సింగరేణిలో కొత్త గనులపై ముఖ్యమంత్రి ప్రకటన
శాసనసభలో గురువారం ప్రకటించిన సీఎం కేసీఆర్
ఇప్పటికే సర్వే పూర్తయిన గనులతోపాటు కొత్త
ప్రతిపాదనలు తెరపైకి.. ఈ ఏడాది కొన్ని ఓపెన్
కాస్ట్‌లకు మోక్షం ఐదేళ్లలో మిగతా గనులు
వారసత్వ ఉద్యోగాలతోపాటు కొత్త తరానికి పెరగనున్న అవకాశాలు
మంచిర్యాల : సిరుల వెలుగుల సింగరేణి రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులతో కొత్త పుంతలు తొక్కబోతోంది. దశాబ్దాలుగా కార్మికులు కోరుతున్న కొత్త గనుల కల సాకారం కాబోతోంది. బొగ్గు ఉత్పత్తితో ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు కల్పతరువుగా నిలిచిన ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో తన పరిధిని మరింత విస్తృతం చేయనుంది. సింగరేణి పరిధిలోని ఐదు జిల్లాల్లో కొత్తగా 31 గనులు ప్రారంభించనున్నట్లు గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించడమే అందుకు నిదర్శనం. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టుల్లో 20 ఓపెన్ కాస్ట్‌లు కాగా, 11 భూగర్భ గనులు. ఈ గనులతో కొత్తగా 11,621 ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, బొగ్గు గనులపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందనడంలో సందేహం లేదు. అన్నీ సకాలంలో జరిగితే ఇప్పటికే సర్వే పూర్తయిన కొన్ని కొత్త ఓపెన్‌కాస్ట్‌ల పనులు ఈ సంవత్సరంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐదేళ్ల కాలపరిమితిలో అన్ని ప్రాజెక్టులు ప్రారంభించడం సింగరేణికి కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
ఇప్పటికే సిద్ధంగా ప్రాజెక్టుల ప్రణాళికలు
దాదాపు 128 ఏళ్ల క్రితం భూగర్భ బొగ్గు తవ్వకాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని ప్రభుత్వ రంగంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా సింగరేణి నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన బొగ్గు తవ్వకాలను దేశ, విదేశాలకు విస్తరించాలని సింగరేణి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాకులో పని ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా తదితర దేశాల్లో బొగ్గు ఉత్పత్తి అంశాలను పరిశీలిస్తే, 13 అంతర్జాతీయ కంపెనీలు సింగరేణితో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు క్షీణించిన నేపథ్యంలో కొంతకాలం వేచి చూసే ధోరణితో యాజమాన్యం ఉంది. అయితే.. దేశంలో మాత్రం బొగ్గు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త బ్లాక్‌లను తెరిచేందుకు ప్రణాళికలను రూపొందించింది. 27 కొత్త గనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కాగా, 17 గనులను తొలిదశలో సిద్ధం చేయాలని యాజమాన్యం భావించింది. అందులో భాగంగా బెల్లంపల్లి, కొత్తగూడెం, గోదావరిఖని, భూపాలపల్లి రీజియన్‌లలో 10 ఓపెన్‌కాస్ట్ గనులు, 7 భూగర్భ గనులను తవ్వే కార్యక్రమానికి దాదాపుగా ఆమోదం లభించింది.
కాగా.. కొత్త గనులు, ఓపెన్‌కాస్ట్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో సింగరేణి యాజమాన్యం మరిన్ని కొత్త ప్రాజెక్టులను రూపకల్పన జరిగినట్లు సీఎం ప్రకటనను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో 20 ఓపెన్‌కాస్ట్‌లు, 11 భూగర్భ బొగ్గు గనులు తవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సింగరేణిలో ప్రస్తుతం 30 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ గనులు ఉండగా, మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఓసీతో లాభాలు.. యూజీతో ఉద్యోగాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసనసభలో చెప్పిన లెక్కల ప్రకారం భూగర్భ గనుల్లో ఉత్పతిŠ?త్తకి అయ్యే ఖర్చు టన్నుకు రూ.4,118, అమ్మకం ధర రూ.2,360. అదే ఓపెన్‌కాస్ట్ గనుల విషయానికి వస్తే బొగ్గు ఉత్పత్తి వ్యయం కేవలం రూ.1204 కాగా, అమ్మకం ధర రూ. 2,008. భూగర్భ గనుల ద్వారా ఒక్కో టన్నుకు రూ.1758 నష్టం వస్తుంటే , ఓపెన్ కాస్ట్‌ల వల్ల రూ.804 లాభంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్‌ల వైపే సింగరేణి మొగ్గు చూపినప్పటికీ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని నష్టమున్నా కొత్తగా భూగర్భ గనులు తవ్వేందుకు సర్కారు ముందుకు రావడం గమనార్హం. కొత్తగా రాబోయే గనుల్లో ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం ఉండగా, లక్ష్యాలను పెంచితే నష్టాలు తగ్గుతాయని సర్కార్ ఆలోచన. కాగా కొత్త గనుల వల్ల సింగరేణి యువరక్తంతో ఉరకలేస్తుందని సర్కార్ భావిస్తోంది.
పెరిగిన బొగ్గు విక్రయాలు
విదేశీ బొగ్గుతో పాటు కోల్ ఇండియా సరఫరా చేసే బొగ్గు సింగరేణి కన్నా తక్కువకు లభిస్తుండడంతో గతంలో ఆంధ్రప్రదేశ్ మినహా తమిళనాడు, కర్ణాటకలకు చెందిన ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం బొగ్గు కొనలేదు. అయితే సింగరేణి యాజమాన్యం చేసిన కృషి ఫలితంగా ఈ రెండు రాష్ట్రాలు సింగరేణి నుంచే ప్రస్తుతం బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. అలాగే స్పాంజ్ ఐరన్, సిమెంట్, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు సైతం సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుండడంతో కొత్త గనులు ఏర్పాటు చేసినా డిమాండ్ తగ్గదని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సర్వేలు పూర్తయిన మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాజెక్టుల పనులు ఈ సంవత్సరమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
20 ఓపెన్ కాస్ట్‌లు.. 11 భూగర్భ గనులు
Published Fri, Jan 6 2017 10:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
Advertisement
Advertisement