శాస్త్రీయ వ్యవసాయం చేయండి: కేసీఆర్
* ఫెర్టిలైజర్ షాపు వాళ్లు చెప్పిన మందులు కాదు..
* జూన్‌లో రైతు సమస్యల అధ్యయనం కోసం బస్సుయాత్ర చేస్తా..
* రైతులతో ముఖాముఖిలో సీఎం కేసీఆర్
నల్లగొండ రూరల్: ‘నా ఫాంహౌజ్‌లో పనిచేసే సూపర్‌వైజర్ మొక్కలకు డ్రిప్ ద్వారా ఫెర్టిలైజర్, నీళ్లు ఇడుస్తడు. డ్రిప్ ద్వారా మొక్కలకు ఐదు నిమిషాలు ఫెర్టిలైజర్ స్ప్రే చేసిన తర్వాత 10-15 నిమిషాలు డ్రిప్ ఆపేస్తడు. ఆ తర్వాత మళ్లీ డ్రిప్ ఇడుస్తడు. అలా ఎందుకు చేస్తున్నావని అడిగా... ‘మధ్య మధ్యలో డ్రిప్ ఆపకపోతే ఫెర్టిలైజర్ కానీ, నీళ్లు కానీ ఎక్కువగా భూమి లోపలికి పోతాయి. మొక్క కంటే కిందికి వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. మధ్యలో ఆపితే అవి వేర్ల వరకు వెళ్లి పదును చేస్తాయి. మధ్యలో ఆపకపోతే ఫెర్టిలైజర్ కానీ, నీళ్లు కానీ దుర్వినియోగం అవుతాయి’ అని చెప్పాడు. ఇలాంటి వ్యవసాయ మెళకువల గురించి రైతులు అవగాహన పెంచుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. సేద్యం విషయంలో రైతు నుంచి ఎలాంటి లోపమూ ఉండకూడదు.’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. నల్లగొండ పట్టణంలో ఆదివారం జరిగిన రైతు బోర్ల రాంరెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ విందుకు వచ్చిన రైతులు చిలుక విద్యాసాగర్‌రెడ్డి తదితరులతో కలసి భోజనం చేశారు. అన్నం, ఆలుగడ్డ, వంకాయ, పప్పు కూరలు, గుడ్డు, పెరుగు వేసుకుని భోజనం చేసిన సీఎం ఈ సందర్భంగా గంటకు పైగా రైతులతో మాట్లాడి వ్యవసాయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రైతు అయిన ఆయన తనతో మాట్లాడిన రైతులకు పలు సలహాలు కూడా ఇచ్చారు.