దూడలపై శ్రద్ధే అభివృద్ధికి సోపానం
పాడి పరిశ్రమ రైతుకు లాభదాయకంగా ఉండాలంటే శాస్త్రీయ పద్ధతిలో దూడల పోషణపై శ్రద్ధ చూపక తప్పదు. నేటి పెయ్య దూడే రేపటి పాడి పశువు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ వ్యయ ప్రయాసలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు, మేలు జాతి పెయ్య దూడలకు సరైన పోషణ అందించినట్లయితే చౌకగా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు.
దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా ఆరు మాసాల చూడి నుంచి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు తాగించినట్లయితే దూడకు నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు.
దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 1 దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుంచి, నోటిలో నుంచి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. 2 ఈనగానే తల్లి దూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది. అలా కాని పక్షంలో, శుభ్రమైన గోనె పట్టాతో లేదా వరి గడ్డితో శరీరంపై రుద్ది శుభ్రం చేయాలి.
దూడకు జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి: జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిను ‘ఎ’ ఎక్కువ పాళ్లలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ఆంటిబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జున్నుపాలు సమృద్ధిగా తాగిన దూడకు 6 నెలల వరకు వ్యాధినిరోధకశక్తి లభిస్తుంది. దూడ ఆరోగ్యంగా త్వరగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మరో ముఖ్య విషయమేమిటంటే.. దూడకు జున్నుపాలు ఈనిన పావుగంట లేదా అరగంట లోపలే అందివ్వాలి. ఈ సమయంలోనే జున్నుపాలలోని రోగనిరోధకశక్తిని కలిగించే ఆంటీబాడీస్ దూడ శరీరానికి పూర్తిగా అందుతాయి. ఆలస్యమైతే ఈ ఆంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది.
దూడకు ఆహారం: పాలు: దూడకు తన శరీర బరువులో పదోవంతు పాలు అవసరం. దూడ శరీరం 20 కిలోలుంటే, దానికి రోజుకు 2 లీటర్ల పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు నెలల వయస్సు వరకు సరాసరి రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు తాగించాల్సిన అవసరం లేకుండా గడ్డి, దాణాతో పోషించవచ్చు. ఈ మూడు నెలల్లో సుమారు 240 లీటర్ల పాలు దూడకు అవసరం ఉంటుంది.
ప్రత్యేక దాణా: దూడలకు త్వరగా జీర్ణమై, పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలు గల దాణాను, పాలతోపాటు రెండోనెల నుంచి తినటం అలవాటు చేయాలి. దూడల దాణాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పీచుపదార్థాలు ఉండాలి. దూడల దాణాను ఈ కింది దాణా దినుసులను ఆయా పాళ్లలో కలిపి రైతులు తయారు చేసుకోవచ్చు: (1) జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యాలు 40 పాళ్లు (2) వేరుశనగ పిండి 30 పాళ్లు. (3) తవుడు 10 పాళ్లు (4) చేపల పొడి 7 పాళ్లు (5) బెల్లపు మడ్డి 10 పాళ్లు (6) ఖనిజ లవణాల మిశ్రమం 3 పాళ్లు.