Sea transport
-
AP: జలరవాణా పెంపు లక్ష్యం
సాక్షి, అమరావతి: ఒక వస్తువు ధర నిర్ణయంలో కీలకమైన సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లాభాన్ని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిసారించింది. ఇందుకోసం జలరవాణాను పెంచడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందిస్తోంది. కొత్త పోర్టుల ఏర్పాటు.. పాత పోర్టుల అభివృద్ధికి తోడు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేస్తోంది. అలాగే, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో జలరవాణా సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పోర్టుల ద్వారా 173 మిలియన్ టన్నులు రవాణా అవుతుండగా.. 2026 నాటికి అదనంగా మరో 350 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయనుంది. అలాగే, రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతో పాటు గంగవరం, కాకినాడలోని రెండు పోర్టులు, కృష్ణపట్నం పోర్టుల సరుకు రవాణా సామర్థ్యం 327.58 మిలియన్ టన్నులు ఉన్నప్పటికీ ఇందులో కేవలం 173 మిలియన్ టన్నులు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. మెరుగైన లాజిస్టిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. కృష్ణపట్నం, కాకినాడ రేవుల సమీపంలో రెండు భారీ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు గిడ్డంగులు వంటి ఇతర సౌకర్యాలను పెంచడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఏపీ లాజిస్టిక్ పాలసీ 2021–26ను తీసుకురానుంది. జలరవాణాలో టన్నుకు రూ.1.06 ఖర్చు ఒక వస్తువు ధరలో సుమారు 50 శాతం సరుకు రవాణా వ్యయమే ఉంటుంది. దీనిని ఎంత తగ్గించుకుంటే అంత చౌకగా వస్తువులను అందించవచ్చు. రహదారుల ద్వారా ఒక టన్ను సరుకును కి.మీ దూరం తీసుకెళ్లడానికి రూ.2.58లు వ్యయమైతే.. రైల్ ద్వారా రూ.1.41, జలరవాణా ద్వారా రూ.1.06 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, మన రాష్ట్రంలో జరుగుతున్న సరుకు రవాణాలో 58 శాతం.. అధిక వ్యయం అయ్యే రోడ్డు రవాణా ద్వారానే జరుగుతోంది. 35 శాతం రైల్ ద్వారా.. 6 శాతం జలరవాణా ద్వారా ఒక శాతం ఆకాశయానం ద్వారా జరుగుతోంది. ఇప్పుడు రోడ్డు రవాణాను తగ్గించి రైలు, జలరవాణాను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. రైల్వేల ద్వారా ప్రస్తుతం 94.33 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా దీనిని 2026 నాటికి 188 మిలియన్ టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మూడు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. ఖరగ్‌పూర్–విజయవాడ, నాగపూర్–విజయవాడ, చెన్నై–విజయవాడ మార్గాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ–ముక్త్యాల మధ్య ఇన్‌ల్యాండ్ జలమార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. -
పోర్టు సిగలో మరో నగ
- సముద్ర రవాణాకు ‘గ్రీన్‌చానల్ ’ - విశాఖ పోర్టు సిద్ధం చేస్తున్న కొత్త బెర్త్ - రూ.90 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి - 1.5 మిలియన్ టన్నుల టర్నోవర్ లక్ష్యం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు బీజం పడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెర్తులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా గ్రీన్‌చానల్ బెర్త్‌ను నిర్మించేందుకు పోర్టు ట్రస్ట్ సన్నాహాలు చేస్తుంది. ఏడాదిలోగా దీన్ని పూర్తిచేస్తే భారీ నౌకలు సైతం నేరుగా ఇన్నర్ చానల్‌కు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం 11 మీటర్ల లార్డ్స్(నౌక) మాత్రమే ఇన్నర్ ఛానల్లోకి వెళ్లగలుగుతున్నాయి. అంతకన్నా పెద్దవి వస్తే వాటిని అవుటర్‌లో లైట్నింగ్ చేయాల్సి వస్తోంది. కనీసం 18.5 మీటర్ల డ్రాఫ్ట్ ఉంటే తప్ప సూపర్ కేప్ వెళ్లలేవు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తొలి దశలో 14.5 లార్డ్స్ వచ్చేలా హార్బర్‌ను విస్తరించనున్నారు. పాతవి ఐదు బెర్త్‌లు తొలగించి వాటి స్థానంలో కొత్త బెర్త్‌లు నిర్మించనున్నారు. దానిలో భాగంగా గ్రీన్‌చానల్ బెర్త్ సిద్ధమవుతోంది. పోర్టులో ప్రస్తుతం ఇన్నర్ హార్బర్లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. అవుటర్‌లో ఎస్పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. తొమ్మిది నెలల్లో గ్రీన్ చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి విడత రూ.45 కోట్లు, మలివిడత రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనిలో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేటాయిస్తుంది. ఈ బెర్త్ అందుబాటులోకి వస్తే 1.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. పోర్టులో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్న ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. గ్రీన్‌చానల్ బెర్త్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఇనుము, సిమెంట్ లావాదేవీలు నిర్వహించనున్నట్లు పోర్టు వర్గాల సమాచారం. యూరప్ దేశాలలో 40 శాతం సరుకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7 శాతం మాత్రమే జరుగుతోంది. నిజానికి ఒక టన్ను సరుకు రోడ్డు మార్గంలో రవాణా చేయడానికి అయ్యే ఖర్చులో సగానికే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతో పాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత పోర్టులను అభివృద్ధి చేసి సముద్ర రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే విశాఖ పోర్టుకు నిధుల సాయం చేయడం ద్వారా గ్రీన్‌చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.