సైన్స్ ఎక్స్‌ప్రెస్ యాత్ర షురూ
న్యూఢిల్లీ: సైన్స్ ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్త యాత్ర ప్రారంభమైంది. స్థానిక సఫ్దర్‌జంగ్ స్టేషన్‌లో కేంద్ర మంత్రులు ఈ రైలును పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు. 197రోజులపాటు సాగే యాత్రలో భాగంగా ఈ రైలు 20 రాష్ట్రాల్లో 57 స్టేషన్‌లలో ఆగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చేరుకున్న తర్వాత ఈ యాత్ర ముగుస్తుంది. కాగా ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ,పర్యావరణ, రైల్వే శాఖ మంత్రులు సంయుక్తంగా పాల్గొన్నారు. జీవవైవిధ్యం, సముద్ర జలచరాలకు సంబంధించిన బొమ్మలు, సమాచారం తదితరాలు ఇందులో అందుబాటులో ఉం టాయి. వాటి ఆవాసం, ఆహారపు అలవాట్లను కూడా అందులో పొందుపరిచారు. ఈ రైలు దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలమీదుగా తనయాత్రను కొనసాగిస్తుంది.
అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం వెళ్లదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ‘మన దేశంలో జీవవైవిధ్యానికి కొదవేలేదు. అయితే ఈ విశ్వంలోని భూమిలో మన వాటా కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ జీవవైవిధ్యం వాటా ఎనిమిది శాతంగా ఉంది. దీనిని మనం మన ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని విద్యార్థుల హృదయాలకు హత్తుకుపోయేవిధంగా తెలియజేయగలిగితే వారు ప్రకృతికి హాని కలగనివ్వరు’ అని అన్నారు. ఈ రైలు యాత్ర ఏడాదిపాటు కొనసాగేలా చూడాలని రైల్వే మంత్రికి సూచించారు.