AP: జలరవాణా పెంపు లక్ష్యం | AP Govt Focus On Increased Investment Through Sea Transportation | Sakshi
Sakshi News home page

AP: జలరవాణా పెంపు లక్ష్యం

Published Sat, Jul 31 2021 8:01 AM | Last Updated on Sat, Jul 31 2021 8:01 AM

AP Govt Focus On Increased Investment Through Sea Transportation - Sakshi

సాక్షి, అమరావతి: ఒక వస్తువు ధర నిర్ణయంలో కీలకమైన సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లాభాన్ని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిసారించింది. ఇందుకోసం జలరవాణాను పెంచడంతో పాటు లాజిస్టిక్స్‌ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందిస్తోంది. కొత్త పోర్టుల ఏర్పాటు.. పాత పోర్టుల అభివృద్ధికి తోడు లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేస్తోంది. అలాగే, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో జలరవాణా సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం పోర్టుల ద్వారా 173 మిలియన్‌ టన్నులు రవాణా అవుతుండగా.. 2026 నాటికి అదనంగా మరో 350 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయనుంది. అలాగే, రాష్ట్రంలో విశాఖ మేజర్‌ పోర్టుతో పాటు గంగవరం, కాకినాడలోని రెండు పోర్టులు, కృష్ణపట్నం పోర్టుల సరుకు రవాణా సామర్థ్యం 327.58 మిలియన్‌ టన్నులు ఉన్నప్పటికీ ఇందులో కేవలం 173 మిలియన్‌ టన్నులు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం.

మెరుగైన లాజిస్టిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. కృష్ణపట్నం, కాకినాడ రేవుల సమీపంలో రెండు భారీ మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు గిడ్డంగులు వంటి ఇతర సౌకర్యాలను పెంచడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఏపీ లాజిస్టిక్‌ పాలసీ 2021–26ను తీసుకురానుంది.

జలరవాణాలో టన్నుకు రూ.1.06 ఖర్చు
ఒక వస్తువు ధరలో సుమారు 50 శాతం సరుకు రవాణా వ్యయమే ఉంటుంది. దీనిని ఎంత తగ్గించుకుంటే అంత చౌకగా వస్తువులను అందించవచ్చు. రహదారుల ద్వారా ఒక టన్ను సరుకును కి.మీ దూరం తీసుకెళ్లడానికి రూ.2.58లు వ్యయమైతే.. రైల్‌ ద్వారా రూ.1.41, జలరవాణా ద్వారా రూ.1.06 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, మన రాష్ట్రంలో జరుగుతున్న సరుకు రవాణాలో 58 శాతం.. అధిక వ్యయం అయ్యే రోడ్డు రవాణా ద్వారానే జరుగుతోంది. 35 శాతం రైల్‌ ద్వారా.. 6 శాతం జలరవాణా ద్వారా ఒక శాతం ఆకాశయానం ద్వారా జరుగుతోంది.

ఇప్పుడు రోడ్డు రవాణాను తగ్గించి రైలు, జలరవాణాను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. రైల్వేల ద్వారా ప్రస్తుతం 94.33 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా దీనిని 2026 నాటికి 188 మిలియన్‌ టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మూడు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. ఖరగ్‌పూర్‌–విజయవాడ, నాగపూర్‌–విజయవాడ, చెన్నై–విజయవాడ మార్గాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ–ముక్త్యాల మధ్య ఇన్‌ల్యాండ్‌ జలమార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement