వచ్చేసింది సైన్స్ ఎక్స్‌ప్రెస్
విజ్ఞానాన్ని, వినోదాన్ని మేళవిస్తూ కదిలే ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్’ జహీరాబాద్‌కు చేరుకుంది.
పన్నెండు బోగీలతో కూడిన ఈ రైలు విద్యార్థులను విశేషంగా అలరిస్తోంది.
జహీరాబాద్: వాతావరణ పరిస్థితుల్లో కలుగుతున్న మార్పుల పర్యావరణానికి ఏ మేరకు ముప్పు వాటిల్లుతోందనే విషయాన్ని సైన్స్ రైలు చాటి చెప్పింది. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో 12 బోగీలతో వచ్చిన సైన్స్ రైలు ఎగ్జిబిషన్‌ను అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే ఏడీఆర్ఎం పీసీ టంటా, సైన్స్ అండ్ టెక్నాలజీ జీఎం కల్యాణ్‌చక్రవర్తి సైన్స్ రైలు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
బోగీల్లో ఫొటో ప్రదర్శన
సైన్స్ రైలులో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు వీలుగా శాశ్వత ఫొటో ప్రదర్శనతో మొబైల్ రైలును రూపొందించారు.
భారీగా తరలి వచ్చిన విద్యార్థులు
సైన్స్ రైలు ప్రదర్శన మొదటి రోజు కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు తరలి వచ్చారు. సాయంత్రం కొంత రద్దీ తక్కువగా ఉండడంతో విద్యార్థులు ఆసక్తితో వాటిని చూడగలిగారు.
పలు అంశాలను తెలుసుకున్నా..
వాతావరణంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రదర్శన ద్వారా తెలుసుకున్నా. సైన్స్ ైరె లు మూలంగా అనేక విషయాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. -శిరీష, బ్రిలియంట్ స్కూల్
అన్ని విషయాలపై అవగాహన ఏర్పడింది
సైన్స్ రైలులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలన్నీ బాగున్నాయి. అన్ని విషయాలపై అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది.
-మహేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల
పర్యావరణంతోనే మానవ మనుగడ
పర్యావరణ పరిరక్షణతోనే జీవరాసుల మనుగడ ముడిపడి ఉంది. ప్రకృతికి కలుగుతున్న అనర్థాలకు గల కారణాలను ఎగ్జిబిట్ల ద్వారా తెలుసుకున్నా. నీటి సంరక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ఉపయోగాలు, ప్లాస్టిక్ వాడకంతో కలుగుతున్న అనర్థాల గురించిన ప్రదర్శన బాగుంది.
-రేణుక, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
ఒక్కో బోగీలో ఒక్కో ప్రదర్శన
* ఒకటో బోగీలో వాతావరణం, హరిత గృహ ప్రభావం, ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను పొందుపర్చారు. మార్పులు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో వివరించారు.
* రెండో బోగీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తీరు, వర్ష రుతువులో వచ్చిన మార్పులు, సముద్రంలో నీటి పెరుగుదల గుర్తించడం వంటివి ప్రదర్శించారు. నీరు, వ్యవసాయం, అడవులు, జీవ వైవిధ్యం, ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రదర్శనలు ఉన్నాయి.
* 3,4వ బోగీల్లో దైనందిన జీవితంలో మానవుడు అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు.
* 5,6 బోగీల్లో దేశం చేపడుతున్న పలు విధానాలు, ఇంకుడుగుంతల నిర్మాణం, టెక్నాలజీని ఉపయోగించి ఉద్గారాలను తగ్గించడం, కార్బన్‌ను తగ్గించే విధానం తదితర వాటిని ప్రదర్శించారు.
* 7వ బోగీలో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పందాలు, లక్ష్యాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.
* 8వ బోగీలో హ్యాండ్ ప్రింట్ గురించి వివరించారు. స్కూల్, రోడ్డు, ఆఫీసులలో ప్రతి వ్యక్తి ఏఏ అంశాలు చేయవచ్చో వివరించారు.
* 9,10వ బోగీలో బయో టెక్నాలజీ గురించి ప్రదర్శించారు. జీవ సంపద కోసం బయో టెక్నాలజీ, ప్రకృతి సంరక్షణ, రసాయన ఎకొలజీ, భారత పరిశోధన-బయో టెక్నాలజీ విభాగం అభివృద్ధికి చేపట్టిన అంశాలను వివరించారు.
* 11వ బోగీలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా గుర్తించిన ఆవిష్కరణలు ప్రదర్శనలో ఉంచారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆవిష్కరణలు, సైన్స ఎడ్యుకేషన్, డీఎస్టీ స్కాలర్షిప్లు, పథకాలు, టెక్నాలజీ కెరీర్ గురించి ప్రదర్శనలు ఉన్నాయి.
* 12వ బోగీలో 4వ తరగతి లోపు ఉండే విద్యార్థుల కోసం ఆహ్లాదకరమైన కార్యాలు, విజ్ఞాన శాస్త్రం, లెక్కలు, పర్యావరణానికి సంబంధించిన ఆటలు, పజిల్స్, కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు.