సొంత కణాలతో.. కొత్త ముక్కు
లండన్: ప్రమాదాల్లోనో, కేన్సర్ కారణంగానో ముక్కును పోగొట్టుకున్నవారికి శుభవార్త. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కార్టిలేజ్ (మృదులాస్థి)తో ముక్కును పూర్తిస్థాయిలో రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇవాన్ మార్టిన్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ తరహా శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు కూడా.
ముందుగా బాధితుల ముక్కులోని కార్టిలేజ్ కణాలను తీసుకుని.. టిష్యూ ఇంజనీరింగ్ (కణజాల వర్థనం) పద్ధతిలో కొల్లాజెన్ మెంబ్రేన్‌గా అభివృద్ధి చేశారు. అనంతరం దానిని బాధితుల్లో దెబ్బతిన్న ముక్కు భాగానికి అనుగుణంగా.. అవసరమైన ఆకారంలోకి మలిచి.. శస్త్రచికిత్స చేసి అమర్చారు.
అయితే, 76 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురికి ఈ తరహా శస్త్రచికిత్స చేశామని ఇవాన్ మార్టిన్ చెప్పారు. శస్త్రచికిత్స చేసిన ఆనవాళ్లు ఏడాదిలోగా మాయమయ్యాయని, ఇతర దుష్ర్పభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు. ముక్కుతో పాటు చెవులు, కనురెప్పలు వంటివి దెబ్బతిన్నప్పుడు కూడా ఈ తరహా చికిత్స చేయవచ్చని పేర్కొన్నారు.