనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు కష్టించి కంపెనీకి రూ.వెయ్యి కోట్లకుపైగా లాభాలు సాధించి పెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి, సకలజనుల సమ్మె వేతనాలు, కోల్ ఇండియా ఒప్పందాలను అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, హైపవర్ కమిటీ వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల ద్వారానే లాభాలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, కొమురయ్య, మచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి
బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని శిశుమందిర్ పాఠశాలలో కోల్‌బెల్ట్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ల ముందు కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వస్తే వారసత్వ ఉద్యోగాలు వస్తాయనుకుంటే అవీ రాలేదన్నారు. ఓసీపీలను అడ్డుకొంటామని, అవి రాకుండా అడ్డంగా కుర్చీ వేసుకుంటామని చెప్పిన ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఓసీపీలను ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఘన సన్మానం.. పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా కోల్‌బెల్ట్ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల రవి, యువజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డిల ఆధ్వర్యంలో మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మున్నారాజ్‌సిసోడియా, నాయకులు బుద్దె రాజన్న, గోళ్ల మహేందర్, స్వామిరెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మల్లక్క, వినోద పాల్గొన్నారు.