ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలి
గద్వాల : డిగ్రీ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆన్లైన్ ప్రవేశాల కారణంగా చాలామంది విద్యార్థులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా పేద విద్యార్థులు అనేక మంది సక్రమంగా నమోదు చేసుకోలేదని, దీంతో వారు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో చర్చించి తక్షణ ప్రవేశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, సతీష్, నంద, ప్రసాద్, జితేందర్, మాధవ్, అనిల్, భాను, సాయి, శ్రీకాంత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.